యువతుల కనీస వయస్సును 21 ఏండ్లకు పెంచాలన్న తాజా బిల్లు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పురుషులతో సమానంగా యువతుల వివాహ వయసు పెంచడం వల్ల వివక్షను తొలగించినట్టవుతుందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. అయితే ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.18 ఏండ్లతో పోలిస్తే 21 వచ్చేసరికి మరింత మానసిక పరిణతి వస్తుంది. దీంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తగ్గవచ్చు. 18 ఏండ్ల వయసులో తీసుకునేవన్నీ తప్పుడు నిర్ణయాలని కాదు కానీ పొరపడే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. ఇదేవిధంగా చిన్న వయసులో పెండ్లి కావడం వల్ల బాలికల ఉన్నత విద్యాభ్యాసం ఆగిపోవచ్చు. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లీ పిల్లల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. శిశు మరణాలు, బాలింత మరణాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. వివాహం 21 ఏండ్ల వయసులో చేసుకోవడం అభిలషణీయమే అయినప్పటికీ, చట్టం ద్వారా కట్టడి చేయాలనే విధానం ఎంతవరకు సహేతుకం, ఆచరణ సాధ్యమనే విమర్శలు వస్తున్నా యి. ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి.
చట్టం ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ, దాదాపు 23 శాతం మంది బాలికలకు 18 ఏండ్ల లోపే పెండ్లయిందని ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారమే తెలుస్తున్నది. జయాజైట్లీ కమిటీ యువతుల వివాహ వయస్సును 21 ఏండ్లకు పెంచాలనడంతోపాటు మరికొన్ని సూచనలు కూడా చేయడం గమనార్హం. బాలికలకు పాఠశాల, కళాశాల సదుపాయాలు పెంచాలని, ఇందుకు రవాణా సౌకర్యం కల్పించాలని కమిటీ సూచించింది. నైపుణ్య, వ్యాపార శిక్షణతోపాటు, లైంగిక విద్య బోధించాలని అభిప్రాయపడింది. వివాహ వయసు పెంచడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ప్రజలు చట్టాన్ని ఆమోదించాలే తప్ప బలవంతంగా అమలు చేయకూడదని స్పష్టంగా చెప్పింది. బాల్య వివాహాలు తగ్గడానికి కారణం చట్టం కాదనీ, ప్రజలలో విద్య, ఉపాధి అవకాశాలు పెరగడమని మహిళా సంస్థలు అంటున్నాయి.
ప్రజాస్వామిక వ్యవస్థలో సామాజిక మార్పు దిశగా కృషిచేయడం ప్రభుత్వ విధి. కానీ సామాజిక మార్పును బలవంతంగా రుద్దకూడదు. పల్లె ప్రాంతాల్లో పేదవర్గాల సామాజిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. వారిని అభివృద్ధి తలంలోకి తీసుకురావడం వల్లనే మార్పు సాధ్యమవుతుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలు కూడా పరిశీలనార్హమైనవి. గ్రామీణ ప్రాంతాన్ని సంపన్నవంతం చేయడం ద్వారా పేదల జీవితాల్లో మార్పు తెస్తున్నది. సామాజిక ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు ప్రజల ఆలోచనలు మారుతాయి. కల్యాణలక్ష్మి పథకం ఈ దిశగా ఒక వినూత్న పథకం. బాల్య వివాహాలకు ఈ ప్రోత్సాహకం లభించదు. అందువల్ల చిన్న వయసు వివాహాలను అరికట్టడానికి ఇదొక సాధనం. ఇటువంటి సామాజిక మార్పు విధానాలపై కేంద్రం దృష్టిసారించాలి.