కేంద్రంలోని బీజేపీ పాలనలో పలు రాష్ర్టాలు మతపరమైన వైషమ్యాలలో కొట్టుకుపోతుంటే.. గంగాజమునా తెహజీబ్‌గా వర్ధిల్లు తూ దేశానికే ఆశారేఖగా నిలుస్తున్నది తెలంగాణ. ఇందులో తెలంగాణ పోలీసు విభాగం పాత్ర చెప్పుకోదగినది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్ర పోలీస్ విభాగం అద్భుతమైన విజయాలు సాధిస్తున్నది. దీనికి తాజా నిదర్శనం.. 42.47 లక్షల మం ది యూజర్లతో మన ‘హాక్ ఐ’ దేశంలోని పోలీస్ యాప్‌లలో రెండో ర్యాంకును కైవసం చేసుకోవటం. 1.1 కోట్ల మంది యూజర్లతో తొలి స్థానంలో ఉన్న ఢిల్లీ యాప్ ‘లాస్ట్/ఫౌండ్ ఆర్టికల్ రిపోర్ట్’ను విలువైన వస్తువులను, డాక్యుమెంట్లను పోగొట్టుకున్నవారికి వాటిని వెతికి ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీని యూజర్ల సంఖ్య అధికంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ పోలీస్ హాక్ ఐ మాత్రం పోలీసు విభాగానికి సంబంధించిన సమస్త సేవలను అందిస్తున్నది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన రంగాల్లో శాంతిభద్రతలు ఒకటి. పోలీసు విభాగంలో ఆయన పలు సంస్కరణలను ప్రారంభించారు. పాత వాహనాల స్థానంలో వందలాది కొత్త ఇన్నోవాలను, వేలాది బైకులను సమకూర్చారు. అగ్ర దేశాల్లో మాదిరిగా విజిబుల్ పోలీసింగ్‌కు పెద్దపీట వేశారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 800 పోలీస్ స్టేషన్లలో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నెలవారీ నిధుల కేటాయింపును గణనీయంగా పెంచారు. 24 గంటలూ పనిచేసే ప్రత్యేక రిసెప్షన్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. వీటన్నింటి వల్ల పోలీస్ స్టేషన్లు కార్పొరేట్ ఆఫీసుల్లాగా మారిపోయాయి. జీరో ఎఫ్ఐఆర్ సదుపాయాన్ని తీసు కువచ్చారు. దీనివల్ల బాధితులు తమకు తక్షణం అందుబాటులో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి, ఆ తర్వాత నేరం జరిగిన ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేయించుకోవచ్చు. మరో వైపు, నేరాల కట్టడికి ఉపకరించే సీసీ కెమెరాలను రాష్ట్రంలో పెద్దఎత్తున ఏర్పాటు చేశారు.
మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం కొనియాడదగినది. ‘మహిళా భద్రత విభాగం’ ప్రత్యేకంగా ఏర్పా టైంది. పోకిరీల వేధింపులను అరికట్టడానికి తీసుకొచ్చిన ‘షీ’ టీమ్స్, దేశంలోని పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. హాక్ ఐ యాప్‌లో మహిళల కోసం, ఉద్యోగినుల కోసం ప్రత్యేకమైన ఫీచర్లను పొందుపరిచారు. మరోవైపు, ఫిర్యాదు నమోదు తర్వాత అక్కడికే వదిలేయకుండా దర్యాప్తు జరిపి, కేసు నమోదు చేసి, నేరస్థులకు కోర్టులో శిక్ష పడేవరకూ ప్రతి దశనూ పర్యవేక్షించేలా యంత్రాంగాన్ని ఏర్పా టుచేశారు. ఫలితంగా రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతచిచ్చును రగల్చటానికి ఒకట్రెండు ప్రాంతాల్లో కొందరు కుట్రలు పన్నితే, తెలంగాణ పోలీ సు విభాగం వాటిని మొగ్గలోనే తుంచేసింది. పోలీసు విభాగం సమర్థతను వెలికితీయడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత.