ఆసియా దిగ్గజాలైన భారత్, చైనా సంబంధాలు చాలాకాలం ఎడమొగం పెడమొగంగానే ఉన్నాయి. 1962 యుద్ధం, దరిమిలా చైనా పలు భూఖండాలు ఆక్రమించుకోవడం రెండు దేశాల మధ్య అగాధానికి కారణమయ్యాయి. ఆ తర్వాత చైనా చెదురుముదురుగా దురాక్రమణలకు, ఘర్షణలకు తెగబడటం పరిపాటి అయింది. సుమారు నాలుగున్నరేండ్ల కిందట తూర్పు లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖపై గల గల్వాన్ లోయలో 2020 ఏప్రిల్-మే మాసాల్లో జరిగిన ఘర్షణతో రెండు దేశాల సంబంధాల్లో సరికొత్త ప్రతిష్ఠంభన ఏర్పడింది. గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు బాహాబాహీ తలపడిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణల్లో పదుల సంఖ్యలో భారత సైనికులు అమరులయ్యారు. చైనా తమకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చేసిన ప్రకటనలను ఎవరూ పెద్దగా విశ్వసించలేదు. గల్వాన్ ఘర్షణగా పేరొందిన ఆ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. ఇటీవల కొంతకాలంగా జరుగుతున్న దౌత్య సంప్రదింపులు ఈ దూరాన్ని తగ్గించే దిశగా గణనీయమైన ప్రగతిని సాధించాయనే మాటలు వినవస్తున్నాయి.
సరిహద్దు రేఖ వెంబడి గస్తీ నిర్వహణపై ఉభయ దేశాల మధ్య అధికారుల స్థాయిలో ఒప్పందం కుదిరింది. ఆ దరిమిలా రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సభ సందర్భంగా కలుసుకున్న రెండు దేశాల అధినేతలు నరేంద్ర మోదీ, జీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఐదేండ్ల విరామం తర్వాత జరిగిన ఈ సమావేశంలో ఆ ఒప్పందానికి అత్యున్నత స్థాయి ఆమోదముద్ర పడినట్టుగా భారత దౌత్యాధికారులు చెప్తున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. కానీ, చైనా వైపు నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటం, ఏ విషయంలో ఎలాంటి ఏకాభిప్రాయం కుదిరిందో చెప్పకపోవడం గమనార్హం. గత అనుభవాల దృష్ట్యా చైనా ధోరణి కొంత అనుమానాలకు తావిస్తున్నది. చైనా ఒక మెట్టు దిగి ఒప్పందానికి ఎందుకు సిద్ధమైందనేది ప్రశ్న. ‘ఎందుకు అనేది తర్వాత తాపీగా ఆలోచించవచ్చు, ముందుగా ఒప్పందం ఫలితాలను అందుకుందాం’ అని ఓ భారత దౌత్యాధికారి వ్యాఖ్యానించడం విశేషం.
నిజానికి భారత్ చెప్తున్నట్టుగా సరిహద్దు సమస్యపై ఒప్పందం కుదరడమంటే 2020 మే ముందరి నాటి పరిస్థితి పునరుద్ధరించడంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవాధీన రేఖ మీది గల్వాన్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్, పాంగోంగ్ లేక్, దెప్సంగ్, దెమ్చోక్ అనే ఐదు సెక్టార్లలో భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకువచ్చి దాడులకు తెగబడటంతోనే ఆ ఘర్షణలు మొదలయ్యాయి. వాటిల్లోని మొదటి మూడింటి విషయంలో ఇదివరకే యథాతథ స్థితికి రావడం జరిగింది. మిగిలిన రెండింటి విషయంలో స్పష్టత రాకపోవడమే అసలు సమస్య. చైనా దురాక్రమణలు ఎక్కువగా జరిగింది అక్కడే. మాట తప్పడంలో మేటి అయిన చైనాను పూర్తిగా విశ్వసించలేం. సరిహద్దు వివాదాల విషయంలో అసలే నమ్మలేం. మీడియా ప్రకటనల హడావుడి అటుంచి చైనా నుంచి అంగుళం అంగుళం ఆక్రమిత భూమిని తిరిగి పొందడమే లక్ష్యంగా భారత్ మరింత తదేకంగా కృషిచేయక తప్పదు.