రాష్ట్రమంతటా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎవరిని కదిలించినా ‘మోసపోయి గోసపడుతున్నం’ అనే మాటే వినిపిస్తున్నది. యావత్తు ప్రజానీకం ముక్తకంఠంతో సర్కారుకు శాపనార్థాలు పెడుతుంటే విద్యాధికులు మాత్రం భిన్నంగా ఎందుకు పోతారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఇదే ధోరణిని మరిం త బలంగా, ప్రస్ఫుటంగా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. పరిపాలనలో ఘోరం గా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇది వ్యక్తిగత పరాజయంగానే భావించాల్సి ఉంటుంది. రాష్ట్రం లో సమస్యలే లేవన్నట్టుగా, ఇంకా చెప్పాలంటే ఆయన దృష్టి పెట్టాల్సిన ఎస్ఎల్బీసీ వంటి ఎన్నో సమస్యలు ఎదురుచూస్తుంటే ఆయన తగుదునమ్మా అంటూ తలకెత్తుకొని మరీ ప్రచారం చేయడం తెలిసిందే. ఒకవైపు సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే సహాయ కార్యక్రమాలను సమీక్షించి, పర్యవేక్షించాల్సిన సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తలమునకలు కావడం ఏమిటి? మూడు స్థానాల్లో కేవలం ఒక స్థానంలో అధికారిక అభ్యర్థిని బరిలో దింపి, అదీ ఓడిపోవడం దిగజారిన కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పట్టడమే కాకుండా ఒక హెచ్చరికగా నిలుస్తున్నది.
ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ సెల్ఫ్‌గోల్ లాంటి మాటలు చాలానే మాట్లాడారు. ముఖ్యంగా ఉద్యోగాలు కల్పించడంపై ఆయన చెప్పిన కాకిలెక్కలు విద్యాధికులైన పట్టభద్రులు నమ్మలేదు. బీఆర్ఎస్ హయాంలో నియామక ప్రక్రియ దాదాపు పూర్తయిన ఉద్యోగాలకు నియామక పత్రాలు పంపిణీ చేసి చంకలు గుద్దుకున్న కాంగ్రెస్ సర్కారు నిర్వాకం వారికి తెలియదా? సోషల్ మీడియాలో దీనిపై ఓ ఆట ఆడుకున్నారు. మరొక అంశం బీసీ కులగణన. అదొక ప్రహసనంలా తయారైందన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంటే సీఎం రేవంత్ తమ సర్కారు అధికారంలోకి వచ్చిన 12 మాసాల్లోనే కులగణన దిగ్విజయంగా పూర్తిచేసుకున్నట్టు గొప్పగా చెప్పడం నవ్వు తెప్పించింది. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య కులరాజకీయాలపై ఆ పార్టీ బీసీ నేతలే మండిపడుతున్న నేపథ్యంలో రేవంత్ కుప్పిగంతులు ఓటర్లను మెప్పించలేకపోయాయనేది వాస్తవం. ఈ తరహాలో గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మరొకరు లేరు. పైగా ఈ స్థాయిలో ప్రచారం చేయడమూ బహుశా మరొకరికి సాధ్యం కాదేమో. ఇంత చేస్తే అంతా తారుమారైంది. తీరా ఓటమి చేరువవుతున్న కొద్దీ కింద పడినా, మీద పడినా నాదే గెలుపు అనే ధోరణిలో ప్రకటన చేసి చేతులు దులిపేసుకున్నారు. ఫలితాలకు చాలాముందే తమ అభ్యర్థి ఓడినా సర్కారుకు ధోఖా లేదనే మాటతో సీఎం రేవంత్ ముందస్తుగా ఓటమి అంగీకరించినట్టయింది.
ఒకరకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ సర్కారుపై మినీ రెఫరెండం లాంటివి. ప్రజావాణిని బలంగా ప్రతిబింబించగలిగాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరగా కాంగ్రెస్ సర్కారు గత 15 నెలల పాలనను చూసి ఓటెయ్యాలని చెప్పడం పరాకాష్ఠ. పథకాలను పండబెట్టి, పొలాలను ఎండబెట్టిన కాంగ్రెస్ పాలన గురించి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పదేండ్ల వైభవంపై చీకట్లు కమ్ముకోవడం వారు చూడలేదా? ఎన్నికల ముందు హామీల పేరిట చేసిన మోసాలు, అధికారం దక్కించుకున్న తర్వాత వేసిన వేషాలూ విద్యాధిక ఓటర్లకు తెలియదా? గ్రాడ్యుయేట్లలోని చిరుద్యోగులు, నిరుద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. సర్కారుకు గుణపాఠం చెప్పాలని ఎదురుచూస్తున్న వారిని బొట్టు పెట్టి మరీ పిలిచి తమ పార్టీని ఓడించుకున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పాలనను ఓటర్లు ఇష్టపడలేదని తెలుస్తున్నది. అధికారం లో ఉండి కూడా ఓడిపోవడం రేవంత్ నాయకత్వ పటిమను ప్రశ్నార్థకం చేస్తున్నది. సీఎంకు అండదండగా ఏడుగురు మంత్రులు, 24 మం ది శాసనసభ్యులు నెల రోజులకు పైగా హోరాహోరీగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ సర్కారుకు, విశేషించి సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఓటమి ఓ హెచ్చరిక లాంటిది.