ప్రజలకు ఇచ్చిన హామీల అమలును విస్మరించి, విలువల వలువలు విసర్జించి మాటలతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పాలకుల ముఠాల, మూటల పంచాయితీలు బజారెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ పాలన జాడ ఉంటుందో.. అక్కడ అవినీతి జాడ కనిపించడం చరిత్ర చెప్పిన పాఠం. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అనే నానుడి స్థిరపడింది. కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ పదేండ్ల పాలనలో సాగిన అవినీతి పరాకాష్టకు చేరి కాంగ్రెస్‌ను ఇంటిదారి పట్టించింది. నాటి స్కామ్‌ల పేర్లు ‘ఏ నుంచి జెడ్’ వరకు చెప్పవచ్చు.
పంచభూతాల్లో అవినీతిని చూడవచ్చు. తెలంగాణలో రాకరాక అధికారంలోకి వచ్చి పాలన వెలగబెడుతున్న కాంగ్రెస్ నేతల అవినీతి కొత్త పుంతలు తొక్కింది. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి అందినకాడికి ఆబగా దండుకుంటున్నారు. తెలంగాణకు కొంగుబంగారం, నల్లబంగారం, సిరుల సింగరేణిని కూడా హస్తం నేతలు అవినీతి అడ్డాగా మార్చుకున్నారు. సింగరేణి గనుల్లో అవినీతి వాటాల పంపకంలో తేడాలు వచ్చి.. పాలక పెద్దలు తన్నుకుని మరీ కచ్చీరులో దొరికిపోయారు. తెలంగాణ ఆస్తిని, అస్తిత్వాన్ని దెబ్బకొడుతూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. నైనీ బొగ్గు గనుల కేటాయింపు టెండర్ల వ్యవహారంలో వాటాలు కుదరక అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ పాలకుల చేతికి అవినీతి మసి అంటుకున్నది.
ప్రభుత్వరంగ సంస్థకు నష్టం జరగకుండా పరిరక్షించుకుంటూ, పారదర్శక టెండర్లను ప్రోత్సహించాలన్న సోయి మరిచి, అడ్డదారిలో ప్రైవేటుకు కట్టబెట్టి, జేబులు నింపుకోవాలని చూసిన వైనం బజారెక్కింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గనుల తవ్వకం కాంట్రాక్టు 25 ఏండ్ల కోసం టెండర్లను చేపట్టిన సర్కార్.. సైట్ విజిట్ పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఎవరైనా టెండర్లు వేయాలనుకుంటే సైట్ విజిట్ చేయాలి. సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను ప్రభుత్వ అధికారులే జారీ చేయాలి. ఇదంతా కూడా ముందే నిర్ణయించుకున్న వాళ్లకు టెండర్లు కట్టబెట్టాలన్న కుట్రలో భాగమే. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది కంపెనీకి ఇప్పటికే ఇలా టెండర్ కట్టబెట్టిన ఉదంతం కండ్ల ముందే ఉన్నది. అన్నీ ఆయనకేనా, మరి మా సంగతి ఏమిటని మంత్రులు రంగంలోకి దిగడంతో వ్యవహారం ముదిరి వీధికెక్కింది.
కాంగ్రెస్ సర్కార్ బొగ్గు కుంభకోణం బట్టబయలు కావడంతో పాత్రధారులైన వాళ్లు నిట్టనిలువునా చీలిపోయారు. అవినీతి నిప్పును ఒకరిపై ఒకరు పడేసుకుంటూ బంతాట ఆడుతున్నారు. ఆటను రక్తికట్టించేందుకు ప్రయత్నించిన ముఖ్యనేత గుమ్మడి కాయల సామెతను గుర్తుచేశారు. అనుకూల మీడియా పెద్దను రంగంలోకి దింపి.. తనకు తాను సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. అవినీతి నిజమే, కానీ ఈ యవ్వారమంతా అమాయకుడు రేవంత్‌కు తెలియకుండానే జరిగిపోయిందని కొందరు మీడియా పెద్దలు వార్తలు వండి వారుస్తున్నారు.
ఏయే మంత్రులకు ప్రమేయమున్నదో, ఎంత మేరకు ఉన్నదో, ఎవరికి లేదో ప్రైవేటు వ్యక్తులు చెప్పడమేంటి? పారదర్శక విచారణ జరగాల్సిన అవసరంలేదా? ఇదేదో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి మధ్య వ్యక్తిగత వ్యవహారం కాదు. ప్రజల ఆస్తి అయిన సింగరేణికి సంబంధించిన కుంభకోణం. ఆ బొగ్గు కుంభకోణంలో నిండా మునిగిన కాంగ్రెస్ పాలకులకు ముమ్మాటికీ అవినీతి మకిలి అంటింది. సింగరేణికి నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, కోల్ ఇండియాలోనే లేని విధంగా సైట్ విజిట్ నిబంధన తీసుకురావడమంటే బడితే ఉన్న వాడిదే బర్రె అనడమే. బొగ్గు గనుల కుంభకోణంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే పాలకపక్షం పెద్దలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి కక్షరాజకీయాలకు తెరతీశారు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన ట్యాపింగ్ కుట్రల కేసులో హరీశ్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం, విచారించడం ఇందులో భాగమే!
ప్రభుత్వ పెద్దలు ఇలా అవినీతికి పాల్పడుతుంటే, ఎలాంటి అధికార పదవుల్లో లేని కాంగ్రెస్ నేతలు కూడా.. పైవాళ్ల అండ చూసుకుని రెచ్చిపోతూ మారణాయుధాలతో బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగని కాంట్రాక్టర్లే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆవు చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? సింగరేణి బొగ్గు బావిలో మసి ఎవరికి ఎంత అంటిందో తేలాలంటే మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరమున్నది.
ఇందుకోసం కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి, తెలంగాణ బీజేపీకి పెద్దదిక్కు అని చెప్పుకునే కిషన్‌రెడ్డి ముందుకొస్తారా? చీకట్లో చేతులు కలపకపోతే, కాంగ్రెస్ నేతల చేతులకు పూసుకున్న మసి తనకు కూడా అంటి ఉండకపోతే.. తన చేతులను బయటకు చూపించాలి. అది కూడా సీబీఐ దర్యాప్తు కోరడం ద్వారా మాత్రమే. రెండేండ్లుగా కాంట్రాక్టులు, కమీషన్లతో పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఏకంగా బొగ్గు బావిలోనే కూరుకుపోయారు. కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా కేజ్రివాల్‌ను ఏడాది జైల్లో పెట్టించిన బీజేపీ సత్యహరిశ్చంద్రులు ఇంత కుంభకోణం బట్టబయలైనా నోరెందుకు మెదపడం లేదో రాష్ట్ర బీజేపీ చెప్పాలి. చోటేభాయ్ స్కాంగ్రెస్పై బడేభాయ్ ఏమంటారో.. సీబీఐ దర్యాప్తు చేయించగలరా?