శబ్దంతో పోలిస్తే ఐదింతల వేగంతో వెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించే హైపర్‌సానిక్ క్షిపణి పరీక్షను భారత్ ఆదివారం దిగ్విజయంగా పూర్తిచేయడం ప్రశంసనీయం. రక్షణరంగ దిగ్గజం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ (డీఆర్డీఎల్), పరిశ్రమ భాగస్వాములు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి అనేక రకాలుగా ప్రత్యేకతలను సంతరించుకున్నది. అందులో ముఖ్యమైనది దీని పరిధి. 1,500 కిలోమీటర్ల దాకా అప్రతిహతంగా ఒకటి కంటే ఎక్కువ బాంబులను ఇది మోసుకువెళ్తుంది. ఈ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న చైనా, రష్యా, అమెరికా వంటి పిడికెడు దేశాల సరసన భారత్ స్థానం సంపాదించడం ఓ గొప్ప మైలురాయి. మన రక్షణ దళాల అమ్ములపొదిలో హైపర్‌సానిక్ క్షిపణుల విశిష్టతను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర రాజధాని నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రంలో దీన్ని అభివృద్ధి చేయడం తెలంగాణకు గర్వకారణం.
ఆధునిక సైనిక సంసిద్ధతలో హైపర్‌సానిక్ క్షిపణులు కీలక పాత్ర పోషిస్తాయి. ఉక్రెయిన్ యుద్ధంలో సైనిక నష్టాన్ని తగ్గించుకునేందుకు రష్యా హైపర్‌సానిక్ క్షిపణులపై ఆధారపడుతున్నది. అటు అమెరికా కూడా ఈ క్షిపణుల తయారీకి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తున్నది. దూరం నుంచి శత్రు లక్ష్యాలను సంప్రదాయేతర మార్గాల్లో ధ్వం సం చేయడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయనే ఉద్దేశంతోనే దేశా లు వీటి కోసం ప్రయత్నిస్తుంటాయి. బాలిస్టిక్ తరహాలో నిర్ణీత కక్ష్యలో ప్రయాణించకుండా వంకరటింకరగా ప్రయాణించే సామర్థ్యంతో ఈ క్షిపణులు శత్రుదేశం గగనతల రక్షణ వ్యవస్థల కన్నుగప్పి తమను తాము కాపాడుకోగలుగుతాయి. ముఖ్యంగా అణ్వాయుధాలను సం ధించడంలో వీటి ఉపయోగం తప్పనిసరిగా అవసరం. వీటి తయారీ అనేక సంక్లిష్టతలు, అధిక వ్యయంతో కూడి ఉంటుంది. భారత్ వంటి వర్ధమాన దేశం అన్నిరకాల అడ్డంకులు దాటి శక్తిమంతమైన క్షిపణులు సమకూర్చుకోవడం మామూలు విషయం కాదు.
రక్షణరంగంలో విదేశీ దిగుమతులు పెరుగుతుండటంపై పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సత్వర సరఫరా, విశ్వసనీయతలే అందుకు కారణం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హయాంలో రక్షణ దిగుమతులు 4.7 శాతం పెరగడం విడ్డూరం. మన మొత్తం దిగుమతుల్లో 36 శాతం రష్యా నుంచి, 46 శాతం అమెరికా, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి. ప్రపంచ దిగుమతుల్లో పదో వంతు వాటా భారత్‌దే. పాకిస్థాన్‌కు అతిపెద్ద ఆయుధాల ఎగుమతిదారైన చైనా నుంచి మన దేశం డ్రోన్ పరికరాలను కొనుగోలు చేస్తున్నది. ఇలా రక్షణ ఉత్పత్తుల విషయంలో విదేశాలపై ఆధారపడటం కీలక సమయాల్లో ఒత్తిడికి గురిచేసే అవకాశాలుంటాయి. కొన్ని ప్రాజెక్టులు సకాలంలో విడిభాగాలు సరఫరా కాని కారణంగా జాప్యం అవుతుండటం మనం చూస్తున్నాం. తేజస్ ఫైటర్ జెట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి అందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞాన అభివృద్ధి ఎంతైనా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. వ్యూహాత్మకంగా కీలకమైన క్షిపణుల తయారీలో మన రక్షణ రంగం తిరుగులేని ముందంజ సాధించడం శుభపరిణామం.