రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరుపక్షాల భేటీ అనంతరం మీడియా సమక్షంలో అట్టహాసంగా ప్రకటిస్తారు. ఇండియా-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో ఇలాంటి సంప్రదాయాలు ఏవీ పాటించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ’తాంబూలాలిచ్చేశాను’ అన్నట్టుగా తనదైన శైలిలో సామాజిక మాధ్యమాల్లో వెల్లడించడమే అందుకు నిదర్శనం. పాతికపై పాతిక.. వెరసి 50 శాతం ప్రతీకార టారిఫ్ భారం కింద నలుగుతున్న భారత్‌కు ఒప్పందం వార్త సహజంగానే కర్ణపేయంగా ఉన్నది. అమెరికా పాతిక శాతం టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తుందనేది ట్రంప్ ప్రకటన సారాంశం. రష్యా దగ్గర చమురు కొంటున్నందుకు జరిమానా కింద వేస్తున్న అదనపు 25 శాతం ఆగిపోతుంది అని కూడా ఆయన సెలవిచ్చారు. తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న భారత జౌళి, వజ్రాల పరిశ్రమలు, మత్స్య రంగం ఈ నిర్ణయం వల్ల తక్షణ ఉపశమనం పొందుతాయి. ఈ కారణంగా దేశంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొన్నది. స్టాక్ మార్కెట్ కూడా పుంజుకున్నది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే అయినప్పటికీ మారిన టారిఫ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంలో ట్రంప్ స్పష్టత ఇవ్వకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
ద్వైపాక్షిక ఒప్పందం ఏకపక్షంగా ప్రకటించడం ఒక ఎత్తు అయితే, అమెరికా డిమాండ్లకు మోదీ ప్రభుత్వం ఏ మేరకు తలొగ్గిందనే సందేహాలు పెద్దఎత్తున తలెత్తుతుండటం మరో సమస్య. కేంద్ర ప్రభుత్వం ఘనవిజయం సాధించినట్టు ప్రచారార్భాటం కూడా మొదలైంది. అయితే ఇల్లలుకగానే పండుగ కానట్టు, ఏయే అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారనేది కీలక విషయం. చైనాపై ఇప్పటికీ అమెరికా 30 శాతం సుంకాలు విధిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇండియా టారిఫ్ 18 శాతానికి తగ్గడం మన ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెంచుతుంది. ఇదే జరిగితే భారత ఉత్పాదక రంగం తిరిగి పుంజుకునే వీలుంటుంది. కానీ సమస్యల్లా ఒప్పందం వివరాలు వెల్లడి కాకపోవడం. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అమెరికా తెస్తున్న ఒత్తిడి తెలిసిందే. ఓ వైపు అస్పష్టతలు, అనుమానపు తెరలు తొలిగిపోకముందే కేంద్ర ప్రభుత్వం ఘనవిజయం సాధించినట్టు ప్రచారార్భాటం మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ ఇది పెద్ద నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుంది అని పొడిపొడిగా స్పందించారు. అయితే ఒప్పందం కుదరడమే పరమార్థం కాదు. ఏయే అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారనేది కీలక విషయంగా ఉంటుంది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపివేస్తుందని, వెనెజువెలా నుంచి కొంటుందని అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. భారత్ అందుకు అంగీకరించిందా? వివరాలు తర్వాత వెల్లడిస్తామని స్వయంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌గోయల్, అదీ పార్లమెంటు జరుగుతున్న సమయంలో బయట మీడియా సమావేశంలో ప్రకటించడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ఒప్పందం గురించి ప్రకటించిన సమయం గురించి కూడా ఆలోచించాలి. ఈయూ భారత్‌తో అన్ని ఒప్పందాలకు అమ్మలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్న వారం రోజుల్లోపే ట్రంప్ ఈ ప్రకటన చేయడం కాకతాళీయంగా జరిగిందేమీ కాదనేది స్పష్టమే. మరోవైపు ప్రతీకార టారిఫ్‌లు ట్రంప్ తన అధ్యక్ష విశేషాధికారాల ద్వారా జారీచేశారు. వీటి చెల్లుబడిపై సుప్రీంకోర్టు నిర్ణయం త్వరలో వెలువడనున్నది. న్యాయ నిర్ణయం వెలువడేలోగా సమస్యను చల్లార్చడం ఆయన ఉద్దేశం కావచ్చు. ఏదీ ఏమైనప్పటికీ ఇప్పటిదాకా ఒప్పందం గురించి దేశంలో జరుగుతున్న హడావుడి అంతా టీజర్లా ఉన్నది. మిగతా కథ వెండితెర మీద చూడాలని కేంద్ర ప్రభుత్వం అనడమే విడ్డూరం.