ముసలి పులి బంగారు కడియాన్ని చూపి అమాయకులను మింగడం పాత కథ కాదు, సరికొత్త కథ. అధికారం కోసం అడ్డదారులు తొక్కే ‘హస్త’వాసి. వెయ్యిదేమున్నది? కాలరేఖపై ఓ చిన్న చుక్క. సాధించింది ఏమున్నది? అనేది తేలాల్సిన లెక్క. కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్ల పాలనకు వెయ్యి రోజులు నిండాయి. అవును.. వెయ్యి ఓ మైలురాయే. అయినా ఏ రాయి అయితేనేం నెత్తికేసి కొట్టుకోవడానికి? రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే..ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ సాధించింది శూన్యం.
ప్రజలకు మిగిలింది దైన్యం. హామీలతో ఎక్కించిన మునగచెట్టు..దశాబ్ది వైభవం నానాటికీ తీసికట్టు.. గోతికాడ నక్కలు కాచుకు కూర్చున్నాయని, మోసపోతే గోసపడుతరని కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పినా జరుగాల్సింది జరిగిపోయింది. అరచేతిలో వైకుంఠం చూపితే ఓటు చేజారింది. తెలంగాణ తీరే మారింది. తొమ్మిదిన్నరేండ్ల వెలుగులపై చీకట్లు కమ్ముకున్నయి. అందరికీ అన్నీ అంటూ ఎవరికీ ఏమీ ఇవ్వని సర్కార్..అందుకే ఒక ఉత్సాహం లేదు. ఉత్సవం లేదు. ఊరేగడానికి ఏమీ లేదు. కుడిఎడమల దగా దగా.. కుంభకోణాలు ఎగా దిగా.. ఇదే నిజం. ప్రజలకు ఎగనామం.. స్కాంగ్రెస్ అనేది సార్థకనామం.
అసలు వెయ్యి దాకా ఎందుకు? వంద రోజుల్లోనే తేలిపోయింది కదా సర్కార్ పస. కేసీఆర్ అనే మూడక్షరాలంటే కాంగ్రెస్ పాలకులకు సింహస్వప్నం. గుర్తులు చెరిపేస్తా అంటూ గుంపుమేస్త్రీ వీరంగం. కన్నంలో దొరికిన దొంగకు పట్టుకున్నోళ్లపై పగ. అక్కసుతో తిక్కరాజకీయం..తిట్ల పురాణం. వెయ్యి రోజులు. వేల వేల వెన్నుపోట్లు. మాట తప్పడాలు, మడమ తిప్పడాలు. ఇదే తంతు. తప్పు చేశామని తల పట్టుకోవడం ప్రజల వంతు.
ఇంతకూ వెయ్యి రోజుల్లో ఏం జరిగింది? ‘హస’్తగతంతో ఎవరికేం ఒరిగింది? తెలంగాణ తల్లి కళ తప్పింది. తొమ్మిదిన్నరేండ్ల వైభవం మసకబారింది. కాంగ్రెస్ ఏమీ సాధించలేదా అంటే చాలానే సాధించింది. ప్రాజెక్టులను పండబెట్టి పొలాలను ఎండబెట్టింది. పింఛన్లు ఎక్కువ ఇస్తామని ఎగేసి, ఉన్నది ఊడగొట్టింది. దండుగన్న సాగును కేసీఆర్ పండుగలా మారిస్తే కాంగ్రెస్ వచ్చి కనాకష్టంగా మార్చింది. రైతుబంధు సాయం పెంచి రైతు భరోసాగా మారుస్తామని చెప్పి పంటసాయాన్ని మంటగలిపింది. ఎరువుల కరువుతో ఏడిపించింది. తిరుగబడ్డ రైతుల రక్తం కండ్ల జూసింది. ఇదీ కాంగ్రెస్ వెయ్యి రోజుల ఘనత.
అవును..కాంగ్రెస్ చాలానే చేసింది. చెప్పుకోవాలంటే చానాచానా ఉన్నది. అందరినీ ఊరించినట్టుగానే యువతనూ ఉద్యోగాల పేరిట ఊరించింది. కోచింగ్ సెంటర్ల నడుమన హామీలను పేలాల్లా పంచింది. అధికారం దక్కాక ముంచింది, వంచించింది. ఇదేమని నిలదీస్తే యువత వీపు మీద పోలీసు లాఠీలు విరిగాయి. ‘నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలయ్యాయి’. పింఛన్లు పెంచలేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్..ఖాళీ గిఫ్ట్ కవర్లు వెక్కిరిస్తున్నాయి. ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తామన్న మాట గుంజెత్తుకూ కొరగాలేదు. పేదల విద్యకు ఉరి బిగుస్తున్నది. ప్రజారోగ్యానికి మంచం పట్టి అవసానదశకు చేరుకున్నది. చేతగాని, చేవలేని పాలనతో సంక్షేమం సడుగులు ఇరిగిపోయినయి. అభివృద్ధి ఆగమాగమైపోయింది. తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో పురోగతి మృగ్యమైంది.
అప్పులు తేవడం తప్పన్నోళ్లు తెప్పలుతెప్పలుగా తెస్తున్నరు. సంపద పెంచడం, నలుగురికీ పంచడం కేసీఆర్ విధానం. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంగా నడిపి రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత కేసీఆర్. అది నీటి మీద రాత కాదు, సువర్ణాక్షరం. చెరిపేస్తే చెరిగిపోని సంతకం. కానీ సర్కార్ మార్పుతో కథ మారింది. కన్నీరే మిగిలింది. చేతగాని, చేవలేని కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఒక్కొక్క మెట్టు కిందికి పడిపోతున్నది. రోజుకో కుంభకోణం రివాజుగా మారింది. మంత్రులే సీఎం ‘కుటుంబ పాలన’ను ఎండగడుతున్నారు. అమీతుమీ అంటూ సమరానికి సై అంటున్నారు. అందుకే వెయ్యి రోజులైతేనేం..ప్రోగ్రెస్ రిపోర్టులో హళ్లికి హళ్లి, సున్నకు సున్న వచ్చినప్పుడు. వెయ్యి రోజుల్లో రాష్ట్రం పది వేల రోజులు వెనుకకు పోయింది. సగానికి పైగా పరిపాలనా కాలం పూర్తి అయ్యింది. మిగిలిన సగం మీద ఎవరికీ ఏ ఆశలూ లేవు. ప్రజలు ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చారు ‘సారు’ వస్తేనే తమ కష్టాలకు ఫుల్స్టాప్ అని. తిరుగులేని తీర్పు చెప్పే అవకాశం కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారన్నది వెయ్యి శాతం నిజం.