బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోయడం చూసిన తెలంగాణ బిడ్డల గుండె కలుక్కుమంది. అమిత్ షా తనకు గురువు, తండ్రి లాంటివాడనీ ఆయన చెప్పులు మోయడం తనకు ఆనందకరమనీ బండి సంజయ్ బింకం ప్రదర్శించవచ్చు. ఆయన ఎలాంటి గురువో, ఈయనకు ఏమి నేర్పిండో, ఈయన ఏమి నేర్చుకున్నాడో తెలువదు కానీ, సంజయ్ సంజాయిషీ ఆత్మవంచనకు పరాకాష్ఠ అనేది ప్రజలకు కనిపిస్తూనే ఉన్నది. ఢిల్లీ ప్రభువులను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడి బీజేపీ నాయకులు అనుక్షణం పడే పాట్లకు ఈ చెప్పులు మోయడం ఒక ప్రత్యక్ష తార్కాణం. బహిరంగంగా అంగీకరించలేక పోయినా, ఢిల్లీలో తిష్ఠవేసిన గుజరాతీలకు గులాంగిరీ చేయవలసిన దీనస్థితి వీరిది. స్వాభిమానమే సంపదగా భావించే తెలంగాణ వారికి ఇటువంటి చేష్టలు అసహ్యం అనిపిస్తాయి. అందుకే ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. సంజయ్ సమర్థించుకోవడానికి తంటాలు పడాల్సి వచ్చింది.
జాతీయ పార్టీలలో ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర నాయకులు ఆత్మాభిమానం చంపుకొని బతకడం కొత్త కాదు. ఇవాళ బీజేపీ కావచ్చు, నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ కావచ్చు, ఢిల్లీలో ఏ రాజకీయపక్షం అధికారంలో ఉన్నా రాష్ట్ర నాయకులు మోకరిల్లవలసిందే. ఎమర్జెన్సీ కాలంలో ఒక రాష్ట్రంలో సంజయ్‌గాంధీ విమానం ఎక్కుతున్నప్పుడు ఆయన బూటు జారిపడితే, దాన్ని అందివ్వడానికి ముఖ్యమంత్రి, మంత్రులు పోటీపడ్డారట! ఆరణాల కూలీనంటూ నిగర్వంగా చెప్పుకునే అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాజీవ్‌గాంధీ నిష్కారణంగా బహిరంగంగా ఆయనను అవమానించారు. ఆ ఘటన రాష్ట్ర ప్రజలను కలచివేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం దెబ్బతినడానికి ఈ ఘటన కూడా కారణం. ఏఐసీసీ నాయకులు నయా జమీందారుల్లా వ్యవహరిస్తారనేది, వారి దగ్గర స్వాభిమానానికి తావు లేదనేది పలువురు రాష్ట్ర నాయకుల అనుభవం లోనిదే.
జాతీయ పార్టీలలోని రాష్ట్ర నాయకులు ఢిల్లీలోని ప్రభువుల మెప్పు పొందడానికి ప్రాధాన్యం ఇస్తారే తప్ప, రాష్ట్ర బాగోగులు పట్టించుకోరు. మన ప్రజల తరఫున కేంద్ర పాలకులను నిలదీయలేరు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఈ చేదనుభవాల నేపథ్యంలోనే స్థానిక ప్రజల ఆకాంక్షలను పరిరక్షించుకోవడానికి, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాంతీయ పక్షాలను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏ మనిషీ తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడు, ఏ జాతీ తన స్వేచ్ఛను పణంగా పెట్టదు అనేది సామెత. అందుకే ‘గులాబీ బనో, గులామీ ఛోడో’ అనే నినాదం తెలంగాణ ఉద్యమ కాలంలో వినిపించింది. తమ అధిష్ఠాన వర్గం ఢిల్లీలో లేదనీ, తెలంగాణ ప్రజలే తమకు అధిష్ఠానమని టీఆర్ఎస్ నాయకులు పదేపదే చెబుతుండేది ఈ నేపథ్యంలోనే.