e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home సంపాదకీయం అల్విదా దిలీప్‌ సాబ్‌!

అల్విదా దిలీప్‌ సాబ్‌!

‘మై కిసీసే నహీ డర్తా, మై జిందగీ సే నహీ డర్తా, మౌత్‌ సే నహీ డర్తా, అంధేరేసే నహీ డర్తా, డర్తా హూ తో సిర్ఫ్‌ ఖూబ్‌సూర్తీ సే’ (నేను ఎవరికీ భయపడను, జీవితంగానీ, మృత్యువుగానీ, చీకటిగానీ నన్ను భయపెట్టలేవు. కేవలం సౌందర్యం తప్ప) వంటి అజరామర డైలాగులతో ప్రేమ పిపాసిగా, ట్రాజెడీ కింగ్‌గా సినీ ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న దిలీప్‌కుమార్‌ అంతు తెలియని లోకాల సౌందర్యాలను వీక్షించటానికి భువిని వీడి వెళ్లిపోయారు. బాలీవుడ్‌ తొలితరం త్రిమూర్తులుగా పేరుగాంచిన రాజ్‌కపూర్‌, దేవానంద్‌, దిలీప్‌కుమార్‌లలో తొలి ఇద్దరు ఇప్పటికే అమరలోకపు వాసులను రంజింపజేయటానికి తరలివెళ్లగా.. తన సహచరులతో కలిసి నటనా వైదుష్యాన్ని ప్రదర్శించటానికి 98 ఏండ్ల దిలీప్‌ సాబ్‌ కూడా పయనమయ్యారు. దిలీప్‌కుమార్‌ నిష్క్రమణతో బాలీవుడ్‌ చరిత్రలో ఒక శకం ముగిసింది!

బాలీవుడ్‌ తొలి సూపర్‌స్టార్‌గా విఖ్యాతినొందిన దిలీప్‌కుమార్‌ నటనా జీవితం కూడా ఒక సినిమా కథలాగే ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పుణెలో తమ కుటుంబానికి చెందిన పండ్ల వ్యాపారాన్ని చూసుకుంటున్న ఓ యువకుడిని చూసి నాటి ప్రఖ్యాత నటీమణి దేవికారాణి సినిమా అవకాశాన్నిచ్చారు. ఆ యువకుడి పేరు మహమ్మద్‌ యూసుఫ్‌ఖాన్‌. సినీరంగంలో రాణించాలంటే ప్రేక్షకులకు బాగా గుర్తుండే పేరుండాలని రచయిత భగవతీచరణ్‌ వర్మ దిలీప్‌కుమార్‌గా పేరు మార్చుకొనమని సూచించారు. 1944లో ‘జ్వార్‌ భాటా’ అనే సినిమాతో దిలీప్‌కుమార్‌ సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఎనిమిదేండ్లలోనే హషీద్‌, మేలా, ఆన్‌, ఆర్జూ, దీదార్‌ వంటి హిట్లతో బాలీవుడ్‌లో ఒక స్టార్‌గా తన స్థానాన్ని ఆయన సుస్థిరం చేసుకున్నారు.

- Advertisement -

ఐదు దశాబ్దాల దిలీప్‌ సాబ్‌ సినీ ప్రస్థానంలో ‘మొఘల్‌-ఏ-ఆజం’ మహోన్నత కళాఖండంగా నిలిచిపోయింది. ప్రేయసి కోసం తన తండ్రి అక్బర్‌ చక్రవర్తిని ఎదిరించే యువరాజుగా సలీం పాత్రలో దిలీప్‌కుమార్‌ నటన శిఖరాగ్రాన్ని చేరుకుంది. ‘మేరా దిల్‌ బీ ఆప్‌ కా కోయీ హిందుస్థాన్‌ నహీ, జిస్‌ పర్‌ ఆప్‌ హుకూమత్‌ కరే’ అంటూ ఆయన చెప్పిన డైలాగులకు జనం బ్రహ్మరథం పట్టారు. మరో పదేండ్లపాటు రొమాంటిక్‌-ట్రాజెడీ కింగ్‌గా ఆయన శకం కొనసాగింది. 1970 దశకం ఆరంభంలో రాజేష్‌ఖన్నా రాకతో దిలీప్‌కుమార్‌కు పోటీ ఎదురైంది. బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరోగా రాజేష్‌ ఖన్నా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ తర్వాత కొన్నేండ్లలోనే ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ అమితాబ్‌ బచ్చన్‌ శకం మొదలైంది. దీంతో దిలీప్‌కుమార్‌ పంథా మార్చుకున్నారు. 1980ల నుంచీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రూపాంతరం చెందారు. క్రాంతి, శక్తి, కర్మ, సౌదాగర్‌ వంటి సూపర్‌హిట్లతో తానేమిటో మరోమారు నిరూపించుకున్నారు. 1998లో ఖిలా ఆయన ఆఖరి సినిమా. సినీరంగానికి వీడ్కోలు పలికి 23 ఏండ్లవుతున్నా దిలీప్‌కుమార్‌ను బాలీవుడ్‌గానీ, భారతీయ సినీ ప్రేమికులుగానీ మర్చిపోలేదు. ఆయన అస్తమయం పట్ల యావత్‌దేశం స్పందిస్తున్న తీరే దీనికి నిదర్శనం. అల్విదా దిలీప్‌ సాబ్‌! .

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana