బుల్డోజర్ కూల్చివేతకు, విధ్వంసానికి ప్రతీక. కానీ నేడు బుల్డోజర్ సుపరిపాలనకు ప్రతీకగా బీజేపీ పాలకులు చూపుతున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న కొందరిని ముద్దాయిలుగా చూపి, వారి ఇండ్లను నేల మట్టం చేస్తున్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ విధమైన బుల్డోజ్ రాజ్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. కండ్లముందు జరుగుతున్న చట్ట ఉల్లంఘనలను సహించలేక ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సహా పన్నెండు మంది న్యాయకోవిదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాస్తూ.. ఈ బుల్డోజర్ దురాగతాలను సుమోటోగా స్వీకరించాలని కోరారు. ప్రయాగరాజ్ ఘటనల అనంతరం నిందితులుగా గుర్తించామని చెబుతున్న వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయటం చట్టాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. చట్టాన్ని పరిరక్షిస్తూ, అమలు చేయాల్సిన ప్రభుత్వమే అతిక్రమణకు పాల్పడితే చట్టబద్ధ పాలనకు అర్థమేమిటి? కాపాడా ల్సిన పాలకులే పాశవికంగా వ్యవహరిస్తే ఇక ఆ ప్రజలకు దిక్కెవరు?
ఏదో ఒక కేసులో ముద్దాయిలుగా పేర్కొని, ఆ తర్వాత వారి ఇండ్లను కూల్చివేయటం బీజేపీ పాలకులకు పరిపాటిగా మారింది. గతంలోనూ హనుమాన్ జయంతి సందర్భం గా ఇలాగే ప్రవర్తించారు. మధ్యప్రదేశ్-ఖర్గావ్, ఢిల్లీ-జహంగీర్పూర్, కర్ణాటక, గుజరాత్‌లలో హనుమాన్జయంతి ఊరేగింపుపై రాళ్లు రువ్వారన్న ఆరోపణలతో అనేకుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. తాజాగా యూపీలో ఘటనలకు బాధ్యుడిగా ఆరోపిస్తూ జావేద్ అహ్మద్‌ను అరెస్టు చేసిన మరుసటి రోజే అతని రెండంతస్తుల ఇంటిని బుల్డోజర్తో పడగొట్టారు. అంతకు ముందురోజే షహ్రాన్‌పూర్‌లో అతని సన్నిహితుల ఇండ్లను కూడా ధ్వంసం చేశారు. నేరారోపణ చేస్తున్న ప్రభుత్వమే నేర నిర్ధారణ చేసి, బుల్డోజర్ శిక్ష అమలు చేయటం ఏ చట్టం ప్రకారమో అంతు పట్టనిది. దశాబ్దాలుగా ఉన్న ఇండ్లు రాత్రికి రాత్రి అక్రమ కట్టడాలై పోతాయా? ఇన్నాళ్లుగా కనిపించని నియ మ, నిబంధనలు అక్కడి పాలకులకు ఇప్పుడే గుర్తుకువచ్చాయా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మీడియా సలహాదారు- ‘గుర్తుంచుకోండి.. ప్రతి శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది’ అని ట్విటర్ వేదికగా బుల్డోజర్ వార్నింగ్ ఇచ్చారు. హర్యానా బీజేపీ ఐటీ సెల్ బాధ్యుడు- ‘నేడు శుక్రవారం స్టోన్ డే. శనివారం బుల్డోజర్ డేగా ప్రకటించాల’ని ట్వీట్ చేశాడు. ఈ మాటలను బట్టి బీజేపీ పాలన తీరును అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్త అలజడి, ఆందోళనలకు కారణమైన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌పై చర్యలు తీసుకోవటానికి చేతులు రాని ప్రభుత్వం, నిరసనకారుల ఇండ్లను కూల్చివేయటంలో మాత్రం వేగంగా కదిలింది. ఏదైనా నిరసన ప్రదర్శనలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయనే ఆధారా లుంటే వాటిని అరికట్టడానికి చట్టాలున్నాయి, కోర్టులున్నాయి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ధ్వంసం చేయటం చట్టాన్ని అతిక్రమించటమేనని న్యాయమూర్తులు పేర్కొన్నది అక్షర సత్యం. ఇప్పటికే బుల్డోజర్లతో చేస్తున్న విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు, అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు చట్టాన్ని, న్యాయాన్ని సంరక్షించుకోవలసిన తరుణమిది. ఆ దిశగా అడుగులు పడాలి.