ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సీజన్లో మనం రెండురకాల దృశ్యాలు చూస్తున్నాం. జాతీయ పార్టీలమని విర్రవీగే కాంగ్రెస్, బీజేపీల దండయాత్రలు వెలవెలపోవడం ఒకటైతే, రెండోది ముఖ్యమంత్రి కేసీఆర్ సభలకు పోటెత్తుతున్న జనసంద్రాలు. ఎన్ని కుట్రలు పన్ని, ఎన్నెన్ని బూటకాలు వల్లించినా ఢిల్లీ పెద్దల సభలకు జనం రావడం లేదు. వచ్చినా స్పందన కనిపించడం లేదు. 75 ఏండ్ల స్వతంత్ర భారత పాలనను ఆ రెండు పార్టీలే పంచుకున్నాయి. ప్రాంతీయ ఆకాంక్షలను అణగదొక్కి కేంద్రీకృత పాలన సాగించాయి. అయితే ఎంతగా కర్ర పెత్తనం సాగించినా ప్రాంతీయ ఆకాంక్షలు మలిగిపోలేదు. మరింత దేదీప్యమానంగా వెలిగి ఢిల్లీ పార్టీల పెత్తనాన్ని దహించివేశాయి, వేస్తున్నాయి. ద్రవిడపార్టీలు రంగం మీదికి వచ్చిన తర్వాత తమిళనాడులో జాతీయపార్టీలకు దిక్కు లేకుండా పోయింది. ఇప్పట్లో అక్కడ జాతీయ పార్టీలు కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. బెంగాల్లో తృణమూల్, ఒడిశాలో బీజేడీ, ఢిల్లీలో ఆప్ ఇలా ప్రాంతీయ ఆకాంక్షలు ఒక్కోచోట ఒక్కో రూపాన్ని సంతరించుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల యుగం నడుస్తున్నది.
ఢిల్లీ పార్టీలకు రాష్ర్టాల్లో ‘జీ హుజూర్ జో హుకుం’ అని సలాములు కొట్టే గులాములు ఉంటారు. ఒకప్పటి సామంతరాజులకు, వీరికి పెద్దగా తేడా ఉండదు. పాదుషాలకు కప్పం కట్టాలి, పదవులు కొట్టాలనేది వారి లక్ష్యంగా ఉంటుంది. ఎక్కడో దూరాన కూర్చున్న బడా బాబులకు ఇక్కడివారి గోసలు, అవసరాలు అర్థం కావు. ఇది అంతిమంగా ప్రాంతీయ అసమానతలు, వివక్షలకు దారితీస్తుందనేది ఇన్నేండ్ల చరిత్ర చెప్తున్న సత్యం. ఢిల్లీకి, గల్లీకి మధ్య జరిగే ఘర్షణలోంచి పుట్టుకువచ్చినవే ప్రాంతీయ పార్టీలు. నాడు కాంగ్రెస్ కాళ్లకింద తెలుగువారి ఆత్మగౌరవం నలిగిపోతున్నదనే ఆగ్రహంతో ఎన్టీఆర్ ప్రకటించిన యుద్ధం ఢిల్లీ పెత్తనానికి అడ్డుకట్ట వేసింది. ఇక తెలంగాణ అస్తిత్వం కోసం రాజీలేని పోరాటం సాగించి స్వరాష్ట్రం సాధించిన నేతగా కేసీఆర్ ప్రజల ఆశీస్సులతో పగ్గాలు చేపట్టడం అపురూపం, అద్వితీయం. రెండు విడుతలు గెలిచి ఇప్పుడు మూడో విడుతకు లంఘిస్తుండటం అపూర్వం. రాష్ట్ర ప్రజల ఆశయాలు, ఆకాంక్షలపై సీఎం కేసీఆర్కు సమగ్రమైన అవగాహన ఉండటమే ఇందుకు కారణం.
సీఎం కేసీఆర్ ఒక సందర్భంలో ప్రశ్నించినట్టు మన పిల్లలకు ఎలాంటి చదువు చెప్పాలో ఢిల్లీలో కూర్చొని ఆలోచించేవాడికి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఆహార విహారాల, ఆచార సంప్రదాయాల గురించిన అవగాహన వారికి ఎందుకుంటుంది? హైదరాబాద్ సంస్థానంలోకి కేంద్ర బలగాల ప్రవేశంపై ఏడాదికోసారి బీజేపీ హంగామా చేస్తుంటుంది. ఇక్కడి ప్రజల ఆలోచనలకు భిన్నంగా మాట్లాడి మనసు నొప్పిస్తుంది. కేంద్ర పార్టీలకు జెండాలు, ఎజెండాలు వేరుగా ఉండొచ్చు. కానీ, వాటిలో ఉన్న ఉమ్మడి అంశం ప్రాంతీయ ఆకాంక్షలను అణచివేయడం. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం. ఈ దాష్టీకం ఇంకానా, ఇకపై సాగదని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీసి కలబడితే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో ప్రజాభీష్ట సిద్ధికి ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్ష.