దేశ రైతాంగం మళ్ళా హస్తిన బాట పట్టింది. కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరిపై మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మునుపటిలాగే ఈసారి కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడే వచ్చామని రైతు నిరసనకారులు తేల్చిచెబుతున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచే కాకుండా దక్షిణాదిన కర్ణాటక, కేరళ మొదలుకొని తూర్పున ఒడిశా, పశ్చిమాన మహారాష్ట్ర వరకు దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది రైతులు ఢిల్లీలో బైఠాయించారు. ఈసారి మోదీ క్షమాపణ చెప్పినా వారు వెనక్కి తగ్గకపోవచ్చు. వారికి ఎదురైన అనుభవం అలాంటిది మరి! గత ఏడాది సాగుచట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పినప్పుడు రైతులు నిరసన విరమించి ఇంటి బాటపట్టారు. కానీ, మోదీ క్షమాపణ బూటకమని తొమ్మిది నెలల్లోనే తేలిపోయింది.
ప్రభుత్వం ప్రకటించే పంట మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, లఖిమ్పురి ఖేరి హత్యా ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను పదవి నుంచి తప్పించాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసే విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ మోదీ సర్కారు అంగీకరించకపోగా, కమిటీల పేరుతో ఇన్నాళ్లూ కాలయాపన చేసింది. అప్పట్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేంద్రప్రభుత్వం సాగుచట్టాలను రద్దు చేసిందే తప్ప, తమ ఉద్యమంపై సానుభూతితో కాదని రైతులు అర్థం చేసుకున్నారు. ఏడాదిపాటు కుటుంబాలను వదిలి చలిలో, ఎండలో, వానలో రాజధాని రోడ్ల మీద నిరసన తెలిపినా, కొన్ని వందలమంది ప్రాణాలు కోల్పోయినా కూడా ప్రభుత్వ వైఖరి మారలేదని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరో సుదీర్ఘ పోరాటానికి సిద్ధమై మళ్లీ ఢిల్లీ బాట పట్టారు.
మోదీ పాలనలో ఒక్క రైతులే కాదు, భిన్న వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రాంతీయ ఆకాంక్షలు అణగారి పోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు కూడా తమ వ్యూహాన్ని సమీక్షించుకోవాలి. కేవ లం తమ డిమాండ్లకే పరిమితం కాకుండా, ఇతర శ్రామిక, కార్మిక వర్గాలతో చేతులు కలపాలి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేంద్రంపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న రాజకీయశక్తుల సంఘీభావం పొందాలి. వ్యవసాయ సంక్షోభం ఒక్క రైతుల సమస్య కాదు. దేశ ప్రజలందరికీ సంబంధించినది. దేశంలోని భిన్న వర్గాల వారు రైతులకు సౌహార్దత తెలుపాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించినట్టు వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ రాజకీయ- ఆర్థిక ప్రణాళికను రూపొందించుకొని దేశ ప్రజల ముందుకు తీసుకుపోవాలి. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విస్తృత ఐక్య సంఘటనకు రైతు ఉద్యమం నాంది పలకాలి.