అమెరికా టెక్ జాబ్ మార్కెట్లో ఊచకోతలు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు టెక్ కంపెనీలు సుమారు 1,37,500 ఉద్యోగాలకు కోత విధించాయి. మరో అంచనా ప్రకారం.. ఉద్యోగాలు కోల్పోయినవారి సంఖ్య 2,15,402. ఇందులో అత్యధిక కోతలు ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరగడం గమనార్హం. ఏడాది కాలంలో ఉద్యోగుల తొలగింపు 98 శాతం పెరిగింది. వచ్చే ఏడాది ఖర్చుల తగ్గింపు కోసం ఈ ఏడాది ఆగస్టు 1న ఇంటెల్ కంపెనీ 15 శాతం సిబ్బందిని తొలగించింది. సిస్కో, ఐబీఎం, అమెజాన్ అదే బాటపట్టాయి. ఈ ఊచకోతలపై సామాజిక మాధ్యమాల్లో ఐటీ ఉద్యోగులు గగ్గోలు పెట్టడం మనం చూస్తున్నాం. దీంతో కంపెనీలు గుట్టుచప్పుడు కాకుండా తొలగింపులు జరిపే ఎత్తుగడలను అమలు చేస్తున్నాయి. పెద్దపెద్ద ప్రకటనలు చేయకుండా లోపల్లోపల పనితీరు సరిగా లేదనో, మరో కారణం మీదనో తొలగింపులకు పాల్పడుతున్నాయి. ఈ పరిస్థితి ఉద్యోగుల్లో ఆందోళనను, మానసిక ఒత్తిడిని పెంచుతున్నది. జీతాల పెంపు డిమాండ్లను అణచివేసేందుకు కూడా ఈ ధోరణి తోడ్పడుతున్నది. కొన్ని కంపెనీలు ఇదే అదనుగా జీతాల కోతలూ విధిస్తుండటం గమనార్హం.
అమెరికాలో ఉద్యోగాల సంక్షోభం అక్కడి జాబ్ మార్కెట్లో ప్రధాన వర్గమైన ఎన్నారైలకు గుదిబండగా మారింది. రెండున్నర దశాబ్దాల్లో ఇంతటి సంక్షోభం ఎన్నడూ చూడలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల ఊచకోతకు కారణాలను అన్వేషిస్తే పెరుగుతున్న మాంద్యం భయాలు, కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోవడమే మనకు ప్రధానంగా కనిపిస్తాయి. జీతాల ఖర్చు తగ్గించేందుకు పేద, మధ్యాదాయ దేశాలకు యూనిట్లను తరలించడం మరో కారణం. లేఆఫ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో హెచ్-1బీలకు సైతం ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఎదురవుతున్నది. ఇక లక్షలు పోసి ఎంఎస్ చదవడానికి వెళ్లిన చాలామంది సరైన ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో అమలయ్యే కఠిన నిబంధనలు వారిని తరుముతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగాల పరిస్థితి మరింతగా దిగజారిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితి అమెరికాకే పరిమితం కాలేదు. కెనడా, యూకే, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉద్యోగ సంక్షోభం వెంటాడుతున్నది. ప్రపంచవ్యాప్త ఉద్యోగాల కోతల్లో సింహభాగం ఈ దేశాలదే.
ఉద్యోగ కోతల కారణంగా ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నది భారతీయులేనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా..’ అన్నట్టు ఎక్కడచూసినా మనవాళ్లే ఉండటం అందుకు ప్రధాన కారణం. డాలర్ కలలు చెదిరిపోతున్న ప్రస్తుత తరుణంలో భారత సంతతి ఉద్యోగులను ఆదుకునేందుకు కేంద్రం నిర్దుష్టమైన వ్యూహం, ఎత్తుగడలు రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేవలం నినాదంగా మిగిలిపోయిన ‘మేకిన్ ఇండియా’ను దుమ్ము దులిపి చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరమూ ఉంది.