యాదాద్రి రామలింగేశ్వర ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండోరోజు గురువారం యాగశాల ప్రవేశం చేసి మహారుద్ర యాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం చతుస్థానార్చన, ద్వార తోరణం, ధ్వజ కుంభారాధనను ప్రధానార్చకులు, పురోహితులు, రుత్వికులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శాంతి హోమం, దీక్షాహోమం, అగ్న్యత్తారణం, కౌతుక బంధనం, జలాధివాస పూజా పర్వాలను వైభవంగా జరిపించారు.
యాదాద్రి, ఏప్రిల్ 21 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో పంచాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. యాగశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశాల ప్రవేశం, మండ స్తంభద్వారతోరణ పూజ, చతుస్థానార్చనలు, హోమకుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ మహారుద్ర అరశ్చరణ, మూలమంత్రానుష్టాన హవనం నిర్వహించారు.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శాంతి, దీక్షాహోమం, అగ్న్యత్తారణం, కౌతుక బంధనం, జలాధివాసం కార్యక్రమాలు స్మార్తగామశాస్త్రం ప్రకారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్ థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధానార్చకుడు నర్సింహరాములు శర్మ, ప్రధాన పురోహితులు గౌరిపట్ల సత్యనారాయణశర్మ, వేదపారాయణికులు, యజ్ఞాచార్యులు, రుత్వికులు, పరిచారక బృందం, పురోహితులు, అర్చకులు పాల్గొన్నారు.
రామలింగేశ్వర స్వామి ఉపాలయంలో నిత్యారాధనల అనంతరం రెండో రోజు పంచాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేకం మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభయ్యాయి. కుంభాభిషేక యాగశాలలో నలుదిక్కుల్లో నవగ్రహాధి దేవతారాధన పూర్వకమైన ప్రక్రియను స్మార్తగామశాస్త్ర ప్రకారం నిర్వహించారు. నాలుగు స్థానాల్లో పరమేశ్వర ఆరాధన చేశారు. పరమేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా లోకానికి అందేవిధంగా చతుస్థానార్చనలు, ఆరాధనలు, ధూప, దీప, నైవేద్యాదులు గావించారు. నాలుగు దిక్కుల్లో దేవతలకు ఆరాధన పూర్వకంగా తోరణపూజ గావించారు. ధూప, దీప, నైవేద్యాదులు, నారీకేళ ఫలములు నివేదించారు. తోరణ పూజ, చతుస్థానార్చనల అనంతరం యాగశాలలో మండ స్తంభ ప్రధాన వేదికపై కుంభస్థాపన చేపట్టి ఆరాధనలు నిర్వహించారు.
అగ్ని భగవానుడిని ఆరాధనతో ప్రార్థించి ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం వేళల్లో నిర్వహించబడే అగ్నికార్యాన్ని సుసంపన్నం చేయాలని అగ్ని భగవానుడిని ఆరాధించారు. హోమకుండ సంస్కారం గావించి అగ్ని భగవానుడిని ఆహ్వానించారు.
శివాలయంలోని యాగశాలలో చతుస్థానార్చన నిర్వహించి, ద్వారా తోరణం, ద్వభకుంభారాధనలు చేపట్టారు. యాగశాలలో స్వయంభు అగ్ని మథన కార్యక్రమం నిర్వహించారు. జమ్మి, రాగి సాధనములను మదించి, స్వయంభువు మంత్రాలతో, క్రియసాధనతో అఖండమైన తేజస్సుతో వచ్చిన స్వయంభూ అగ్నితో పంచకుండాత్మక మహారుద్ర యాగాన్ని ప్రధానార్చకులు, పురోహితులు, రుత్వికులు ప్రారంభించారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్థాపితదేవతాయజన, మూలమంత్రానుష్టాన హవనం, వేదికాత్రయ ప్రోక్షణం, బలిహరణం. సాయంత్రం 5 నుంచి 8.30 గంటల వరకు ప్రతిమానయనం, నేత్రోన్మీలనం, స్నపనం, అర్చన, మూర్తిపతిలోకపాల స్థాప్యదేవతాహవనం, వేదహవనం, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ.
బాల శివాలయంలో నిత్యారాధనల అనంతరం పంచాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా యాగశాలలో సాయం త్రం 5 గంటలకు శాంతి, దీక్షాహోమం,అగ్న్యత్తారణం, కేతుకబధనం, జలాధివాస వేడుకలను యజ్ఞ బ్రహ్మ, ఆలయ సిద్ధాంతి, ఆలయ ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ సంబంధమైన వేడుకల్లో ప్రధానమైన వేడుక కౌతుక బంధనం(రక్షా బంధనం). ఈ వేడుకతో సమస్త జగత్తునకే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వుల ఉత్సవమూర్తులను కౌతుక బంధనం గావించారు. దీక్షాపరులైన బ్రాహ్మణోత్తములకు దీక్షాపరులై కౌతుకధారణ చేశారు. ఈ వేడుకతో జగద్రక్షణతోపాటు సర్వ దోషాలు తొలిగిపోతాయని శివాలయ ప్రధాన పురోహితులు తెలిపారు.
బింబమూర్తులకు పవిత్ర జలాలతో జలాధివాసం నిర్వహించారు. రామలింగేశ్వరాలయంలోని ఉపాలయాల్లో ప్రతిష్ఠించే సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ, సూర్యభగవానుడు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నాగదేవత, శివపార్వతుల విగ్రహం, ద్వారపాలకులైన జయవిజయులు, నంది విగ్రహం, బలిపీఠం, స్పటికలింగంతోపాటు నవగ్రహ విగ్రహ బింబాలను నవగ్రహ మండపం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన తొట్టిలో శుద్ధజలాలు పోసి వేంచేపు చేశారు. మరుసటి రోజు ఉదయం వరకు శుద్ధి జలాల్లోనే బింబమూర్తులను ఉంచుతారు.