రష్యా-ఉక్రెయిన్ పోరు ప్రపంచ యుద్ధంగా మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అణ్వస్త్ర యుద్ధంగానూ పరిణమించే ప్రమాద మూ పొడసూపుతున్నది. తృటిలో ముగుస్తుందన్నట్టుగా మొదలైన ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతూ వెయ్యి రోజులు పూర్తిచేసుకున్నది. సరి గ్గా ఆ సందర్భంలోనే ఆందోళనకర ఘటనలు చోటుచేసుకున్నాయి. అమెరికా తాను ఇదివరకే సరఫరా చేసిన దీర్ఘలక్ష్య క్షిపణులను (అటాకెమ్స్) రష్యా భూభాగాల మీద ప్రయోగించేందుకు అనుమతించింది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డెమొక్రాటిక్ పక్షానికి చెందిన జో బైడెన్ అవసాన పదవీకాలంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. ఇప్పటివరకూ ఉక్రెయిన్ వీటిని రష్యా ఆక్రమిత క్రిమియా వంటి ప్రాంతాలపైనే వేసింది. ఇప్పుడు నేరుగా రష్యా భూభాగం మీద వేసేందుకు అమెరికా పచ్చజెండా ఊపడం, ఉక్రెయిన్ తెగించడం పెద్ద విషయమే. అదే అదనుగా రష్యా మీదకు ఉక్రెయిన్ ఆరు క్షిపణులను ప్రయోగించింది. సహజంగానే రష్యాకు ఈ వ్యవహారం కోపం తెప్పించింది. పశ్చిమ దేశాలు యుద్ధాన్ని ‘కొత్తదశ’కు తీసుకెళ్లాయని మండిపడ్డ రష్యా అణ్వస్ర్తాల వినియోగంపై నియంత్రణలను సడలించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అణ్వస్ర్తాల వినియోగ విధివిధానాలపై అధ్యక్షుడు పుతిన్ తాజా ఉత్తర్వులు జారీచేసినట్టు వార్తలు వస్తున్నాయి.
అమెరికా తదితర దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని యుద్ధంలో నాటో ప్రత్యక్షంగా పాల్గొనడంగా పరిగణిస్తామని రష్యా ఇదివరకే హెచ్చరించింది. తాజాగా అనేక ఇతర ఆయుధాలతో పాటుగా మందుపాతరలను కూడా సరఫరా చేసేందుకు అమెరికా ముందుకురావడం మరో కీలక పరిణామం. వైమానిక దాడులు జరుగుతాయనే సూచనలతో కీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయా న్ని మూసివేశారన్న వార్తలతో అటు పశ్చిమ యూరప్ దేశాల్లో యుద్ధభయం వ్యాపిస్తుండటం మనం గమనించవచ్చు. ఈ ఘటనల క్రమం పై సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌కు క్షిపణులు సరఫరా చేసినప్పటికీ రష్యా భూభాగంపై వాటిని ప్రయోగించేందుకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. రష్యాను దెబ్బతీసేందుకు తమ వద్ద గల అన్ని శస్ర్తాస్ర్తాలను ఉపయోగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరిస్తుండటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సి ఉన్నది.
నవంబర్‌లో జరిగిన ఎనికల్లో రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికై వచ్చే జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే సంకల్పాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందుకు అమెరికా ఆయుధ సరఫరా నిలిపివేసి, అవసరమైతే ఉక్రెయిన్ ఒక మెట్టు దిగేలా చేసి సంధి కుదుర్చాలనేది ఆయన ఆలోచన. సంధి కోసం ఆక్రమిత భూభాగాలను రష్యాకు వదిలేసేటట్టు ఒప్పిస్తానని కూడా ట్రంప్ సూచనలు వెలువరించారు. ఈ పరిస్థితుల్లో పదవీకాలం దాదాపు ముగింపునకు వచ్చిన జో బైడెన్ యుద్ధాన్ని ఎగదోసే నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది పెద్ద ప్రశ్న. ఆయుధ తయా రీ రంగం తరఫున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు అం తకంతకూ పెరుగుతున్నాయి. గతంలో ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా కు సంబంధించి బైడెన్‌పై ఆరోపణలు రావడమే అందుకు కారణం. ట్రంప్ శాంతి యత్నాలకు ఆయన అధికారంలోకి రాకముందే గండి కొడుతున్నారనే వాదనలు ప్రస్తుతం జోరందుకుంటున్నాయి. ప్రపంచపెద్దగా విర్రవీగే అమెరికాకు యుద్ధోన్మాదులతో ఈ తరహా దోబూచులాటలు ఏ మాత్రం శోభించవు. మూడో ఏడాదిలోకి ప్రవేశించిన యుద్ధాన్ని ఆపేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం తక్షణావసరం. అగ్రరాజ్య పెద్దలు ఈ సంగతి గుర్తిస్తే మంచిది.