సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Aug 26, 2020 , 23:36:08

పీవీ తెచ్చిన వెలుగులు

పీవీ తెచ్చిన వెలుగులు

సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. కాలుష్యం, భూతాపం, ఓజోన్‌ పొర దెబ్బతినడం, వాతావరణ మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి వల్ల వాతావరణంలో కాలుష్య కారకాలు పెరిగిపోయి మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లోనూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన వనరుల సద్వినియోగంపై ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరులైన పవన, టైడల్‌, జియో థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి విధానాలకు ఆదరణ పెరుగుతున్నది. వీటన్నింటిలో సోలార్‌ పవర్‌కు అధిక ప్రాధాన్యం ఉన్నది. కేంద్రం 2022 నాటికి 1.5 లక్షల మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని భావిస్తున్నది. ఈ చైతన్యానికి నాంది పలికిన ఘనత మాజీ ప్రధాని పీవీకే దక్కుతుంది. దూరదృష్టి కలిగిన పీవీ ప్రపంచదేశాలతో పోటీపడుతూ సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భారత్‌కు సమున్నత స్థానం కట్టబెట్టేందుకు పునాదులు వేశారు.

భారత్‌లో సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. గంట సమయంలో భూమిని తాకే సూర్యరశ్మిని సోలార్‌ విద్యుత్‌గా మార్చితే ప్రపంచం మొత్తానికి ఏడాదిపాటు విద్యుత్‌ అవసరాలు తీర్చవచ్చు. ఫొటో ఎలక్ట్రిక్‌ పద్ధతిలో సూర్యరశ్మిని ఎనర్జీగా మార్చవచ్చు. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, విద్యుత్‌ ఉత్పత్తి, సామర్థ్యం పెంపు మొత్తం చాలా సులభతరమైన ప్రక్రియగా చెప్పవచ్చు. ఖర్చు కూడా గణనీయంగా తక్కువ కావడంతో సోలార్‌ ఎనర్జీకి ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ విషయాన్ని పీవీ ప్రస్తావిస్తూ.. కొన్ని దేశాలకు చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి కోసం వేరే ఇంధనాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. 

రాబోయే వంద, రెండు వందల ఏండ్ల వరకు కూడా వాళ్లు నిరాటంకంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చు. మరికొన్ని దేశాలు న్యూక్లియర్‌ పవర్‌ కలిగి ఉన్నాయి. అలాంటి దేశాలు కూడా అత్యాధునిక సాంకేతికత ద్వారా సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ.. వివిధ దేశాల్లోని వనరులు, విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ స్థానం ఏమిటి..? అని అలోచించుకోవాలని పీవీ ప్రస్తావించేవారు. సంప్రదాయ వనరుల కోసం ఇతర దేశాలను యాచిస్తే సార్వభౌమాధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందనేవారు. సూర్యరశ్మి అనే తరగని వనరును ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళికలు రచించాలని దిశానిర్దేశం చేశారు. 

పీవీ రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో పెనుమార్పులు తీసుకురావడానికి 1992లోనే బాటలు వేశారు. ఇందు లో భాగంగా 1992 ఫిబ్రవరి 20న అన్ని రాష్ర్టాల సంబంధిత మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల్ని అందుబాటులోకి తీసుకురావడం ఎంత అవసరమో వివరించారు. దేశంలో 8వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టబోయే ముందు కీలక సమావేశం నిర్వహించారు. ఇంధన కొరతను అధిగమించేందుకు సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్ప త్తి తప్పనిసరి అని సూచించారు. 

ఇందిరాగాంధీ రెండోసారి ప్రధాని అయినప్పుడు 1980లో దేశంలో చమురు తవ్వకం, ఉత్పత్తి పెద్దఎత్తున ప్రారంభించారు. పదేండ్లలో దేశ అవసరంలో 60, 70 శాతం చమురు ఉత్పత్తి సాధించాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ 1992 నాటికి 35 శాతం వరకు మాత్రమే ఉత్పత్తి సాధ్యమైంది. కారణం.. ఉత్పత్తితో పోల్చితే వినియోగం వేగంగా పెరిగింది. సంప్రదాయేతర ఇంధన వనరులపై పరిశోధనలు విస్తృతంగా జరగాల్సిన అవసరాన్ని గుర్తించిన పీవీ.. నిపుణులతో లోతైన చర్చలు జరిపారు. ఢిల్లీకి దగ్గరలోని హర్యానా, ఘజియాబాద్‌లో ఏవైనా గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రయోగాలు చేపట్టాలని సూచించారు. ఒక గ్రామానికి సంబంధించిన విద్యుత్‌ అవసరాలను పూర్తిస్థాయిలో సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకునేలా ప్రణాళికలు రచించాలని చెప్పారు. ఏ హోదాలో ఉన్నా.. ఏ నిర్ణయం తీసుకున్నా పీవీ గ్రామీణ భారతం, రైతులను దృష్టిలో పెట్టుకునేవారు. సోలార్‌ పవర్‌ ద్వారా రైతుల కరెంటు కష్టాలు తీర్చవచ్చని ఆకాంక్షించారు.  

సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిపై పీవీ దృష్టి పెట్టడానికి మూలం ఆర్థిక సంస్కరణలే. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాల వల్ల పరిశ్రమల ఏర్పాటుకు చాలామంది ముందుకు వస్తారు. అలాంటివాళ్లు మీ వద్ద విద్యుత్‌ సదుపాయం ఎలా ఉంది? ఎంత రాయితీకి సరఫరా చేస్తారు? అని అడిగే ప్రశ్నకు సంతృప్తికర సమాధానం చెప్పకపోతే వాళ్లు వెనక్కి వెళ్తారని పీవీ చెప్పేవారు. పరిశ్రమలు పెరిగి, వాటికి ఇచ్చే విద్యుత్‌ పరిమాణం పెరిగితే రైతులకు విద్యుత్‌ కొరత ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి సంస్కరణలు రైతులపై ప్రతికూల ప్రభావం చూపవద్దంటే సంప్రదాయేతర ఇంధన వనరుల్ని పెంచుకోవడం అనివార్యమని అభిప్రాయం వ్యక్తంచేసేవారు. ఇంధన రంగం, సంప్రదాయేతర వనరుల సద్వినియోగంపై స్పష్టమైన అవగాహన, దూరదృష్టి, ప్రోత్సాహం వల్లే నేడు సంప్రదాయేతర ఇంధన వనరులు, ముఖ్యంగా సోలార్‌ విద్యుత్‌ రంగం అభివృద్ధి చెందుతున్నది అంటూ భవిష్యత్‌ భారతం గురించి కలలు గన్న పీవీ ఆశయాలు నేడు ఫలితాలు ఇస్తున్నాయి. ఆ మహనీయుడు పంచిన విద్యుత్‌ పాలసీ నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.

(వ్యాసకర్త: పీవీ నరసింహారావు తనయుడు)logo