ఉద్యమనేత, అభ్యుదయ తెలంగాణ నిర్మాత కదులుతున్నాడు. ఎన్నికల రణరంగంలో సమరశంఖం పూరించబోతున్నాడు. మూడోమలుపు లో గెలుపు పిలుపు కోసం రణన్నినాదం చేయబోతున్నాడు. సాధించిన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన మార్గదర్శి హ్యాట్రిక్ సీఎంగా ఆశీర్వదించమని ప్రజలకు సవినయంగా మనవి చేసేందుకు ముందుకు వస్తున్నాడు. ఇది తెలంగాణకు దీక్షా సమయం. పరీక్షా సమయం. ఈ ఎన్నికలు తెలంగాణ కోసం. తెలంగాణను నిలబెట్టేందు కోసం. నిండుగా కాసిన పండ్లచెట్టులా కళకళలాడుతున్నది తెలంగాణ. చేపలు నిండిన చెరువులా మిలమిలలాడుతున్నది తెలంగాణ. అదను కోసం చక్కర్లు కొడుతున్న తోడేళ్లను తరిమి కొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.
కన్నేసిన మిన్నాగులను విసిరికొట్టాల్సిన గడియ వస్తున్నది. మాయోపాయంతో గెలవాలనే దుష్టపన్నాగాలను పటాపంచలు చేయాల్సిన క్షణం సమీపిస్తున్నది. నిలిచి గెలిచిన తెలంగాణను నిలబెట్టుకోవాల్సి ఉన్నది. అందుకే కదిలాడు అభివృద్ధి ప్రదాత. సంపద పెంచడం.. నలుగురికీ పంచడమనే సకారాత్మక పరిపాలనా రూపశిల్పి. అందరిలా ఉత్త ముచ్చట చెప్పడు, డొల్ల హామీలు ఇవ్వడు. ఇదిగో మేం సాధించిన అభివృద్ధి.. ఇదిగో మేం సృష్టించిన సంపద. ఇదిగో మేం పంచిన సంక్షేమం.. ఇవి చూసి ముచ్చటగా మూడోసారి అవకాశం ఇవ్వమని అడిగేందుకు రథారూఢుడు అవుతున్నాడు. 17 రోజుల్లో 42 సభలతో అప్రతిహత జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాడు కేసీఆర్.
తెలంగాణను పరపాలన సంకెళ్ల నుంచి విముక్తం చేసిన నేతకు జనం గోసలు తెలుసు, గుండెబాసలు తెలుసు. అందుకే తెలంగాణ మనసారా తననే నమ్మింది. ఒకటికి రెండుసార్లు గజమాల వేసింది. విజయాన్ని ముద్దాడిన వీరుడా ప్రగతి బాటలు పరచమని పగ్గాలు చేతికిచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యుత్కిరణాలను ప్రజ్వరిల్లజేసి తెలంగాణను తేజరిల్లజేశాడు. ఆకలిపై యుద్ధం ప్రకటించి సాగును బాగుచేసి పచ్చదనాన్ని పరిచాడు. నీటిని కొండలెక్కించి అన్నదాతకు అండగా నిలిపాడు. అపరభగీరథుడై ఇంటింటా గంగావతరణాన్ని ఆవిష్కరించాడు.
ఆడబిడ్డల నీటిగోసను తీర్చి అన్నరుణం తీర్చుకున్నాడు. పింఛన్లు పెంచి మలిసంజెకు చేతికర్ర అయ్యాడు. కులవృత్తులను గుండెకు హత్తుకొని, దళితబంధువై సామాజిక సమానత్వ పతాకాన్ని ఎత్తుకొని సగర్వ తెలంగాణ ఇదిరా అని చాటిచెప్పాడు. బడుగుల విద్యకు పునాదులు వేసి, వైద్యానికి కాయకల్ప చికిత్స చేశాడు. పల్లెలకు ముఖం కడిగి బొట్టుపెట్టాడు. పట్టణాలకు ప్రగతి తోరణాలు కట్టాడు. తెలంగాణ తెహజీబ్ నిలబెట్టి అశాంతిని, అల్లర్లను తరిమికొట్టాడు. సకలజన హిత పాలనలో సరికొత్త మైలురాళ్లు పాతాడు.
ఇదీ తెలంగాణ వైభవం.. ఇదీ కేసీఆర్ పరిపాలనా ప్రాభవం. అం దుకే చేసినదాన్ని చూసి ఓటెయ్యమని, సాధించిన విజయాలను సహృదయంతో దీవించమని నిర్మాణాత్మక ప్రచారానికి నాంది పలకబోతున్నాడు. దించుతాం.. దంచుతాం, తవ్వుతాం, కూల్చుతాం అనే విధ్వంసక ప్రచారాల నడ్డి విరిచేందుకు సమాయత్తమవుతున్నాడు. కూల్చేవాళ్లు, పేల్చేవాళ్లు కావాలా? అభివృద్ధి పెంచేవాళ్లు, శాంతి సుహృద్భావాలను పంచేవాళ్లు కావాలో మరోసారి తేల్చుకునే ఘట్టం తెలంగాణ ఓటరు ముందుకువచ్చింది. ఎవరిని వంచాలో, ఎవరిని గెలిపించాలో వారికి తెలుసు. ఆ సంగతి ఓటుపోటుతో మరోసారి చాటబోతున్నారు.