PM Modi | దిగజారుడు.. మోదీ నిజామాబాద్ ప్రసంగానికి సరిపోయే ఏకైక మాట ఇది. అంతకన్నా దిగజారడం ఎవ్వరికీ సాధ్యం కాదేమో. తాను దేశంలో అత్యున్నత పరిపాలన పదవిలో ఉన్నాననే సోయి కూడా మరచిపోయి సొల్లువాగుడుకు తెగబడటం మోదీకే చెల్లింది. కేసీఆర్ అంటే చావు అంచుల దాకా వెళ్లి స్వరాష్ట్రం సాధించిన అరుదైన నేత. సాధించిన రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి దేశానికే ఆదర్శంగా నిలిపిన అపురూప నిర్మాత. సహజంగానే ఇక్కడి ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆయనకే పట్టం కట్టారు. ముచ్చటగా మూడోసారి అధికారం అప్పజెప్పాలని చూస్తున్నారు. అదీ ఇక్కడి ప్రజల నమ్మకం. అది చూసి కుళ్లుకోని విపక్ష రాజకీయ నేత లేడు. కేసీఆర్ నుంచి ప్రజలను తెగ్గొట్టాలని పన్నాగం వేయని అధికార వ్యామోహి లేడు. అధికార దాహం అలాంటిది. కేసీఆర్ మీది ఈర్ష్య వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కేసీఆర్‌ను ఎన్నికల పోరులో ఓడించలేరు.
ఇక్కడి ఓటర్లు అందుకు సిద్ధంగా లేరు. ఎమ్మెల్యేలను కొనేసి అంతా ఉల్టాపుల్టా చేద్దామంటే ఇక్కడున్నది కేసీఆర్. కన్నం దొంగలను కన్నంలోనే పట్టుకొనే ఒడుపు ఆయనకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. అందుకే దొంగదెబ్బ తీద్దామని కాచుక్కూర్చున్నాయి రాజకీయ తోడేళ్లు. బట్టకాల్చి మీదేయాలని ఉరుకులాడుతున్నాయి. అందులో బీజేపీ పరివార్, ముఖ్యంగా మోదీ ముందుంటారు. ఎర్ర గురివిందకే సిగ్గు కలిగేలా మాట్లాడటంలో ఆయన ఆరితేరారు. రాజకీయాల్లో ఏమి జరుగుతుంది? అవతలి వాళ్ల కన్నా మెరుగైనది సాధించి చూపుతామని చెప్తే సబబుగా ఉంటుంది. కానీ మోదీ తెలంగాణకు ఏమి చేశారో చెప్పరు. ఏమి చేస్తారో చెప్పరు. చెప్పేందుకు, చేసేందుకు ఆయన దగ్గర ఏమైనా ఉంటే కదా! ఆ ఏమీలేని డొల్లతనం వల్లనే స్థాయి మరిచి అడ్డదిడ్డం విమర్శలు చేస్తుంటారు. కానీ ఒక వేలు నువ్వు చూపితే నాలుగు వేళ్లు నిన్ను చూపుతాయని మోదీ తెలుసుకోవాలి. ఆయన పైసా ఇవ్వకున్నా సొంత నిధులతో పథకాలు, ప్రాజెక్టులు అమలు చేస్తున్నది తెలంగాణ. ఒక్కసారి ఆయన తన గుజరాత్ మాడల్‌ను తెలంగాణతో పోల్చి చూసుకుంటే తెలుస్తుంది అబివృద్ధి అంటే ఏమిటో.
