లోక్సభ ఎన్నికల్లో భారతీయ ఓటరు ఇచ్చిన తీర్పు చాలా రకాలుగా చరిత్రాత్మకమైంది. ‘చార్ సౌ పార్’ అంటూ లేని బలాన్ని ఊహించుకొని ఊదరగొట్టిన బీజేపీని ఈ ఎన్నికలు ఖంగుతినిపించాయి. పోయినసారి సాధించుకున్న సొంత మెజారిటీ ఈసారి చేజారిపోయింది. ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ మార్కు దాటినా ప్రధాని నరేంద్ర మోదీ అప్రతిహత ప్రస్థానానికి బ్రేక్ పడింది. నేనే సర్వశక్తిమంతుడిని అంటూ ఆయన చేసిన ప్రచారం ఎదురుతిరిగింది. దైవాంశ సంభూతుడిని అంటూ, ఒక దశలో నేనే దైవాన్ని అంటూ తనకు తాను ఆపాదించుకున్న శక్తులన్నీ ఉత్తవేనని తిరుగులేకుండా తేలిపోయింది.
ఇప్పుడు బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీ మాత్రమేనన్నది గుర్తుంచుకోవాలి. ఎన్డీయే మిత్రపక్షాల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. ఎన్డీయే కూటమి విజయంలో పరాజయ భావన, ఇండియా కూటమి పరాజయంలో విజయభావన తొంగిచూడటం ఈసారి ఓటరు తీర్పు ప్రత్యేకతగా చెప్పుకోవాలేమో. మోదీ మ్యాజిక్ అనేది పనిచేయలేదని ఓటరు తీర్పు తిరుగులేని విధంగా రుజువుచేసింది. దీంతో తదుపరి ప్రధాని ఎవరనే ఊహాగానాలు వెల్లువెత్తడం, చివరికి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే దాకా విశ్లేషణలు దూసుకుపోవడం విశేషం.
బీజేపీ గ్యారంటీ కాదు, ఇది నా గ్యారంటీ అంటూ మోదీ ప్రదర్శించిన స్వీయ వ్యామోహం బెడిసికొట్టింది. అంతటా తానై, దిగజారుడు ప్రచారాలు జరిపినా అంతిమ ఫలితం అంత సానుకూలంగా రాలేదన్నది వాస్తవం. మోదీ అహంకారాన్ని ప్రజలు తిరస్కరించారని చెప్పాలి. మర్యాదా పురుషోత్తముడైన రాముడు మోదీ మార్కు అహంకారపూరిత రాజకీయాలకు కలిసి రాకపోవడం గమనార్హం. యూపీ ఫలితాలు ఇందుకు పెద్ద ఉదాహరణ. దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలన్నది యూపీ నిర్ణయిస్తుందని అంటారు. అక్కడి ప్రజలు బీజేపీ నుంచి ముఖం తిప్పుకోవడం దేశ రాజకీయాల్లో మామూలు విషయం కాదు.
అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం ఓ తార్కాణం. మోదీ తన ఎన్నికల ప్రసంగాల్లో తన పదేండ్ల పాలన గురించి గానీ, గెలిస్తే చేపట్టే కార్యక్రమాల గురించి గానీ ఎక్కువగా మాట్లాడలేదు. విపక్ష ఇండియా కూటమి గురించి, ముఖ్యంగా కాంగ్రెస్ గురించి బెదరగొట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇండియా కూటమి గణనీయమైన స్థానాలు చేజిక్కించుకోవడం దీన్ని సూచిస్తున్నది. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఎక్కుపెట్టిన అసాధారణమైన విమర్శలు బలాన్ని పెంచలేకపోయాయి. రాజ్యాంగాన్ని మారుస్తారన్న సంకేతాలూ మోదీ టీంను దెబ్బకొట్టాయి. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని ఇండియా కూటమి వెనుకబడిన వర్గాల్లో భయాందోళనలు కల్పించడానికి ఇది అవకాశం కల్పించింది.
ఇండియా కూటమి బలం పెరగడం మోదీకి గానీ, బీజేపీకి గానీ మింగుడుపడే విషయం కాదు. రాహుల్ గాంధీ ఇండియా కూటమిని చాలావరకు బయటపడేయగలిగినా మెజారిటీ మాత్రం అందకుండానే ఉండిపోయింది. ఏదేమైనప్పటికీ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే పరిస్థితి అయితే లేదన్నది వాస్తవం. ఏ ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ ఇవ్వకుండా ఓటరు ఇచ్చిన తీర్పు మరోసారి సంకీర్ణ ప్రభుత్వాల ప్రాబల్యతను నొక్కిచెప్పింది. సంకీర్ణంలో ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పడం ఎటూ ఉంటుంది. దెబ్బతిన్న సమాఖ్య స్ఫూర్తిని ఇది కొంత మెరుగుపరిచే అవకాశం ఉన్నది. అధికార యంత్రాంగంపై, న్యాయవ్యవస్థపై ఒత్తిడి తగ్గి ఊపిరి పీల్చుకుంటాయని భావించవచ్చు. మొత్తం మీద మోదీ-షా తరహా కక్షపూరిత రాజకీయాలకు ఈ ఎన్నికలు తెరదించినట్టే కనిపిస్తున్నది. భారత ఓటరుకు అభినందనలు.