మన భగీరథకు భారతదేశం హారతి పట్టింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు అత్యంత శుద్ధమైనవని కేంద్ర జల్‌శక్తి శాఖ జరిపిన పరిశోధనలో వెల్లడి కావటం మనందరికీ గర్వకారణం. ఇది మిషన్ భగీరథ విజయానికి నిదర్శనం. 2016లో మొదలైన ఈ పథకం కింద ఇప్పటికే తెలంగాణలో ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత తాగునీరు అందుతున్నది. దేశంలోనే ఈ విధమైన ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్ భగీరథ కింద సరఫరా చేసే నీటిని రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు 76 ల్యాబుల్లో పరీక్షిస్తుంటారు. ప్రతీ ల్యాబులో 75 రకాల పరీక్షలు జరుపుతారు. వీటితోపాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్ద సగటున గంట రెండుగంటలకొకసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన 6.8-8.2 పీహెచ్ మిషన్ భగీరథ నీళ్లలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిరంతర అప్రమత్తత కారణంగానే మన నీళ్లు దేశంలోనే అత్యంత శుద్ధమైనవిగా పేరు తెచ్చుకున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశాల్లో తాగునీరు ఒకటి. సురక్షిత తాగు నీరు దాహం తీర్చుకోవటానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికీ అత్యంత కీలకం. ఉమ్మ డి ఏపీలో కలుషిత నీరు తాగి, వ్యాధుల బారిన పడి పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో జనం పిట్టల్లా రాలిపోయేవారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనైతే ఫ్లోరోసిస్ కారణంగా వేలాది మంది శారీరక వైకల్యమనే శాపానికి గురయ్యారు. ఈ గోస తీర్చటానికి కేసీఆర్ మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఇంటింటికీ తాగునీటిని ఇవ్వకపోతే 2018 ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సాహసోపేతంగా ప్రకటించి, లక్ష్యాన్ని సాధించారు. ఒకటిన్నర లక్షల కిలోమీటర్ల పైపులైన్లతో కూడిన మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అద్భుతమే కాదు, ప్రజాసంక్షేమ పథకాలకు ఒక హైలెట్. దీనిని చూసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. బీజేపీనే అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘హర్ ఘర్ నల్, హర్ ఘర్ జల్’ పథకాన్ని అమలులో పెట్టింది. కాపీ కొట్టారుగానీ వాటిని సమర్థవంతంగా అమలు చేయలేకపోయారు. మిషన్ భగీరథ మాత్రం నిర్విఘ్నం గా కొనసాగుతూ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందుతున్నది.
మిషన్ భగీరథతో తరతరాల ఫ్లోరోసిస్ సమస్య మాయమైంది. నల్లగొండ పూర్తి ఫ్ల్లోరైడ్ రహిత ప్రాంతంగా మారింది. మారుమూల తండాలకు నల్లాల ద్వారా సురక్షిత తాగునీరు లభ్యం కావటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన బాధ లక్షలాది మంది మహిళలకు తప్పింది. ఈ పథకానికి రూ.19,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి 15వ ఆర్థికసంఘం సిఫారసు చేసింది. మన్ కీ బాత్‌లో ప్రధాని స్వయంగా మిషన్ భగీరథను ప్రశంసించారు. కానీ, పైసా కూడా ఇవ్వలేదు. అదే మధ్యప్రదేశ్‌లో అరకొరగా అమలైన పథకానికి మాత్రం నిధులు మంజూరు చేశారు. మోదీ సహకరించకపోయినా, తెలంగాణ స్వశక్తితో చేపట్టిన మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా మారింది. కేంద్రం నివేదికలు, నీళ్ల కొట్లాటలు లేని తెలంగాణ ఇందుకు సాక్ష్యం.