అనేక సామాజిక-ఆర్థిక నేరాలకు పేదరికమే మూలం. పేదరికం మనిషితనాన్ని దిగజారుస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మానవతనే మంట గలుపుతుంది. ఇటీవల రాష్ట్రంలో బయటపడిన చిన్నపిల్లల అక్రమ రవాణా ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ. ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ పోలీసులు వెల్లడించిన రహస్యాలు దిగ్భ్రాంతి గొల్పేవిగా ఉన్నాయి. పోలీసులు తమ ఆపరేషన్లో భాగంగా చిన్నపిల్లలను అదుపులోకి తీసుకున్నప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు తల్లిదండ్రులు వారిని వదులుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు చాలామందిని కదిలించాయి. అయితే పిల్లల అక్రమరవాణాకు సంబంధించిన వార్తల్లో ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాకపోవచ్చు. పేదరికం, దురాశల ప్రోద్బలంతో నడిచే చీకటి వ్యాపారం ఇది.
ఈ వ్యాపారంలో శిశువుల సేకరణ ప్రధానంగా కొనడం, అపహరించడం అనే రెండు మార్గాల ద్వారా జరుగుతుంది. పొత్తిళ్లలోని బిడ్డను తల్లిదండ్రులే కారుచౌకగా అమ్ముకోవడం గురించిన కథనాలు అప్పుడప్పుడు వెలుగుచూస్తూనే ఉంటాయి. ఇలా అమ్మడానికి కటిక పేదరికమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భద్రత అంతంతమాత్రంగా ఉండే దవాఖానలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో జరిగే శిశువుల అపహరణ గురించి కూడా మనం వింటుంటాం. పోలీసులు పట్టుకున్న ముఠాలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వారు ఇదివరకు ఇదే నేరం కింద అరెస్టయినవారే. అంటే అరెస్టులూ, కేసులతో ఈ నేరాలు ఆగడం లేదని అర్థమవుతున్నది. ఒక్కో చిన్నారికి చెల్లించే మొత్తంలో గణనీయమైన భాగం ఏజెంట్ కమీషన్ కింద పోతుంది. ఆ కమీషన్ కోసం కక్కుర్తిపడి కొందరు పదేపదే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు.
పిల్లల కోసం తపించే దంపతులు ఈ వ్యాపారానికి వినియోగ దారులు. మనదేశంలో చట్టబద్ధంగా పిల్లల దత్తతకు అవకాశాలు లేవా? అంటే ఉన్నాయి. కాకపోతే కఠినమైన నిబంధనలు అడ్డంకిగా ఉంటాయి, పైగా దత్తత తీసుకునేందుకు వేచిచూడాల్సిన సమయం అధికంగా ఉంటుంది. అడ్డదారులు తొక్కేందుకు ఇవే కారణమవుతున్నాయి. ప్రస్తుతం రెండేండ్లలోపు చిన్నారుల దత్తతకు రెండు నుంచి నాలుగేండ్ల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. పిల్లల ప్రయోజనాల పరిరక్షణకు దత్తత తీసుకునేవారు సుదీర్ఘమైన అనుమతి ప్రక్రియ పూర్తి చేయాలి. ఆఫీసుల చుట్టూ తిరగడం, అధికారులను కలవడం, బోలెడు పత్రాలపై సంతకాలు చేయడం వంటి తతంగమూ ఉంటుంది. దీనికితోడు దత్తతకు కావాల్సిన పిల్లల కొరత కూడా ఉంది. ఈ పరిస్థితులు అక్రమ రవాణాకు దారితీయడంతో పిల్లలు సంతలో సరుకులై చేతులు మారుతున్నారు. ఈ జాడ్యం నివారణ కోసం ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది. దాంతో పాటే అధికారిక తతంగాన్ని సులభతరం చేసి, దత్తత పథకాల గురించి పిల్లలు లేని తల్లిదండ్రులకు చైతన్యం కలిగించేందుకు కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలి. పిల్లల అక్రమ రవాణా నివారణకు నిఘా వ్యవస్థను మరింతి పటిష్ఠ పరచాల్సిన అవసరమూ ఉంది.