వ్యాక్సిన్లతో వైరస్‌కు ముకుతాడు వేశామని ఊరట చెందుతున్న సమయంలో మరో కొత్త రూపంలో కరోనా కోరలు చాస్తున్నది. ఒమిక్రాన్ రూపంలో దేశ దేశాల్లో పాగా వేస్తున్నది. మన దేశంలో అడుగు పెట్టుడే ఆలస్యం 57 మందికి పైగా సోకడం ఆందోళనకరం. కరోనా తొలిరూపం కూడా ఇంకా పీడిస్తూనే ఉన్నది. ఇప్పటికీ దేశంలో రోజుకు దాదాపుగా ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి, సోమవారం ఒక్కరోజే 252 మరణాలు సంభవించాయి. ఈ తొలి రూపం నుంచి తెరిపిన పడకముందే, మన దేశంలోకి ఒమిక్రాన్ ప్రవేశించింది. ఎనిమిది రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ కొత్త వైరస్ కేసులు నమోదు కావడంతో అన్ని రాష్ర్టాలూ అప్రమత్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అరవై దేశాలలో ఒమిక్రాన్ జాడలు కనిపించాయి. ప్రధానంగా జర్మనీ, కెనడా, బ్రిటన్ దేశాల్లో ఒమిక్రాన్ వాయువేగంగా విస్తరిస్తున్నది. దీంతో యూరప్ దేశాలన్నీ రక్షణ చర్యలకు దిగుతున్నాయి.
ఒకప్పుడు కరోనా విషయంలో ఎంత అయోమయం నెలకొని ఉండేదో ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలోనూ అంతే అస్పష్టత నెలకొనడం ఆశ్చర్యకరం. డెల్టాతో పోలిస్తే ఈ రకం వేగంగా విస్తరిస్తున్నదని,వచ్చే ఏప్రిల్ చివరి నాటికి తీవ్రరూపం దాల్చుతుందనీ బ్రిటన్ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అయితే ఇంతకుమించి వివరాలను ఎవరూ చెప్పలేక పోతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారికీ ఒమిక్రాన్ నుంచి రక్షణ లభించడం లేదని మాత్రం తెలుస్తున్నది. బూస్టర్ డోస్ ఫలితాన్నిస్తుందంటూ కొన్ని దేశాల నుంచి వస్తున్న సూచనలను మన దేశంలోని నిపుణులు ఇంకా ధ్రువీకరించడం లేదు. ‘ఏవై-4’ అనే మరో రకం వైరస్ చైనాలో వెలుగుచూడటం మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నది, ఇదంతా చూస్తుంటే కరోనా మొదలైనప్పుడు ఎక్కడ ఉన్నామో ఇప్పుడూ మనం అక్కడే ఉన్నామా అనిపిస్తున్నది!
డెల్టా, ఒమిక్రాన్‌ల నుంచి మనం గ్రహించవలసింది ఒక్కటే. ఏ వైరస్‌నూ ప్రకృతి నుంచి పూర్తిగా నిర్మూలించలేము. ప్రమాదకర వైరస్‌లతో, జీవులతో సహజీవనం మానవాళి చేయకతప్పదు. అవి మరింత విజృంభించి మన జీవనాన్ని దెబ్బతీయకుండా జాగ్రత్తలు పాటించవలసిందే. కరోనా ముప్పు తొలిగిందనగానే మళ్ళీ పాత జీవ నం మొదలైంది. దీంతో మరో రూపంలో కరోనా వ్యాపిస్తున్నది. ఆరో గ్య సూత్రాలను పాటించడం, పారిశుధ్య వ్యవస్థను పటిష్ఠ పరచుకోవడం, వైద్య వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన మెరుగుపరచుకోవడం తక్షణం చేయాల్సిన పనులు. వీలైనంత మేర ఆర్థికవ్యవస్థ దెబ్బతినకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈలోగా మానవ జీవనం, కరోనా వంటి వైరస్ల వ్యాప్తి విషయమై ఒక తాత్వికమైన అవగాహనకు రావ డం అవసరం. దీన్ని వైద్యశాస్త్ర సంబంధిత అంశంగా మాత్రమే చూడకూడదు. మాస్క్ ధరించటం, భౌతికదూరం పాటించటం లాంటి ప్రాథమిక విషయాలే ఇప్పుడు రక్షణ కవచం. మన జీవనశైలిలో ఎలాంటి మార్పు అవసరమనేది దీర్ఘకాలిక ఆలోచన.