ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాత్రి చేసిన ప్రసంగంలో చాలా విషయాలు స్పృశించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చేపట్టిన పలు చర్యల గురించి ఆయన సోదాహరణంగా చెప్పుకొచ్చారు. శత్రువుతో ఎంత కఠినంగా వ్యవహరించిందీ, ఎంతటి విధ్వంసం సాగించిందీ విజయగర్వంతో విషదీకరించారు. అదే సమయంలో ఆయన ‘ఇది యుద్ధాల యుగం కాదని’ అన్నారు. నిజమే సాగిస్తే సమరం. ఆపేస్తే శాంతి. ఇదంతా రణ విరమణ తంతు గురించి వివరంగా తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టాంటాం వేసుకుంటున్న మధ్యవర్తిత్వం గురించి మాట వరసకైనా మోదీ ప్రస్తావించకపోవడం గమనార్హం. కశ్మీర్‌తో సహా భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యలకు మధ్యవర్తిత్వం అనేది పొసిగే వ్యవహారం కాదు. మొదటి నుంచీ భారత్ ఇదే వైఖరిని అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. మూడో పక్షం మధ్యవర్తిత్వం అనేది ఇక్కడ పూర్తిగా నిషిద్ధం. అక్కడ ట్రంపేమో ఇండియా-పాక్ బుద్ధిగా చెప్పిన మాట విన్నారని మెచ్చుకోలుగా రెచ్చిపోతున్నారు. వినకపోతే వ్యాపారం మానేస్తానని బెదిరించినట్టు కూడా ఆయన సాంఘిక మాధ్యమాల సాక్షిగా గుట్టురట్టు చేస్తున్నారు.
బంగ్లా యుద్ధం తర్వాత భారత్-పాక్ కుదుర్చుకున్న షిమ్లా ఒప్పందంలో ఏముంది? అన్ని సమస్యలు ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని ఆ ఒప్పందం విస్పష్టంగా నొక్కిచెప్పింది. మరి మధ్యవర్తిత్వం ఎక్కడినుంచి వచ్చింది? అందులోనూ కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిసిపోమని, గ్రీన్‌ల్యాండ్‌ను బల ప్రయోగంతో కలిపేసుకుంటామని విస్తరణవాద అజెండాతో ఊదరగొట్టే అమెరికా అధ్యక్షుడు ఇక్కడ సమస్య కొలిక్కి వస్తున్న లేదా తుది ఘట్టానికి చేరుకుంటున్న దశలో హఠాత్తుగా ఊడి పడి శాంతి మంత్రాంగం నెరపడం ఏమిటో పండితులకే అర్థం కావడం లేదు. ఇంక సామాన్యుల మాట చెప్పేదేముంది?
మత మౌఢ్యం చేతికి తుపాకులిచ్చి ఇండియా మీదికి ఎగదోసి తమాషా చూస్తున్న కిరాతక పొరుగు దేశం ఇరికి ఇగిలించిదేమో… ఇండియాకు ఏమయ్యింది. మధ్యవర్తిత్వమే ఇక్కడ నిషేధమైన నేపథ్యంలో, అదీ నా మాటే శాసనమని దడిపిస్తున్న అమెరికా అధ్యక్షుని మధ్యవర్తిత్వంలో రణ విరమణా? ఇదంతా ఏమిటనే సందేహాలను తీర్చకుండానే యుద్ధాలకు ఇది యుగం కాదనీ, తీవ్రవాదానికీ ఇది కాలం కాదని ప్రవచనాలివ్వడం ఏమిటి? మూణ్ణాళ్లకే అస్త్ర సన్యాసం చేయాల్సినంత పెద్ద ఫలితం ఏం లభించిందని? హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత 48 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ తెరమీదికి వచ్చి ఏదో సాధించినట్టుగా ఏకరువు పెట్టడమేమిటి? అందుకే ప్రస్తుత కేంద్ర నాయకత్వం వ్యవహార శైలిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షకులమని ఊరేగే వారేనా అమెరికా ముందు మోకరిల్లింది? అని పరిపరి విధాలా విస్తుపోతున్నారు. ఈ సందర్భంగా నాటి ఇందిరాగాంధీ అనుసరించిన స్వాభిమాన వ్యవహారశైలిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బంగ్లా యుద్ధం సమయంలో అమెరికా పాకిస్థాన్ పక్షాన నిలిచింది. ఇండియాను నానా రకాలుగా లొంగదీసుకునేందుకు ఎత్తులు వేసింది. బంగాళాఖాతంలోకి శక్తిమంతమైన సప్తమ నౌకాదళాన్ని అమెరికా పంపించడం భారత్ ఎన్నటికైనా మరిచిపోగలదా? అన్నిటినీ ఎదిరించి పాక్‌ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్‌ను స్థాపించి ఐరన్ ‘లేడీ’గా, మా ‘దుర్గ’గా మన్ననలు అందుకున్న ఇందిర ఇప్పుడు దేశ ప్రజలకు గుర్తుకురావడంలో వింతేముంది? ఇదంతా చరిత్ర. శిలాలిఖితం. భావితరాలు పోల్చిచూసుకునే గీటురాయి.
అసలు అనేక అంశాలపై కేంద్రం మౌనముద్ర వహించడం దేశ ప్రజలకు మింగుడు పడటం లేదు. అందులో అతి ముఖ్యమైంది పాక్‌కు ఐఎంఎఫ్ రుణం. ఓ వైపు ఇండియా సైనిక చర్యలో తలమునకలుగా ఉంటే అటు భారీగా ఐఎంఎఫ్ రుణం ఇప్పించడంలోనూ అమెరికా క్రియాశీల పాత్ర పోషించింది. నిన్నా మొన్నా ఇండియాపై పాక్ ప్రయోగించిన అనేక ఆయుధాలు అమెరికా సమకూర్చినవే. గాజాలో నరమేధం సృష్టిస్తున్న ఇజ్రాయెల్‌ను పల్లెత్తు మాట అనని అమెరికా ఇండియా-పాక్ మధ్య శాంతి పేరిట దూరిపోవడం మాత్రం వింతల్లోకెల్లా వింత.