శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jul 20, 2020 , 23:58:20

నాటి కాల్వలకూ ‘ఉపాధి’

నాటి కాల్వలకూ ‘ఉపాధి’

ఏనుగు పోయింది.. తోక చిక్కింది.. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంతో చేపట్టిన ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం 80-90 శాతం వరకు పూర్తయినా.. ఆ మేరకు వినియోగంలోకి రావడం లేదు. దీంతో కోట్ల రూపాయలతో నిర్మించిన డిస్ట్రిబ్యూటరీ కాల్వలు కొన్నేండ్లుగా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వందశాతం పనులు పూర్తయితేనే తాము స్వాధీనం చేసుకుంటామని ఇంజినీర్లు అంటుండగా, మిగిలిన 10-20 శాతం పనులు పూర్తికాలేని పరిస్థితులున్నాయని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. వాటినిప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఉపాధి హామీ కింద నిర్వహణకు మంచి అవకాశమున్నది. 

ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద తెలంగాణ ప్రాంతంలో 12 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టులు చేపట్టారు. ఆరేడేండ్లు పనులు నత్తనడకన సాగడంతో రాష్ట్రంలో అసంపూర్తి ప్రాజెక్టులే ఉమ్మడి వారసత్వంగా వచ్చాయి. జలయజ్ఞంలో భాగంగా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో పనులు అప్పగించిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలకమైన భూసేకరణ ప్రక్రియను గాలికి వదిలేసింది. ప్రణాళికాబద్ధంగా భూసేకరణ జరపకపోవడంతో ప్రాజెక్టుల పనులు సాగలేదు. దీంతో ఏండ్ల తరబడి కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైతుల్లో నమ్మకం సడలిపోవడంతోపాటు కోట్ల రూపాయలు పనులపై పెట్టిన కాంట్రాక్టర్లు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం జలయజ్ఞ ప్రాజెక్టుల పనులను గాడిలో పెట్టేందుకు మరో యజ్ఞమే చేయాల్సి వచ్చింది. 

మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి అప్పటికే వేలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసిన ప్రాజెక్టుల పనులను వినియోగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాంట్రాక్టర్ల పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం 2015 అక్టోబరులో జీవో 146 జారీచేసింది. దానిద్వారా 2013 ఏప్రిల్‌ నుంచి జీవో జారీచేసిన సమయం వరకు లేబర్‌, మెటీరియల్‌, బ్యాంకు గ్యారంటీ రేట్లలో పెంపునకు అంగీకరించింది. పనులు జరిగిన పరిమాణాన్ని బట్టి వందశాతంలో 40 శాతాన్ని బిల్లుల రూపంలో వెంటనే చెల్లించడం, మరో 40 శాతాన్ని ఏజెన్సీ బీజీ (బ్యాంకు గ్యారంటీ) ఉపసంహరణకు వెసులుబాటు కల్పించడం, మిగిలిన 20 శాతాన్ని తుది బిల్లు పూర్తవగానే విడుదల చేయడం అనే షరతుల్ని విధించింది. ఇందులో భాగంగా ఏజెన్సీలకు 180 రోజుల్లో పనులు చేయాల్సిన భూమిని (భూసేకరణ) అప్పగిస్తామనే అంశాన్ని కూడా చేర్చారు. ఇలా 146 జీవో విడుదల సమయానికి 13 భారీ ప్రాజెక్టుల్లో 95 ప్యాకేజీలు, 12 మధ్యతరహా ప్రాజెక్టుల్లో 16.. మొత్తం 111 ప్యాకేజీలకు జీవో ద్వారా వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం 146 జీవో ద్వారా కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ఊరట కల్పించడం ఎంత ప్రధానమో జీవో 123 ద్వారా భూసేకరణ ప్రక్రియను చేపట్టేందుకు నిర్ణయించడం అనేది అంతకంటే ముఖ్యం. ఎందుకంటే 2005 నుంచి సాగునీటి ప్రాజెక్టుల పనులు కేవలం భూసేకరణ అంశంతోనే నత్తనడకన సాగాయి. 

ప్రభుత్వం అటు రైతు నష్టపోకుండా, ఇటు కాలయాపనతో ప్రాజెక్టుల పనులు నిలిచి అంచనా వ్యయం పెరగకుండా ఉండే సదుద్దేశంతో తెచ్చిన ఈ జీవోతో పనులు శరవేగంగా జరిగాయి. కానీ ఉమ్మడి హైకోర్టు 123 జీవోను కొట్టేయడంతో జలయజ్ఞం ప్రాజెక్టుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కొన్ని ప్యాకేజీల్లో 90 శాతానికిపైగా పనులు పూర్తయి కొద్దిపాటి పనులు సాగక ఏండ్ల తరబడి కాంట్రాక్టర్లు పడిగాపులు కాస్తున్నారు. జీవో 146లోనే 180 రోజుల్లో భూమిని సేకరించి అందుబాటులోకి తెస్తామని స్పష్టంగా చెప్పారు. కానీ భూసేకరణకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలతో ప్రభుత్వం కూడా వెంటనే పూర్తిచేయలేని పరిస్థితి ఏర్పడింది. 

