కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చేస్తామని ఆడంబరంగా చెప్పినవి ఏవీ చేయలేదు. వాళ్లు చేయరు అని కూడా ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరంగానూ’ అన్నట్టు సీఎం రేవంత్ వాచాలత ఓవైపు ప్రజలకు విసుగు తెప్పిస్తున్నది. చేతగాని, చేవ లేని ప్రభుత్వం ఇక్కడిది తీసి అక్కడ పెట్టడం మినహా పనికొచ్చే పని ఏదీ చేయలేకపోయిందన్నది వాస్తవం. అందుకే ప్రజలు నిలదీయడం కూడా మొదలైంది. రైతులు ఎరువుల కోసం, యువకులు ఉద్యోగాల కోసం రోడ్డెక్కడం నిత్యకృత్యమయ్యాయి. ఈ సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కోతికొమ్మచ్చులాడటం మొదలుపెట్టారు. ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక చిహ్నాల మీద ఆయన దృష్టి పడింది. ఇప్పుడు తాజాగా జిల్లాల మీద పడింది. సంక్షేమం సడుగులిరిగి, పరిపాలన పడకేసింది.
ఆ సంగతి చూసుకోవాల్సిన రేవంత్ అర్జంటుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరిట మరో పనికిమాలిన తంతుకు తెర తీశారు. జనాభా ప్రాతిపదికపై జిల్లాలను మారుస్తామని వల్లె వేస్తున్నారు. కొన్ని జిల్లాలు, మండలాల్లో అధిక జనాభా, మరికొన్నింటిలో అతి తక్కువ జనాభా ఉన్నారట! అలా ఉండకూడదట! పది శాతం అటూ ఇటూ ఉండాలి కానీ ఎక్కువ తేడా ఉండొద్దనేది సీఎం తర్కంగా ఉంది. అసలు ఆయనకు పరిపాలన అనుభవం లేనట్టుగానే, దేశంలోని వైవిధ్యం పట్ల అవగాహన కూడా లేదని దీన్ని బట్టి అర్థమవుతున్నది. దేశంలో రాష్ర్టాలు ఒక్క సైజులో ఉండవు. ఈశాన్యంలో చిన్న చిన్న రాష్ర్టాలు ఉంటాయి. విభజన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రంగానే ఉంది. అదే విధంగా తెలంగాణలోనూ విభిన్నమైన యాసలున్నాయి. నైసర్గికత, వేషభూషలు, సంస్కృతి, సంప్రదాయాలు కూడా జిల్లా జిల్లాకు విభిన్నంగా ఉంటాయి. వైవిధ్యంతో అలరారే తెలంగాణలోనూ పెద్ద జిల్లాలు, చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. అన్నిటినీ ఒకే సైజుకు కుదించడమంటే చేతికుండే ఐదు వేళ్లను సమం చేయాలని వాదించడమే అవుతుంది.
జన సంఖ్య ఎప్పుడూ పరిపాలనా యూనిట్‌కు ప్రామాణికం కాదు. అందుకే పరిపాలనా సౌలభ్యం, సంస్కృతి, సంప్రదాయాలే గీటురాయిగా తెలంగాణ ప్రథమ సీఎం కేసీఆర్ జిల్లాల సంఖ్యను పెంచారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడి అవి అస్తిత్వంలోకి వచ్చేశాయి. ఇప్పుడు ‘రెడ్డొచ్చె.. మొదలాడు’ అన్నట్టుగా అనుకోని రీతిలో అధికారం అందిపుచ్చుకున్న రేవంత్ జిల్లాల వ్యవస్థను అతలాకుతలం చేసే వికృత క్రీడకు పాచికలు వేస్తున్నారు. కేసీఆర్ మీద అక్కసు తప్ప ఈ తిక్క రాజకీయాలకు మరో కారణం కనిపించదు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తాను అని ఎగిరెగిరిపడే రేవంత్ కలెక్టరేట్లు కూలుస్తరా? అసలు జనాభాయే ప్రతిపాదిక అనుకున్నట్టయితే సీఎం రేవంత్ తాను చేపట్టిన జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో ఆ సూత్రాన్ని ఎందుకు పాటించ లేదు? నాలుగు కమిషనరేట్లను సమంగా ఎందుకు విభజించలేదు? కేసీఆర్ చేసినవన్నీ మార్చి పడేస్తా అనేది అవివేకపు, మూర్ఖపు ఆలోచన. ఆయన తెలంగాణ తెచ్చారు. మరి ఈయన తెగనమ్ముతారా? ఆయన సాధించిన అభివృద్ధిని పండబెడ్తరా? ఆయన కట్టిన సౌధాన్ని కూలగొడ్తరా?
ఇప్పుడు ఉన్నట్టుండి జిల్లాల సర్దుబాటు ఎందుకు చేస్తున్నట్టో? పునర్వ్యవస్థీకరణ పేరిట జిల్లాల కుదింపు జరుగుతుందనే మాట వినిపిస్తున్నది. జిల్లాల కుదింపుతో ఉద్యోగాల భర్తీ మళ్లీ కోల్డ్ స్టోరేజీలో పడుతుందనే ఆందోళన సర్వత్రా వినిపిస్తున్నది. ఉద్యోగాలే కాదు.. రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రాజకీయ పదవులూ తగ్గుతాయి. కేంద్రానికి రాష్ర్టాలు కాకుండా జిల్లాలే పరిపాలన యూనిట్లుగా ఉంటాయి. ఒక్కో జిల్లాకు కేంద్రం తన వంతుగా చేయాల్సినవి ఎన్నో ఉంటాయి. అది మెడికల్ కాలేజీ కావచ్చు, నవోదయ విద్యాలయం కావచ్చు. ఇలా కేంద్రం నుంచి ఎక్కువ సౌకర్యాలు రాబట్టడం కూడా కేసీఆర్ ఆలోచనలో భాగమే. అందులో చాలా వరకు రాబట్టారు కూడా. ఇప్పుడు అంతా తూచ్ అంటే ప్రజలు తిరగబడతారు. కేంద్రం నియోజక వర్గాల పునర్వ్యస్థీకరణ పేరిట దక్షిణాది రాష్ర్టాల జాతీయ పలుకుబడిని కుదించాలని యోచిస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు చేయాల్సింది జిల్లాల పునర్విభజన కాదు, అధిక నియోజక వర్గాలు సాధించడం. కేంద్రంతో కొట్లాడి రాష్ట్ర వాటాను పెంచుకోవాల్సిన సమయంలో కేసీఆర్ నిర్ణయాలను అటకెక్కించాలని తహతహలాడటం విజ్ఞత అనిపించుకోదు.