మన దేశంలో పేపర్ బ్యాలెట్ స్థానంలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ (ఈవీఎం)ను ప్రవేశపెట్టినప్పటి నుంచీ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈవీఎంలను హ్యాకింగ్ చేసి ఓటరు తీర్పును తారుమారు చేయొచ్చనే అనుమానాలు విస్తారంగా వ్యాప్తిలోకి రావడమే అందుకు కారణం. కొందరు ఔత్సాహికులు ఇచ్చిన హ్యాకింగ్ ప్రదర్శనలతో ఇవి మరింత బలపడుతూ వచ్చాయి. వీటి నివృత్తికి 2017 నుంచి నూరు శాతం ఈవీఎంలకు వీవీప్యాట్లు అమర్చారు. అంటే మరోసారి ఓటింగ్‌లో కాగితాలను ప్రవేశపెట్టినట్టు! ఎలక్ట్రానిక్ ఓటింగ్ వివరాలతో పాటుగా ఆయా గుర్తులతో కూడిన కాగితపు స్లిప్పులను వీటిలో భద్రపరుస్తారు. లెక్కింపు సమయంలో అప్పటికప్పుడు ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్లను ఎలక్ట్రానిక్ ఓటింగ్‌తో సరిపోల్చి చూస్తారు. వీవీ ప్యాట్ల లెక్కింపు మొదట అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒకటిచొప్పున ఎంపిక చేసేవారు. తర్వాత ఈ సంఖ్యను ఐదుకు పెంచారు. వీటిని చీటీల పద్ధతిలో ఎంపిక చేస్తారు. అయినా ఈ వ్యవస్థను అనుమానాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఎంపిక చేసిన ఐదు బూత్‌లలోనే ఎందుకు వీవీప్యాట్ల లెక్కింపు జరగాలి? నూటికి నూరు శాతం తనిఖీ చేయాల్సిందేననే డిమాండ్లూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక సంస్కరణల సంస్థ (ఏడీఆర్) గత ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు గడప తొక్కింది. గతవారం ఈ కేసుపై వాదనలు ముగిశాయి. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తీర్పు వాయిదా పడింది.
నిజానికి వీవీ ప్యాట్లపై కేసులు వేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సుబ్రమణ్యంస్వామి కేసులో సుప్రీంకోర్టు స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిపేందుకు వీవీప్యాట్లు తప్పనిసరని, వాటికి అవసరమైన సరంజామా ప్రభుత్వం సమకూర్చాలని ఆదేశించింది. కాగా, 50 నుంచి 100 శాతం వీవీప్యాట్ల లెక్కింపు జరపాలని వివిధ రాజకీయపార్టీల నుంచి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు అందాయి. అధిక సమయం పడుతుందనే వంకతో ఎన్నికల సంఘం వాటిని తిరస్కరిస్తూ వస్తున్నది. తాజా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలను మొత్తంగా ఎత్తివేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. మళ్లీ బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలన్న సూచనలను కొట్టిపారేసింది. వీవీప్యాట్ల లెక్కింపు వ్యవహారంపై అంతిమ తీర్పు ఎలా ఉండబోతోందన్న ఊహాగానాలను అలా ఉంచితే ప్రజలకు ఈవీఎంలపై అనుమానాలు కలగడానికి బలమైన కారణం డాటా భద్రత. ఎలక్ట్రానిక్ డాటా సైబర్ ప్రపంచంలో నిక్షిప్తమై ఉంటుంది. అదొక మాయా ప్రపంచం.. అక్కడ ఏమైనా జరగొచ్చుననే భావన సర్వత్రా ఉన్నది. ఆన్లైన్ మోసాల యుగంలో ఇది సహజమే. ఈవీఎంలను గట్టిగా వ్యతిరేకించేవారు ఈ తరహా భయాలను తమ వాదనలకు దన్నుగా ఉపయోగించుకుంటున్నారు. 2017 యూపీ ఎన్నికల తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ ఓటమికి ఈవీఎంల గోల్మాలే కారణమని ఆరోపించి సంచలనం సృష్టించారు.
ఈవీఎంల ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు ఏకంగా ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే పుస్తకాన్నే రాశారు. మరోవైపు అభివృద్ధి చెందిన దేశాల ఉదాహరణ ఉండనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈవీఎంలపై దుమారం చేలరేగింది. అటు యూరప్‌లో నెదర్లాండ్స్ ఈవీఎంలను ఎంత ప్రేమగా అక్కున చేర్చుకున్నదో అంతే వేగంగా వాటిని వదిలించుకున్నది. జర్మనీ కూడా పేపర్ బ్యాలెట్‌ను తప్పనిసరి చేసింది. భారత్ వంటి పెద్ద దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది కొండలెత్తడం లాంటి కష్టసాధ్యమైన విషయమని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఎంతమాత్రం సత్యదూరం కాదు. అయినప్పటికీ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం వీవీప్యాట్ల లెక్కింపు పెంచితే తప్పేముందన్న వాదనను కొట్టిపారెయ్యలేం. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి గత డిసెంబర్ లో 100 శాతం వీవీప్యాట్ల లెక్కింపును డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఫలితాల ప్రకటనలో కొద్దిపాటి జాప్యంతో వచ్చే నష్టమేమీ ఉండదు. ఆ జాప్యం వల్ల అపనమ్మకం స్థానంలో విశ్వసనీయత ఏర్పడితే ప్రజాస్వామ్యంలో అంతకుమించి కావాల్సింది ఏముంది!