రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం గురించిన మాటలు ఈ మధ్య తరచుగా వినబడుతున్నాయి. ధరల హెచ్చుతగ్గుల గురించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నెల నుంచే ఈ తరహా ధోరణులు ప్రస్ఫుటంగా ముందుకురావడం గమనార్హం. పదేండ్ల పాటు పైపైకి ఎగిసిన తెలంగాణ రియల్ రంగానికి ఒక్కసారిగా బ్రేకు వేసినట్టయింది. రాష్ట్రంలో లక్షలాదిమంది ఆధారపడిన రియల్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన పారిశ్రామిక, వాణిజ్య విధానాలు గొప్ప ఊపు కల్పించాయి. ప్రభుత్వ మార్పుతో సెంటిమెంటులో తేడాలు వచ్చాయనేది పరిశీలకుల మాట. గత మూడు మాసాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు సుమారు 15 నుంచి 40 శాతం దాకా పడిపోవడంతో తదనుగుణంగా ప్రభుత్వ ఆదాయమూ తగ్గిపోయింది. మార్కెట్లో ఇలా స్తబ్ధత ఏర్పడిన ప్రస్తుత సమయంలో పులి మీద పుట్రలా ప్రభుత్వం భూముల విలువను సవరించాలని, స్టాంప్ డ్యూటీని పెంచాలని ఆలోచిస్తుండటం రియల్టీపై పిడుగుపాటులా మారింది..
రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గడం, పథకాల ఆర్థిక భారం నేపథ్యంలో ఆదాయం పెంచుకునే మార్గంగా ప్రభుత్వం రియల్టీని ఎంచుకున్నదనేది స్పష్టమే. అయితే మందగమన పరిస్థితుల్లో రేట్ల పెంపు అనేది ప్రతికూల ప్రభావం చూపిస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రెండున్నర నెలలుగా మార్కెట్ తీవ్రమైన తిరోగమనంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం ఏరకంగానూ సమర్థనీయం కాదనేది వారి వాదన. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఏర్పడితే 2021 దాకా రేట్లను ముట్టుకోలేదు. రియల్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) దాటి విస్తరించి, మార్కెట్లో బూమ్ ఏర్పడిన తర్వాతనే స్వల్పంగా రేట్లు పెంచారు. ఆ తర్వాత 2022లో మరోసారి రేట్లను సవరించినప్పటికీ క్రయవిక్రయాలపై వాటి ప్రభావం పెద్దగా పడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయిందన్న అసహనంతో రేట్ల సవరణకు పూనుకోవడం విమర్శలకు గురవుతున్నది. రాష్ట్రంలో రియల్ బూమ్ తగ్గడాన్ని స్థూలంగా పరిశీలిస్తే వ్యవసాయంతో పాటుగా అన్నిరంగాల్లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడటం, కొత్త ప్రభుత్వం స్థిరత్వం గురించిన సందేహాలు, విధానాలపై స్పష్టత కొరవడటమూ కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇబ్బడిముబ్బడిగా లే ఔట్లు, ప్లాట్లు, ఇండ్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ అవసరమైనవారు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు అవసరం లేనివారు రియల్ ఎస్టేట్ను పెట్టుబడిమార్గంగా ఎంచుకోవడం జరుగుతున్నది. డిమాండ్ తగ్గిపోవడంతో పెట్టుబడులు పెట్టినవారు ఇరుక్కుపోతున్నారు. మధ్యతరగతి పెరిగినందువల్ల కొంత మేరకు డిమాండ్ కొనసాగుతున్న మాట వాస్తవం. కానీ అది ఏ మూలకు సరిపోదు. ఏ రకంగా చూసినా ప్రస్తుతం కొనిపెట్టుకునే సమయం తప్ప అమ్మకానికి సరైన అదను కాదనేది వాస్తవం. తెలంగాణలో ఏర్పడిన స్తబ్ధత ఇప్పుడప్పుడే తెరిపినపడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం కుదురుకుని దిద్దుబాట్లు చేపట్టకపోతే మరి కొన్నేండ్లు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. మళ్లీ మంచిరోజుల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పదు!