Congress | ‘అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిపెడతానన్నాడట’ అనే సామెత కాంగ్రెస్ పార్టీకి అతికినట్టు సరిపోతుంది. ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఆ పార్టీ హామీలు, గ్యారెంటీలంటూ చేస్తున్న హంగామా ఇంతా అంతా కాదు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలని, తెలంగాణలో ఆరు గ్యారంటీలని ఆశలు కల్పించి అధికారం సంపాదించారు. ఇవికాకుండా లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. గెలిచిన తర్వాత హామీల ఎగవేతకు రకరకాల సాకులు వెతుకుతున్నారు. అధికారం మీద యావతో సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా హమీలు ఇస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. తెలంగాణలో ఆరు హామీలు అమలవుతున్నాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పితే మిగతావన్నీ తుస్సయ్యాయి. ఇదేమని నిలదీస్తే నోటికొచ్చిన సాకు చెప్పి తప్పించుకోజూస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే ‘తెలంగాణను ఉద్ధరించాం ఇక దేశమంతటా అభ్యున్నతి సాధిస్తామని’ పార్లమెంటు సీట్ల మీద ఆశతో ఊదరగొడుతున్నారు. సంఖ్యల మీది వ్యామోహంతో ఈసారి తమ హామీలకు ‘పాంచ్ న్యాయ్’ (పంచన్యాయాలు) అని పేరు పెట్టారు.
దేశమంతటా మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామనేది అందులో ఇచ్చిన హామీల్లో ఒకటి. అంటే నెలకు సగటున 8 వేల పైచిలుకే ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా దాని అతీగతీ లేదు. 30 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది మరో హామీ. తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి జాబ్ క్యాలెండర్ అన్నారు. క్యాలెండర్లో నెలలు మారుతున్నాయి కానీ ఇంతవరకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన క్యాలెండర్ మాత్రం ఇంకా గోడమీదికి రాలేదు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి అంతా సిద్ధం చేసిన 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలను అట్టహాసంగా పంపిణీ చేసి అదంతా తమ గొప్పే అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. దేశంలో 30 లక్షల ఉద్యోగాలకూ ఇదే గతి పడుతుందా? కాంగ్రెస్ హమీల అమలు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రుణమాఫీ విషయాన్ని పరిశీలిస్తే చాలు. ‘రైతులు రుణాలు చెల్లించొద్దు మేం చూసుకుంటాం’ అని ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక రుణదాతలు రైతులను నానా బాధలు పెడుతుంటే తమాషా చూస్తున్నారు. ఇప్పుడు దేశమంతటా రుణమాఫీ అంటున్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీల అమలుకు ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ మూడింతలు కావాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు ఎప్పుడో తేల్చేశారు.
ఇప్పుడు దేశం మీదికి వదులుతున్న హామీల మాటేమిటి? కాంగ్రెస్ హామీల అమలుకు, దేశ ఆర్థిక పరిస్థితికి మధ్య అసలు పొంతన అనేది ఉన్నదా? హామీలిచ్చే ముందు వ్యయంపై అంచనాలు ఏమైనా వేసుకున్నారా? అంటే అలాంటి సూచనలేవీ కనిపించడం లేదు. హామీలు నిజంగా అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే లెక్కలు వేసుకుంటారు. కానీ కాంగ్రెస్ అలా కాదు, బండి వెనకాల గుర్రాన్ని కట్టినట్టుగా ఉంటుంది ఆ పార్టీ ధోరణి. హడావుడిగా హామీలిచ్చి ఆ తర్వాత తీరికగా వాటి అమలు గురించి ఆలోచించడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. తెలంగాణలో సాకులు చెప్పి తప్పించుకున్న అనుభవం చాలానే ఉన్నది. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా తమ చేతికి వచ్చిందని చెప్పలేదా? ఇక నిరుద్యోగ భృతి హమీ అయితే అసలు తాము ఇవ్వనేలేదని అసెంబ్లీ సాక్షిగా బుకాయించడం మనం చూడలేదా? జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్కు దేశాభివృద్ధికి సంబంధించిన ఎజెండా అనేది లేదు. ఆ అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారన్న వివరణ అసలే లేదు. కేవలం ఉచితాలు, ఊరింపులతో బురిడీ కొట్టించాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని హామీలను చూస్తే అర్థమైపోతుంది. అందరినీ అన్నిసార్లూ మోసం చేయడం కుదురుతుందా? అనేది అసలు ప్రశ్న.