చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే తీరుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నది. మాట మాట్లాడితే జాతీయవాదులమని చెప్పుకొనేవాళ్లు జాతి సంపదను ఏ విధంగా అస్మదీయులకు ధారాదత్తం చేస్తున్నారో మంత్రి కేటీఆర్ కళ్లకు కట్టినట్లు వివరించారు. మోదా నీ వెనుక ఉన్న అక్రమాలు మరోమారు బట్టబయలయ్యాయి. ఇటు తెలంగాణను, అటు ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకోకుండా.. రూ.ఆరు లక్షల కోట్ల విలువైన బైలాడిలా ఉక్కు ఖనిజం నిక్షేపాలను మోదీ సర్కారు అదానీకి అప్పగించటం దిగ్భ్రాంతికరం.
ఛత్తీస్‌గఢ్-ఒడిశాలోని బైలాడిలా గనులు తెలంగాణలోని బయ్యారానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఏపీలోని వైజాగ్‌కు 600 కిలోమీటర్ల దూరం లో ఉన్నాయి. ఈ రెండూ కాదని, 1800 కిలోమీటర్ల దూరంలో గుజరాత్‌లోని ముంద్రాలో ఉన్న అదానీ ఉక్కు కర్మాగారానికి బైలాడిలా గనులను కేటాయించారు. బీజేపీ ప్రభుత్వం ప్రవచించే దేశభక్తి, జాతీయత అన్నీ నేతి బీరకాయలోని నెయ్యి వంటివని ఈ ఉదంతం నిరూపిస్తున్నది.
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం.. తెలంగాణలోని బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయాలి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రధానికి, కేంద్ర మంత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆ బాధ్యత నెరవేర్చటానికి మోదీకి చేతులు రాలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానికంగా ఉన్న వేలాదిమంది యువతకు, ముఖ్యం గా గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. అంతేగాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన ఉక్కు అందుబాటులోకి వస్తుంది. ఇంతటి ప్రజాప్రయోజనం ఉన్నప్పటికీ కేంద్రం మొండిచెయ్యే చూపింది. మరోవైపు ఏపీలోని రూ. 1.5 లక్షల కోట్ల విలువైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అడ్డికి పావుశేరు కింద అమ్మటానికి ప్రయత్నిస్తున్న కేంద్రానికి.. బైలాడిలా గనులను కేటాయించి ఆ ప్లాంట్‌ను నిలబెడుదామన్న ఆలోచన లేకుండాపోయింది.
బ్యాంకులను, ఎల్ఐసీని, రైల్వేను, పోర్టులను, విమానాశ్రయాలను, గనులను అదానీ సేవకు అంకితం చేస్తున్న కేంద్రం.. ‘లాభాలు దోస్తులకు, నష్టాలు దేశానికి’ విధానాన్ని అమలులో పెడుతున్నది. సహజ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ఇష్టారీతిన పంచుతున్నది. దీనికి పూర్తి భిన్నంగా.. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ విషయంలో తెలంగాణ దేశానికే ఒక సమున్నత ఉదాహరణగా నిలుస్తున్నది. రాష్ట్రంలో భారీ ఎత్తున చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం బీహెచ్ఈఎల్కు అప్పగించింది. రైతుబీమా, నేతన్న బీమాలను ఎల్ఐసీకి ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, బిల్ట్ (రేయాన్స్) పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు కబంధ హస్తాల్లో పడకుండా అడ్డుగా నిలుస్తున్నది. మోదీ సర్కార్‌కు, కేసీఆర్ సర్కారుకు ఉన్న తేడా ఇదీ!