పశ్చిమాసియా మరోసారి యుద్ధోన్మాదంలో చిక్కుకున్నది. ఓ వైపు గాజా రాచపుండు మాననే లేదు, ఇంతలోనే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సంకుల సమరం రాజుకుంటున్నది. ఇరాన్‌లోని అణు పరిశోధన కేంద్రాలతో తన అస్తిత్వానికి ముప్పు ఉందంటూ ఇజ్రాయెల్ మొదలుపెట్టిన బాంబుల వర్షం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్ క్షిపణులతో, డ్రోన్లతో జరుపుతున్న ఎదురుదాడులతో ఇజ్రాయెల్‌కూ భారీగా నష్టం వాటిల్లుతున్నది. రెండు దేశాల్లో యుద్ధం వల్ల విధ్వంసం, ప్రాణనష్టం చోటుచేసుకోవడం విచారకరం. గతంలో ఇరాన్ అణుకేంద్రాలు, అణుశాస్త్రవేత్తలు లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులు జరపడం తెలిసిందే.
ఈసారి అలాకాకుండా పూర్తిస్థాయిలో ఇరాన్ అణుస్థావరాలే కాకుండా ప్రభుత్వ, సైనిక కేంద్రాలపైనా నెతన్యాహూ ప్రభుత్వం దాడులు జరుపుతున్నది. తాజాగా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో చమురు క్షేత్రాలపైనా దాడులు జరుపుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. యుద్ధ ప్రభావం వల్ల చమురు ధరలు పెరిగే ప్రమాదం తొంగిచూస్తున్నది. పశ్చిమాసియాలో కీలక సముద్ర, వాయుమార్గాలు ప్రభావితం అవుతుండటంతో వాణిజ్య రవాణా వ్యవస్థ దెబ్బతింటుండటం మరో సమస్య.
పశ్చిమాసియాలో అనైక్యతకు ప్రతిబింబంలా ప్రపంచ స్పందన కూడా మిశ్రమంగా ఉంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో అమెరికా, బ్రిటన్ తమ యుద్ధనౌకలను, సైన్యాలను పశ్చిమాసియాలో మోహరిస్తున్నట్టు వచ్చిన వార్తలతో మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమా అనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తర్వాత అమెరికా తనకు ఈ యుద్ధంతో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేయడం వేరే విషయం. అయితే సర్వం నాశనమయ్యే వరకు వేచిచూడకుండా సత్వరమే ఇరాన్ ఒప్పందానికి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ఇజ్రాయెల్ దగ్గర అమెరికాలో తయారైన ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయని చెప్పడం పరోక్ష హెచ్చరికలకు దిగడమే అవుతుంది. రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలున్న భారత్ ఆచితూచి స్పందించాల్సి వస్తున్నది. రష్యా, చైనాలతో కూడిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ జారీచేసిన ప్రకటన నుంచి భారత్ వైదొలగడం రెండు వైరిపక్షాలతో సమానదూరం పాటించాల్సిన ఆవశ్యకతను ఎత్తిచూపుతున్నది.
ఇప్పటివరకైతే ఇరుపక్షాలూ వెనుకకు తగ్గుతున్న సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి యుద్ధాలను నివారించేందుకు ఏర్పడిన ఐక్యరాజ్య సమితి క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయి ప్రకటనలకే పరిమితమైపోయిన దుస్థితి. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ పట్ల అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనుసరిస్తున్న ద్వంద్వవైఖరి అణువివక్షకు దారితీస్తున్నది. ఈ చిక్కు సమస్యలు ప్రపంచాన్ని పదేపదే ప్రమాదం అంచులకు తీసుకువెళ్తున్నాయి. సంపూర్ణ అణు నిరాయుధీకరణ సాధించి, సమితిని బలోపేతం చేయడం ఒక్కటే దీనంతటికీ సరైన పరిష్కారం. కానీ, ఆ దిశగా అడుగులు పడకపోవడమే అసలు సమస్య. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, అస్థిరత కొనసాగు తున్న సైనిక ఘర్షణలు మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? కాలమే జవాబు చెప్పాలి.