
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 18: నూతన జోనల్ వ్యవస్థ ద్వారా విద్యాశాఖలోని ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో ఉపాధ్యాయుల్లో, విద్యాశాఖ కార్యాలయంలో సందడి కనిపిస్తోంది. ఆప్షన్లు ఇవ్వడం, వాటిని సంబంధిత అధికారుల ద్వారా సేకరించడం వంటి ప్రక్రియ వారం చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో జాబితాను విద్యాశాఖ వెలువరించేందుకు పగలు, రాత్రి సిబ్బంది పనిచేస్తున్నారు.
ఎస్ఏలు పూర్తి.. నేడు ఎస్జీటీలది..
స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి అన్ని సబ్జెక్టుల్లో సీనియారిటీ వారీగా ఆయా ఉపాధ్యాయులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా జాబితాలు పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ఉపాధ్యాయులు 9,032 మంది ఉన్నారు. వీరిలో 4,150 మంది వరకు ఎస్జీటీలు. మిగిలిన సగం ఎస్ఏలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఎల్పీలు, ఇతర టీచర్లు. ఎక్కువమంది కలిగిన ఎస్జీటీల ప్రక్రియలో తప్పులు దొర్లకుండా జాబితాను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నాటికి ఎస్జీటీల జాబితా విడుదల కానుంది.
5 శాతం మందికి స్థాన చలనం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో అత్యధికంగా ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే తమ మొదటి ప్రాధాన్యాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎస్జీటీలు ఖమ్మంలో 2,100 మంది, భద్రాద్రిలో 1,850 మంది ఉన్నారు. భద్రాద్రి జిల్లా ఎస్జీటీల్లో 150 మంది మినహ అత్యధికమంది అక్కడే మొదటి ఆప్షన్ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఏ క్యాడర్లో సబ్జెక్టుల వారీగా.. అత్యధికమంది తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోనే ఆప్షన్లు ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. 5 శాతం మందికి మాత్రం స్థానం చలనం ఉండే అవకాశముంది. నూతన జోనల్ వ్యవస్థ.. దూరప్రాంతాల్లో పనిచేస్తున్న వారితోపాటు ఉద్యోగులందరికీ అనుకూలంగా ఉందని ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు పేర్కొన్నారు.
డీఈవో ఆఫీసును సందర్శించిన కలెక్టర్..
గురువారం రాత్రి రెండుస్లార్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం డీఈవో కార్యాలయలో విభజన ప్రక్రియను పరీశీలించి సూచనలు చేశారు. శుక్రవారం కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి కూడా వచ్చి ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. శనివారం ఉదయం నుంచి పలు దఫాలుగా పూర్తి చేసిన జాబితాను ఉన్నతాధికారులకు నివేదిస్తూ వారు సూచించిన సవరణలు చేస్తున్నారు. డీఈవో కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాలు తమ వినతులు అందించేందుకు శనివారం సాయంత్రం భారీ సంఖ్యలో వచ్చాయి. ఉన్నతాధికారులకు జాబితా ఇచ్చేందుకు సమయం మించి పోతుండడంతో డీఈవో.. టీచర్లకంట పడకుండా బైక్‌పై హెల్మెట్ ధరించి వెళ్లడం కోసమెరుపు. తర్వాత కారులో డ్రైవర్, సీసీ వెళుతుండగా డీఈవో అనుకొని కారు వద్దకు ఉపాధ్యాయులు వెళ్లగా అందులో డీఈవో లేరు.
ఇద్దరు మినహా అందరూ..
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పూర్వపు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులుందరినీ నూతన జోనల్ విధానంలో లోకల్ క్యాడర్‌గా నియమిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు మినహ అందరూ తమ ఆప్షన్లు అందజేశారు. జిల్లాలో రఘునాథపాలెం మండలం ఎంపీపీఎస్ కోయచెలక ఎస్జీటీ శ్రీనివాసరావు, తిరుమలాయపాలెం మండలం ఎంపీయూపీఎస్ ఎస్జీటీ ప్రసన్న మాత్రం అనధికారికంగా విధులు గైర్హాజరవడంతో వారు ఆప్షన్లు ఇవ్వలేదు. తమ ఆప్షన్లు ఇచ్చేందుకు మండల అధికారుల ద్వారా సమాచారం అందజేశారు.