– ముఖ్య అతిథిగా హాజరైన ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
– ప్రతిభ చూపిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం
రామగిరి, జూలై 22 : యువత దేశ సేవకు పునరంకితం కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ నాయకులు చేసేదే దేశ సేవ కాదని, సమాజంలో ఎవరి బాధ్యత వారు నెరవేరిస్తే అదే అసలైన దేశ సేవ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో బుధవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల( ఎన్జీ) మొదటి స్నాతకోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం – బంగారు పతకాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకునే వైఖరిని అలవర్చుకోవాలని సూచించారు. కేవలం డిగ్రీతో చదువు ఆపకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆపై ఉన్నత చదువులు చదవాలన్నారు. ప్రతి విద్యార్థి నైపుణ్యాలు (స్కిల్స్) కలిగి ఉండాలని, విద్యార్థులను స్కిల్ రిసోర్స్ పర్సన్లుగా తయారు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని స్థాపించిందని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. నాగార్జున ప్రభుత్వ కళాశాల చరిత్రలోనే మొదటిసారిగా స్నాతకోత్సవం (కాన్వకేషన్) నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, విద్యార్థులు మంచి కెరీర్ను ఎంచుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కళాశాల భూగర్భశాస్త్రం (జియాలజీ) విభాగ పూర్వ విద్యార్థి, వ్యాపారవేత్త మందడి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. జియాలజీ విభాగంలో గోల్డ్ మెడల్ ప్రదానం కోసం రూ.2 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, కాన్వకేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డా.పరంగి రవి కుమార్, డా.అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బి.నాగరాజు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస రాజు, పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ డా.రాజారాం, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.రహత్ ఖానం, ఎన్జీ కళాశాల ఎన్సీసీ అధికారి సీహెచ్ సుధాకర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘనంగా నల్లగొండ ఎన్జీ కాలేజీ మొదటి స్నాతకోత్సవం