మంగళవారం 20 అక్టోబర్ 2020
Editorial - Sep 29, 2020 , 02:42:45

రాష్ట్రపతి పాలనపై మీమాంస

రాష్ట్రపతి పాలనపై మీమాంస

ఎనిమిదవ అధ్యాయం కొనసాగింపు..

సుప్రీంకోర్టు తమ తీర్పును ముగిస్తూ.. ‘ఒక రాజకీయపక్ష నాయకుడు, వాళ్ల రాష్ట్ర ముఖ్యమంత్రిని కోర్టు ధిక్కార నేరం క్రింద శిక్షించవలసిరావటం విచారకరమే. కానీ చట్టం యొక్క హుందాతనాన్ని నిలబెట్టేందుకు అలా చేయక తప్పదు. ఆయన్ని కోర్టుధిక్కార నేరం క్రింద శిక్షిస్తున్నాం. ఈ ధిక్కారం మన దేశ లౌకిక పునాదులకు మూలాల వంటి పెద్ద సమస్యను లేవనెత్తినందువల్ల ఆయనకు నామ మాత్రంగా మేము ఒకరోజు కారాగారవాస శిక్ష విధిస్తున్నాం. దానికి తోడుగా రూ.2000 జరిమానాను కూడా విధిస్తున్నాం’. (సుప్రీంకోర్టు తీర్పు పాఠం అనుబంధం XVIగా ఇవ్వబడింది.)

***

పైన పేర్కొన్న వరుసవారీ ఘటనలు, వివరణల వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ పొరపాటూ చేయలేదని స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేంద్ర బలగాలను సకాలంలో అర్థవంతంగా వాడుకుని వుంటే 1992 డిసెంబరు 6న బాబ్రీ కట్టడాన్ని రక్షించగలిగి వుండేది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఆ దురదృష్టకర దినాన దేశపు లౌకిక ప్రమాణాలకు భంగం వాటిల్లజేస్తూ జరిపిన విధ్వంసకాండకు పూర్తి బాధ్యత వహించవలసి వుంటుంది.

అయినా లక్షలాది మంది నుంచి అణుచుకోలేని వేధించే ప్రశ్న- భారత రాజ్యాంగంలోని 356 అధికరణం కింద తగిన సమయంలో కట్టడాన్ని రక్షించేందుకు భారత రాష్ట్రపతి, రాష్ట్రపతి పాలనను ఎందుకు విధించలేదు? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరణ యిచ్చుకోవాల్సి ఉంది. పలు పర్యాయాలు వివరణ యివ్వటం జరిగింది గాని ఇక్కడ ఈ ప్రశ్నకు సమగ్రమైన సమాధానంగా వాటన్నింటినీ క్రోడీకరించి చరిత్రకు సాక్షీభూతంగా నిలిపి భవిష్యత్తుపై వెలుగును ప్రసరించేట్లు చేయటం సమంజసం. తరువాత అధ్యాయంలో ఈ విషయం చర్చింపబడింది.

***

(9వ అధ్యాయం ప్రారంభం)

అధికరణం- 356ను ఎందుకు ప్రయోగించలేదు?

‘1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును విధ్వంసం నుంచి కాపాడేందుకు మీరు ఉత్తరప్రదేశ్‌లో అధ్యక్ష పాలనను ఎందుకు విధించలేదు?’ అనే ప్రశ్నను ఎందరు మిత్రులు, ప్రతికూలురు సంధించారన్నది నేను లెక్కించి చెప్పజాలను. అవును, ఈ ప్రశ్న పరిశీలింపదగినదేనని నేను అంగీకరిస్తాను. అయితే ఆ రోజుల్లో గనుక పరిశీలన జరిపినట్లయితే ముగింపు ఎలా ఉండేది; భారత అధ్యక్షుడు ఆ నిర్ణయానికి ఎలా వచ్చి ఉండేవాడు అనేది కూడా వివరించాల్సి ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాన్ని అమలు పరచాలని నిర్ణయించుకున్నప్పుడు ఏ రాజ్యాంగ నియమాల కింద దానిని అమలు జరపాలన్న విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ఒప్పించేందుకు అంత పెద్ద వెంటబడాల్సిన పనిలేదన్నది మొదటి సంగతి. సామాన్యుని భావన, కామన ఎంతటి బలవత్తరమైనదైనా, విస్తృతమైనదైనా అది నిక్కచ్చిగా రాజ్యాంగ నియమం కిందికి వచ్చి తీరాల్సిందే గదా. అదేవిధంగా ఈ విషయంలో కూడా అధికరణం 356ను జారీ చేసేందుకు చేసే ప్రతిపాదన కూడా ఆ విధంగానే ఉండాలి. రాజ్యాంగంలోని అధికరణం 356 ఈ కింది విధంగా ఉంటుంది. 