సీఎం కేసీఆర్‌ను చూస్తే మోదీకి కండ్లమంట. తెలంగాణ సాధించిన అద్వితీయ ప్రగతిని చూస్తే కడుపు మంట. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనం బట్టబయలుతో తన పరువు పోగొట్టుకున్న మాట మోదీ మరిచినట్టున్నారు. అమాయక గుజరాతీలను మభ్యపెట్టినట్టుగా ఇక్కడా అవాకులు, చెవాకులు పేలితే పని జరుగుతుందని అనుకున్నట్టున్నారు. ఢిల్లీ నేతననే సంగతి మరిచిపోయి ఒళ్లు తెలియక గల్లీ స్థాయి మాటలకు దిగారు. దేశానికి ప్రధానిననే తెలివిడి కొరవడి గుజరాతీ ప్రధానినని మాటజారారు. పైగా స్వాతంత్య్రోద్యమ జాతీయ మహా నేత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను తనతోపాటుగా గుజరాతీ స్థాయికి దించారు. సహేంద్ర తక్షకాయ స్వాహా అంటే ఇదే.
కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయాలనుకున్నారట. అందుకు మోదీ గారి ఆశీస్సులు కావాలన్నారట. పైగా ఎన్డీయేలో బీఆర్ఎస్ను చేరుస్తానన్నారట. ఏమి వాక్చాతుర్యం? ఇందులో ఏమన్నా అర్థముందా? ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా మాట్లాడటమంటే ఇదే. ఇక్కడి ఓటరును ఎలాగోలా మాయ చేయాలనే చౌకబారు సొల్లు మాటలు కావా ఇవి? కేవలం ఇద్దరి మధ్య జరిగినట్టుగా చెప్పుకొనే మాటలకు సాక్ష్యమెవడు? అయినా తన పార్టీని ఎన్డీయేలో చేర్చాల్సిన అగత్యం కేసీఆర్‌కు ఏముంది? కేటీఆర్ సీఎం కావాలంటే బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయిస్తుంది. మోదీ ఆశీస్సులతో పనేమిటి? చిన్న పిల్లలు కూడా నవ్వుకునేలా మాట్లాడి ఏమి సాధించాలనుకున్నారు మోదీ?
ఓటమి భయంతో వణికిపోతున్న మోదీ ఏ ఆకు దొరికినా పట్టుకోవాలని చూస్తున్న సంగతి దేశానికి తెలుసు. అందుకే చివరి దింపుడుకల్లం ఆశగా మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు తెచ్చారనేది ఎవరికి తెలియదు. ఇప్పట్లో అది కార్యరూపం దాల్చే అవకాశాలే లేవు. మరైతే ఎందుకు హడావుడి? ప్రత్యేక సమావేశాల పేరిట హంగామా ఎందుకు? 370 తరహాలో దీనినీ ముందుగానే ఎందుకు ఎజెండాగా చేసుకోలేదు. అంటే మోసం, దగా. నయవంచన. మతం పేరిట, పాకిస్థాన్ బూచి పేరిట ఆడిన నాటకాలు అయిపోయాయి. అందుకే మహిళల ముందు మోకరిల్లుతున్నారు.
కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు. మోదీ వంగి వంగి దండాలు పెడితే కర్ణాటక ప్రజలు విసిరి అవతల పారేసిన సంగతి మనకు తెలుసు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించేందుకు మోదీ హామీలిస్తున్నారు. ఇవి ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇచ్చినవని ఎవరికి తెలియదు? స్విస్ నల్లధనం, రెండు కోట్ల ఉద్యోగాల తరహా మోదీ హామీలు నీటి మూటలని తెలియనిది ఎవరికి? నిజామాబాద్ సభలో గుడ్లురుముతూ, వేలు చూపుతూ చాలా ప్రయాస పడిపోయారు మోదీ. ఏదో జరిగిపోయినట్టుగా నమ్మించేందుకు చాలానే నటించారు. కానీ ఏం లాభం? తెగించి పోరాడే తెలివైన బిడ్డల తెలంగాణ గడ్డ ఇది. మోదీ మోసకారి మాటలకు పడిపోయేవారు ఇక్కడ ఎవరూ ఉండరన్న సంగతి గుజరాతీ ప్రధానికి మరోమారు తెలిసివచ్చే రోజు త్వరలోనే రానున్నది.