‘రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నయా? ఏండ్ల నుంచీ ఉన్నవే కదా!’- రాష్ట్రంలో అన్నదాతలు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే మహారాష్ట్ర వ్యవసాయమంత్రి స్పందన ఇది. బీజేపీ అండదండలతో శివసేనను నిలువునా చీల్చి గద్దె నెక్కిన ఏక్నాథ్ షిండే ఏడు నెలల పాలనలో రైతుల ఆత్మహత్యలు తీవ్రరూపం దాల్చాయి. రోజుకు ఎనిమిది రైతు ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. దీనిపై సాక్షాత్తు వ్యవసాయ మంత్రి స్పందన ఇలా ఉంది. బీజేపీ పాలనలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తరప్రదేశ్ది మరో కథ. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఒక్కటి కూడా లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల గొప్పగా ప్రకటించుకున్నారు. కానీ, జాతీయ నేర గణాంకాల బ్యూరో వివరాల ప్రకారం.. యోగి పాలన మొదలైన 2017 నుంచీ 2022 వరకూ 398 మంది రైతులు, 791 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాల పరిస్థితి ఇదీ.
మనం 22వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పటికీ వరుణుడి కరుణా కటాక్షాల మీదే దేశంలో వ్యవసాయం ఆధారపడి ఉన్నది. వానలు కురిసినా నకిలీ విత్తనాలు, పురుగు మందులు, గిట్టుబాటు ధర లేకపోవటం, మార్కెట్ మాయాజాలం.. అన్నీ కలిసి రైతుల జీవితాలను సంక్షోభంలోకి నెడుతున్నాయి. దీనివల్లే దేశంలో అతిపెద్ద ఉపాధి రంగమైనప్పటికీ వ్యవసాయం ఆపసోపాలు పడుతున్నది. దీన్ని ఉపయోగించుకొని ఓట్లు రాల్చుకోవటమే తప్ప ఈ సంక్షోభాన్ని పరిష్కరించే సోయి ఢిల్లీలో దశాబ్దాలుగా గద్దెనెక్కిన పాలకులకు లేకుండా పోయింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2014 లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. నమ్మి అన్నదాతలు ఓట్లు వేశారు. కానీ, ఆదాయం పెరగకపోగా వారి ఉసురు తీసే సాగుచట్టాలనే తీసుకొచ్చారు మోదీ. ఇదీ బీజేపీ తీరు.
కారు చీకట్లో కాంతిరేఖలాగా తెలంగాణ కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల కిందట కరువు కోరల్లో చిక్కి శల్యమైన తెలంగాణ నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత. కాళేశ్వరంతోపాటు అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో, మిషన్ కాకతీయతో తెలంగాణ నేలల దాహం తీరింది. ఆ తర్వాత రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ రైతుబంధు అండగా నిలిచింది. నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో వాటి జాడే లేకుండాపోయింది. ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేస్తూ రైతులకు భరోసానిచ్చింది. వీటితోపాటు రైతు వేదికల నిర్మాణం, రైతుబీమా తదితర పథకాలు తెలంగాణ వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చివేశాయి. ఆర్థిక, సామాజిక రంగాలకు ఆయువుపట్టయిన వ్యవసాయాన్ని పండుగలా మార్చారు కేసీఆర్. దేశంలో 1960ల నాటి వ్యవసాయ విప్లవం తర్వాత సాగురంగంలో అంతటి మహత్తర మార్పు చోటుచేసుకున్నది తెలంగాణలోనే. అది కూడా ఏడెనిమిదేండ్ల స్వల్ప కాలంలో. నేడు తెలంగాణ మాడల్ యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ సారథ్యం మాకూ కావాలంటూ ఇతర రాష్ర్టాల ప్రజానీకం కోరుతున్నారంటే దానికి కారణం ఈ అభివృద్ధి నమూనానే.