అధికరణం 356: రాష్ర్టాలలో పాలనా యంత్రాంగం రాజ్యాంగబద్ధంగా నిర్వహింపబడలేనప్పటి నియమాలు: 1) ఒక రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడినట్లుగా ఆ రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రపతికి రిపోర్టు పంపి ఉండవచ్చును. లేదా రాష్ట్రపతికి మరొక విధంగా ఆ సమాచారం అంది ఉండవచ్చును. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఈ కింది విధంగా వ్యవహరింపవచ్చును.

(ఎ) రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికారాలను గాని, లేక కొన్ని అధికారాలను గాని తనకే సంక్రమింపజేసుకొనవచ్చును. ఆ రాష్ట్ర గవర్నరు అధికారాలను పూర్తిగా గాని లేక పాక్షికంగా గాని తనకే సంక్రమింపజేసుకొనవచ్చును. (బి) ఆ రాష్ట్ర శాసనసభకు గల అధికారాలు పార్లమెంటుకు సంక్రమింపజేయవ చ్చును. (సి) ఈ క్లాజు కింద వెలువరించే ఉత్తర్వులు సమర్థవంతంగా అమలుచేసేందుకు అవసరమైన అనుబంధ ఉత్తర్వుల్ని జారీ చేసే క్రమంలో ఏవైనా సంస్థలు లేక అథారిటీలకు రాజ్యాంగ నిబంధనలు మొత్తంగా గానీ లేక పాక్షికంగా గాని లేకుండా నిలిపివేయవచ్చు.  అయితే హైకోర్టుకు గల ఎటువం టి అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించవు. హైకోర్టుకు రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలను పూర్తిగా గాని లేక పాక్షికంగా గాని నిలిపివేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉండదు. 

ఈ అధికారణానికి చెందిన మిగతా ఉప నిబంధనలన్నీ నిర్వహణకు సంబంధించిన వివరాలు గనుక వాటిని యిక్కడ సవివరంగా పేర్కొనాల్సిన పనిలేదు. అధికరణం 356 కింద రాష్ట్రపతి పాలన విధించేందుకు తగిన స్థితి వున్నదా లేదా అని సరిచూసే సమయంలో ఈ అధికరణంలో  వివరించబడిన అత్యవసర స్థితి ఏర్పడనే ఏర్పడిందనేది తెలియవస్తుంది. అధికరణం 356ను అమలు పరచదలిస్తే ఆ తేడా వల్ల స్పష్టమైన చిక్కేమంటే అధికరణంలో నిర్ణీతపరిచిన స్థితి కచ్చితంగా ఎప్పుడు ఏర్పడిందనేది కీలకం. ఆ స్థితిని ధృవీకరించిన తరువాతనే అధ్యక్ష పాలనను విధించ వీలవుతుంది. అంతకు ముందు మాత్రం కాదు. మరోరకంగానూ వీలుపడదు. ఈ విధమైన వ్యాఖ్యా నాన్ని సరైనదిగా ఆమోదించనట్లయితే తరువాత ఉద్భవించే సహజమైన ప్రశ్న అయోధ్య విషయంలో కచ్చితమైన ఏ స్థితి తరువాత అధికరణం 356 అమలు పరచవలసి ఉండగా అది పరచబడలేదనేది. జరిగిన క్రమాన్ని తేదీల వారీగా గమనించగల ఏ ఆలోచనాపరుడయినా తనకుతానే ప్రశ్నించుకొని అధ్యక్షపాలన రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగా వున్నదో లేదో తేల్చుకో గలడు. మళ్లీ ఇక్కడ మనం రాజ్యాంగంలోని 356ను అమలులోకి తెచ్చే ముందటి స్థితిని గమనించాల్సి ఉంది. అది ఇలా పేర్కొనబడింది. ‘రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా రాష్ర్టాలు తమ ప్రభుత్వాలను నిర్వహింపలేని స్థితిలో.’ మున్ముందు పేరాలలో వివరించిన ఘటనలను నిశితంగా పరిశీలించి ఏ ఘటన వద్ద ఆ స్థితి ఏర్పడిందనేది గుర్తించాల్సి ఉంది.      (మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo