ఒకవైపు అఫ్గానిస్థాన్ పరిణామాలు ఆందోళనకరంగా పరిణమిస్తున్న తరుణంలో మరోవైపు చైనా శ్రీలంకలో పాగా వేసి భారత్‌ను ఇరుకునపెట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ప్రపంచమంతా కరోనా మహమ్మారిని, తదనుగుణంగా ఏర్పడిన ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడంలో తలమునకలై ఉన్నది. కానీ చైనా మాత్రం తన సహజ ధోరణిలో తనవైన ఆర్థిక, సైనిక వ్యూహాలను దొడ్డిదారిన అమలుచేస్తున్నది. దీనికి తాజా ఉదాహరణ శ్రీలంకలో డ్రాగన్ విస్తరణ కార్యకలాపాలు. ఇప్పటివరకూ దక్షిణ శ్రీలంకకే పరిమితమైన చైనా ‘ప్రాజెక్టులు’ ఇటీవలి కాలంలో భారత తీరానికి సమీపంలోని ఉత్తర శ్రీలంకలో కూడా ప్రారంభమవుతున్నాయి. వీటిని భవిష్యత్తులో చైనా వ్యూహాత్మక స్థావరాలుగా ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నది.
2019లో రాజపక్స శ్రీలంక ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పూర్తిస్థాయిలో కుటుంబ పాలనకు తెరతీశారు. రక్షణ, ఆర్థికం వంటి కీలక మంత్రిత్వ శాఖలను తన వద్ద, తన సోదరులు, బంధువుల వద్ద పెట్టుకొని.. ప్రజాస్వామ్య విధానాలను పక్కనపెడుతూ శ్రీలంకలో నియంతృత్వ వ్యవస్థకు దారితీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు, రాజపక్సకు మధ్య స్నేహం బలపడుతున్నది. నిరంకుశ కమ్యూనిస్టు రాజ్యమైన చైనాకు కూడా ప్రజాస్వామ్య పోకడలు గిట్టవు. యూరప్‌లో చైనా తన మార్కెట్ వ్యూహాలను అమలుపర్చటానికి అస్థిర, నిరంకుశ రాజ్యాలుగా ఉన్న బాల్కన్ దేశాలలో తొలుత అడుగుపెట్టి.. ఆ తర్వాత క్రమంగా యూరప్ మార్కెట్లోకి విస్తరించింది. ఇదే వ్యూహంలో భాగంగా.. దక్షిణాసియాలో పెద్ద దిక్కుగా ఉన్న భారత్ ప్రభావాన్ని తగ్గించటానికి శ్రీలంక వంటి దేశాలను చైనా వాడుకుంటున్నట్లు అనిపిస్తున్నది.
భారత్‌కు పొరుగునే ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలకు ఓవైపు అప్పులిస్తూ, మరోవైపు మౌలిక ప్రాజెక్టులు నిర్మిస్తూ చైనా ఈ ప్రాంతంలోకి వేగంగా అడుగులు వేస్తూ వస్తున్నది. అఫ్గానిస్థాన్‌లో కూడా తాలిబన్లు అధికారానికి రావడంతో అక్కడ చైనా ప్రాబల్యం నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో భారత్ అత్యంత జాగ్రత్తగా ప్రతివ్యూహాన్ని రచించాలి. చైనాకు వైరిపక్షాలుగా ఉన్న అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి అగ్రరాజ్యాలతో సైనిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. పొరుగు దేశాల నమ్మకాన్ని చూరగొని దక్షిణాసియాలో చైనా ప్రవేశాన్ని సమిష్టిగా నిరోధించే చర్యలు చేపట్టాలి. దేశంలోని విస్తారమైన మానవ వనరులను ఉపయోగించుకుంటూ.. చైనా వస్తువులకు పోటీగా నాణ్యమైన, చవకైన వస్తువులను తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్లలో ఆ దేశానికి దీటుగా ఎదగాలి. ఈ బహుముఖ వ్యూహంతోనే చైనాకు చెక్ పెట్టగలం.