జలయజ్ఞం ప్రాజెక్టుల్లో నూటికి 99 శాతం భూసేకరణ జరగని కారణంగానే పనులు ముందుకు సాగడం లేదనేది అందరికీ తెలిసిన సత్యం. అందుకే ఇప్పటికీ ప్యాకేజీలు ఈవోటీలు (కాలపరిమితి పెంపు) ఇస్తున్నా ఫలితాలు రావడం లేదు. పైగా జీవోలో పేర్కొన్న మేరకు బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయకపోవడంతో వాటిపై కమీషన్ల రూపంలో ప్రభుత్వానికి ఏటా కోట్ల రూపాయల భారం పడుతున్నది. ప్రధానంగా ప్రధాన కాల్వ వంటి నిర్మాణాల్లో ఒక్కో గ్రామ పరిధిలో ఎక్కువ విస్తీర్ణంలో భూసేకరణ ఉంటుంది. అంటే ఒక గ్రామంలో సమస్య పరిష్కారమైతే పెద్ద ఎత్తున పని పూర్తిచేసేందుకు వెసులుబాటు లభిస్తుంది. కానీ డిస్ట్రిబ్యూటరీ కాల్వల పరిస్థితులు వేరు. ఆరేడు మండలాల పరిధిలో 2-3 వేల ఎకరాల భూసేకరణ కూడా ఉండదు. పైగా కుటుంబసభ్యుల మధ్య భూమి గొడవల వంటివి ఉంటే 99 శాతం భూసేకరణ పూర్తయినా మధ్యలో నాలుగైదు ఎకరాలు మిగిలిపోతే పనులు ముందుకు సాగనటువంటి క్లిష్ట పరిస్థితులు ఉంటాయి.  

సాధారణంగా ఒక కాల్వ నిర్మాణం పూర్తయి, నీటిపారుదలశాఖ స్వాధీనం చేసుకుంటే ఆపై రెండేండ్లపాటు కాంట్రాక్టరుదే నిర్వహణ బాధ్యత ఉంటుంది. 146 జీవోలో పనులు పూర్తయిన మేరకు నిర్మాణాల్ని నీటిపారుదలశాఖ స్వాధీనం చేసుకోవాలని ఉంది. నూటికి నూరు శాతం పనులు పూర్తయితేనే నిర్మాణాల్ని తమ పరిధిలోకి తీసుకోవాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. కానీ మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్లు నిస్సహాయంగా మిగిలిపోయారు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాల్వలు దాదాపు మూడునాలుగేండ్లుగా నిర్వహణ లేక నిరుపయోగంగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీల ద్వారా చివరి భూ ముల వరకు సాగునీరందితేనే ఆ ప్రాజెక్టుల లక్ష్యం నెరవేరుతుంది. డిస్ట్రిబ్యూటరీల కాల్వలను నేటికీ నీటిపారుదలశాఖ ఆధీనంలోకి తీసుకోకపోవడంతో అవి ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతున్నాయి.  చాలాచోట్ల కాల్వల నిర్మాణాలు దెబ్బతింటున్నా యి. దాదాపు పదేండ్ల కిందట నిర్మించిన లైనింగ్‌ కాల్వలు సైతం నిర్వహణ లేక ముండ్ల చెట్లు, పొదలు పెరిగి ఉనికినే కోల్పోతున్నాయి. నీటిపారుదలశాఖ పరిధిలోకి ఆ కాల్వలు రానందున సాగునీటి యాజమాన్యం అమలుకావడం లేదు. 

నరేగాకు నయారూపును ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ కింద కాల్వల నిర్వహణ చేపట్టడమనేది అభినందనీయం. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో 80-90 శాతం పూర్తయిన డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాన్ని నీటిపారుదలశాఖ స్వాధీనం చేసుకోవడం వల్ల ఉపాధి హామీ పనులతో నిర్వహణ పనులు చేపట్టే జాబితాలోకి వస్తాయి. తద్వారా ఏండ్ల తరబడి కూడుకుపోయిన, పిచ్చిమొక్కలు నిండిన కాల్వలు బాగుపడి చివరి భూములకూ సాగునీరు పుష్కలంగా అందుతుంది. బ్యాంకు గ్యారంటీలపై ప్రభుత్వానికి కమీషన్ల భారం కూడా పోతుంది. 

- జగన్‌మోహన్‌రావు


logo