సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 23 : సంగారెడ్డి జిల్లాలోని భారీ, మధ్య, చిన్న నీటి వనరుల కింద యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి నీటి పారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జిల్లాలో యాసంగిలో భారీ, మధ్య, చిన్న నీటి ట్యాంకుల పరిధిలో ఆయకట్టుకు నీటి విడుదలపై పలు సూచనలు, సలహాలు చేశా రు. సింగూరు ప్రాజెక్టు కింద 40వేల ఎకరాలు, నల్లవాగు ప్రాజెక్టు కింద 5,100 ఎకరాలు, 15 చెరువుల కింద 5,100 ఎకరాల ఆయకట్టుకు ఆన్ ఆఫ్ సిస్టం ద్వారా షెడ్యూల్ మేరకు నీటిని విడుదక చేయాలని అడ్వైజరీ బోర్డు నిర్ణయించింది.
27 నుంచి తై బందీ సమావేశాలు
స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారుల భాగస్వామ్యంతో ఈ నెల 27 నుంచి 30 వరకు తైబందీ సమావేశాలు నిర్వహించాలని సూ చించారు. యాసంగిలో ఇతర పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చెరువులు, కాల్వల కింద ప్రతిపాదించిన ఆయకట్టులో వేసుకోవాల్సిన ఆరుతడి పంటల గురించి రైతులకు వివరించాలన్నారు. ఆరుతడి పంటల సాగుకు షెడ్యూల్ మేరకు ఆన్ ఆఫ్ సిస్టంలో నీటిని వదలాలని స్పష్టం చేశారు. నీటిని రెగ్యులేట్ చేయాలని, సింగూరు, నల్లవాగు ఇతర ట్యాంకుల మరమ్మతులు, మేజర్ వర్క్స్ ఏవైనా ఉంటే ఆన్ ఆఫ్ సీజన్లోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన కూరగాయలు, పప్పు ధాన్యా లు పండించేలా రైతులను ప్రోత్సహించాలని ఆయ న సూచించారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ మురళీధర్, ఈఈలు మధుసూదన్‌రెడ్డి, జై భీమ్, విజయ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి నర్సింహారావు, నారాయణఖేడ్ ఆర్డీవో అంబాదాస్, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.