గవర్నర్ అనేది రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి తలమానికంగా, రాజ్యాంగ పరిరక్షణను పర్యవేక్షించాల్సిన నామమాత్రపు పదవిగా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అంతకన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు. మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారనేది ఆచరణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే తుది మాట అని చెప్పకనే చెప్పడం. కానీ గవర్నర్లు కేంద్ర అధికార పార్టీకి తాబేదార్లుగా, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను వేధించే అనధికార కేంద్రాలుగా తయారుకావడం మనం చూస్తున్నాం. ఇటీవల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి వివాదం చిలికిచిలికి గాలివానగా మారడం, సుప్రీంకోర్టు గడప తొక్కడం తెలిసిందే. తమిళనాడు గవర్నర్ కేసులో బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడానికి సంబంధించి సుప్రీంకోర్టు కాలావధి నిర్ణయించడం గురించి ఇదివరకే చెప్పుకొన్నాం. తాజాగా రాష్ట్రపతికి నివేదించే బిల్లులపైనా స్పష్టతను ఇచ్చింది.
గవర్నర్ తన పరిశీలనకు పంపే బిల్లుల విషయంలో మూడు మాసాల్లోగా ఏదో ఒక నిర్ణయం రాష్ట్రపతి తీసుకోవాలని గడువు విధించింది. ఇందుకు సంబంధించి రాజ్యాంగంలో కాలావధి అనేది లేకపోవడం వల్ల నిరవధికంగా బిల్లులు పెండింగ్లో ఉండిపోయే పరిస్థితి ఎదురవుతున్నది. అంటే ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు కేంద్రం మోకాలడ్డు పెట్టడం జరుగుతున్నది. ఇది సమాఖ్యవాదానికి గొడ్డలిపెట్టు తప్ప మరొకటి కాదు. ఏ విషయంలోనూ అతి చేయొద్దు అనే నీతి గవర్నర్లకూ వర్తిస్తుందని ఈ తీర్పు తేల్చిచెప్పింది. ఈ తీర్పు అత్యంత కీలకమైందే కాకుండా చరిత్రాత్మకమైంది కూడా. నిరవధికంగా బిల్లును తొక్కిపెట్టడం రాజ్యాంగం నిర్వచించిన నిష్పాక్షిక విధి నిర్వహణ సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్మానించడం విశేషం. సుదీర్ఘ పర్యవసానాలకు దారితీసే మరో రెండు కీలక నిర్ణయాలు సుప్రీంకోర్టు కూడా చేసింది. ఒకటి, నిర్ణీత కాలావధిలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్ దాఖలు చేయాలని సూచించడం. రెండు, గవర్నర్ నివేదించే బిల్లులపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలని చెప్పడం.
గవర్నర్ల వ్యవస్థ హద్దుమీరిన కారణంగా చివరికి రాష్ట్రపతి నిర్ణయాధికారాల దాకా పోవాల్సిన అవసరం ఏర్పడిందన్న మాట. అయితే, రాజ్యాంగంలో లేని అంశాలను సుప్రీంకోర్టు సూచించడం న్యాయవర్గాల్లో సహజంగానే చర్చాంశం అవుతున్నది. కేంద్రంపై విమర్శలు రాకుండా ఉండేందుకు ఈ మార్గమే శరణ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్కు బిల్లులపై నిరంకుశ ‘వీటో’ అధికారం ఉండదన్న సూత్రం రాష్ట్రపతికీ వర్తిస్తుందనేది సుప్రీం కోర్టు తీర్పు సారాంశం. నిర్ణీత గడువు తర్వాత గవర్నర్ ఆమోదం లభించకపోతే బిల్లులకు రాజముద్ర పడినట్టుగానే భావించాలన్న మరో కీలక నిర్ణయం దేశ చరిత్రలోనే ఓ అసాధారణ ఘట్టానికి తెరతీసింది. ఈ ఆదేశాల ఆధారంగా తమిళనాడు ప్రభుత్వం పది బిల్లులను గవర్నర్ సంతకం లేకుండానే చట్టాలుగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అపూర్వ, అసాధారణ ఘట్టమని చెప్పాలి. కేంద్ర-రాష్ట్ర తగాదాలో ప్రస్తుతానికి తమిళనాడు విజయం సాధించింది. నిజానికిది సమాఖ్యవాదానికి లభించిన విజయంగా భావించాలి.