తెలంగాణొస్తే ఏమొస్తది అంటూ ఎకసెక్కాలాడినోళ్లకు.. ఇదిగో.. కళ్లు బాగా తెర్చుకొని చూడండి.. వచ్చిందిదీ అని బల్లగుద్ది చెప్పినట్లుగా ఉంది ‘ఏడేండ్ల ప్రగతి నివేదిక’. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానాయకుడే పాలకుడైతే రాష్ట్రం ఎంతటి మహత్తర అభివృద్ధిని సాధిస్తుందో తెలుపుతుందీ కరదీపిక. తెలంగాణ అభివృద్ధిని అభివర్ణించడానికి ఏ ఒక్క రంగమని చెప్పగలం! వ్యవసాయమా, పెట్టుబడులా, గ్రామీణ వృత్తులా, సాగునీటి ప్రాజెక్టులా, ఐటీ ఎగుమతులా, తలసరి ఆదాయమా, సంక్షేమ పథకాలా! ఏ రంగంలో చూసినా ఇతర రాష్ర్టాలను దాటేసి ముందుకు దూసుకుపోతున్నది. ఏవైపు చూసినా అచ్చెరువొందించే అభివృద్ధి! జనాభాలో, వైశాల్యంలో పెద్దవైన రాష్ర్టాలున్నా, ఏడేండ్ల కిందట అవతరించిన రాష్ట్రం ఇంతగా వృద్ధి చెందడం పసికందు పరుగులు పెట్టినంత అద్భుతం.
వివిధ రంగాలలో మనం సాధించిన విజయాలకు నిలువెత్తు దర్పణం ప్రగతి నివేదిక. రాష్ర్టావిర్భావ సమయంలో ఏడాదికి రూ.41,706 కోట్ల విలువైన పంటలు పండితే 2020-21కి అది రూ.80,574 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు 100 శాతం అభివృద్ధి. 2014-15లో రాష్ట్రంలో పశుసంపద విలువ రూ.29,282 కోట్లుకాగా, ప్రస్తుతం రూ.94,211 కోట్లకు పెరిగింది. మత్స్ససంపద నాడు రూ.2,670 కోట్లు ఉండగా.. నేడు రూ.5,254 కోట్లకు చేరుకుంది. ఐటీ రంగ ఉత్పత్తి అయితే 120 శాతం వృద్ధి చెందింది. సొంత రాబడుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రాథమిక, ద్వితీయ సేవా రంగాలలో ఊహాతీత పురోగమనాన్ని గమనించవచ్చు. అత్యధిక సగటు వృద్ధిరేటులో దేశంలోనే మూడోస్థానం, దక్షిణభారతంలో నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచింది. అన్ని రంగాల్లో అగ్రస్థానానికి ఎగబాకుతూనే అప్పులలో మాత్రం అట్టడుగున 25వ స్థానంలో ఉండటం తెలంగాణ విశిష్టత!
ముంజేతి కంకణానికి అద్దమెందుకు అన్నట్టు- తెలంగాణ అభివృద్ధిని అంకెలలోనే చూడవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరి అనుభవంలోని విషయమిది. ఒక రైతును అడిగినా, గ్రామీణ కూలీని కదిలించినా, ఆసరా పింఛన్ అందుకుంటున్న వృద్ధుడిని పలుకరించినా ప్రభుత్వ ప్రగతి ఫలాలు అట్టడుగు వర్గాలను చేరుకున్నాయన్నది తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభివృద్ధి వ్యూహంలో ఏ ఒక్కరంగాన్ని వదిలిపెట్టడం లేదు. ఏ వర్గాన్నీ విస్మరించడమూ లేదు. సాఫ్ట్‌వేర్‌తో సమంగా గ్రామీణ వృత్తులకూ పట్టం కట్టారు. అభివృద్ధి విధ్వంసకరంగా మారకుండా ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పారిశ్రామిక రంగంతో దీటుగా వ్యవసాయం వెలిగిపోతున్నది. ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి కొనసాగుతున్నది. సంపద సృష్టిలో నగరాలతో పల్లెలు పోటీపడుతున్నాయి. మనం సాధించిన ఈ విజయాలకు గర్వపడుదాం. అభివృద్ధిని ఉద్యమంగా సాగించాలనే కేసీఆర్ సందేశాన్ని విస్మరించకుండా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిద్దాం.