భారతదేశాన్ని బీజేపీ చెర నుంచి కాపాడుకోవటానికి ధర్మయుద్ధం చేద్దామంటూ టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు గొప్ప ప్రాధాన్యం ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రెండు దఫాల మోదీ పాలనలో అన్ని అంతర్జాతీయ సూచీల్లో వెలవెలబోతున్నది. ప్రజాస్వామ్యం నుంచి పత్రికాస్వేచ్ఛ వరకు, ఆకలి నుంచి నిరుద్యోగం వరకూ ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అని నిట్టూర్చే పరిస్థితి. ఈ సమస్యలకు తోడు బీజేపీ పెంచి పోషిస్తున్న మత చిచ్చు భారతీయుల్లో మరింత ఆందోళనకు కారణమవుతున్నది. మధ్యతరగతి, ఆపై తరగతి భారతీయులు గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు భారీ ఎత్తున వలస పోతున్నారు. మాతృదేశంపై మమకారం లేక కాదు.. బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలతో రోజురోజుకీ పెరిగిపోతున్న అనిశ్చితిలో తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు పట్ల బెంగతో వారు ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఈ విధంగా ఎటు చూసినా నిరాశ, చీకట్లు అలుముకొని ఉన్నాయి.
ఈ సంక్లిష్ట సమయంలో కేసీఆర్ పూరించిన శంఖారావం ఎంతో సాహసంతో కూడుకున్నది. మోదీ, షా కొట్టే దెబ్బలు కాచుకోవటానికే తప్ప వారిని ఎదురుదెబ్బ తీయవచ్చని దేశంలో ఇప్పటి వరకూ ఏ పార్టీగానీ, ఏ నాయకుడుగానీ ఊహించటానికి కూడా సిద్ధపడలేదు. నిశ్శబ్దంగానే వాటిని భరిస్తూ వచ్చారు. కానీ, కేసీఆర్ ఆ పరిస్థితిని అధిగమించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రతో రంగంలోకి దిగిన బ్రోకర్ల ముఠాను పట్టి బంధించటం ద్వారా యావత్ దేశం ఉలిక్కి పడేలా చేశారు. తెలంగాణ తెగువ ఎటువంటిదో బీజేపీ అగ్రద్వయానికి అర్థం కావించారు. ఇప్పటికే ప్రారంభమైన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మరోసారి ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడిన అసంబద్ధమైన మాటలే వారిలో మొదలైన కలవరాన్ని పట్టి చూపుతున్నాయి.
బీజేపీపై యుద్ధాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లాల్సిన సందర్భమిది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. దేశానికి పట్టిన బీజేపీ చెదలను వదలగొడదాం.. దేశాన్ని రక్షించుకుందాం అన్న అధినేత పిలుపుతో టీఆర్ఎస్ నేతలలో నూతనోత్సాహం పరవళ్ళు తొక్కింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలు ఇప్పటికే దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ఆయా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పలు రాజకీయ పక్షాలు అప్రమత్తమయ్యాయి. ఈ కుట్రపై దర్యాప్తును సీబీఐకి బదలాయించటం ద్వారా, సాక్ష్యాధారాలను తారుమారు చేయాలనుకున్న బీజేపీ కుతంత్రం ఫలించలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగే ఈ యుద్ధంలో ఇవాళ తెలంగాణ కేసీఆర్ వెంట నిలబడ్డది. రేపు దేశమంతా కేసీఆర్ నాయకత్వంలో ముందుకు కదలుతుంది.