‘సింహాలు రాయటం నేర్చుకోనంత వరకూ, ప్రతీ కథ వేటగాడినే కీర్తిస్తుంది’- ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యానికి మణిమకుటం వంటి చిను వా అచే ఒక నవలలో రాసిన ఈ వాక్యం ప్రపంచవ్యాప్తంగా విముక్తి ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చే నినాదం. మొన్న ఔరంగాబాద్‌లో రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటువంటి దిశానిర్దేశమే చేశారు. ‘రైతులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇంకెన్నాళ్లిలా? రైతులు స్వయంగా నాయకులు కావాలి. చట్టసభల్లోకి అడుగుపెట్టాలి. తమకు అవసరమైన చట్టాలను తామే రచించుకోవాలి’ అని జాగృత పరిచారు. దిక్కులేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు పులుల్లాగా మారాలని, దానివల్ల రైతుల సమస్యలు పరిష్కారం కావటమే కాదు, దేశంలో పరివర్తనా సాధ్యమవుతుందని ఉద్బోధించారు. అందరం కలిసికట్టుగా రైతురాజ్యాన్ని తీసుకొద్దామంటూ వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడవ బహిరంగ సభ ఇది. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ నాయకత్వం పట్ల పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం ఈ భారీ సభలు.
దేశానికే ఆర్థిక రాజధానిగా ముంబై నగరం పేరొందింది. అటువంటి సుసంపన్న నగరం రాజధానిగా ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని మెజారిటీ ప్రజలు తీవ్ర సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రైతుల పరిస్థితి మరీ దారుణం. రోజుకు సగటున ఆరేడుగురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పోగవుతున్న సంపద ఎటు పోతున్నట్టు? కేసీఆర్ సూటిగా ఇదే ప్రశ్న అడిగారు. ‘మహారాష్ట్ర కన్నా తెలంగాణ చిన్నది. అక్కడ ఉచిత విద్యుత్తు, పొలాలకు సాగునీరు, రైతుబంధు, రైతుబీమా సాధ్యమయినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడి నేతలకు చిత్తశుద్ధి లేకపోవటమే దీనికి కారణం’ అని మరాఠీలకు విడమర్చి చెప్పారు. తెలంగాణ మాడల్ ఇతర రాష్ర్టాల ప్రజలకు సజీవ ఉదాహరణగా నిలుస్తున్నది. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ సాధించిన విజయాలు నేడు దేశ ప్రజానీకానికి దారి చూపే దివిటీలు అయ్యాయి.
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ.. తన సారథ్యంలోని గుజరాత్‌ను అభివృద్ధి నమూనాగా ప్రచారం చేశారు. గుజరాత్లో సాధించినది ప్రజల అభివృద్ధి కాదని, మోదీ వ్యాపార మిత్రుల అభివృద్ధి మాత్రమేనని నాటి ప్రచార హోరులో జనానికి అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే భ్రమలు తొలగుతున్నాయి. తమకు అండగా నిలిచే వ్యాపార మిత్రులకు వేలు లక్షల కోట్ల పందేరం, ఓట్లేసే జనానికి మతం అనే మత్తుమందు- ఇదే బీజేపీ, మోదీ వ్యూహం అన్న సంగతి తెలుస్తున్నది. సరిగ్గా ఇప్పుడే కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి, దేశానికి నిజమైన అభివృద్ధి, సంక్షేమం ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకొచ్చారు. దానికి నిదర్శనంగా తెలంగాణ విజయాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, కులవృత్తుల నుంచి సంక్షేమం వరకు, విద్య వైద్య రంగాలు.. నభూతో అన్న విధంగా మారిపోయి తెలంగాణ ను దేశంలోనే మేటిగా నిలిపాయి. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు, సామాజిక కార్యకర్తలు తెలంగాణకు వచ్చి, చూసి ఇదంతా నిజమేనని పుస్తకాలు రాస్తున్నారు. కేసీఆర్ చెప్పినట్లు.. ‘మన పోరాటంలో నీతి, నిజాయితీ ఉంది. మనల్నెవరూ ఆపలేరు’. సత్యమేవ జయతే.