
రామన్నపేట, ఆగస్ట్ 9: ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంకోసం ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం మండలపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన మిషన్ భగీరథ పనులు, నీటి సరఫరాపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి గ్రామానికి జనాభా ప్రాతిపదికన నీటిని అందిస్తున్నామని వివరించారు. గ్రామం యూనిట్ సైప్లె సమయంలో అన్ని ట్యాంకులకు నీరు ఎక్కేవిధంగా చూడాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పైప్లైన్ల కోసం తవ్విన సీసీ రోడ్లను పునర్నిర్మాణం చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు అందించి పనులు చేయించాలని తెలిపారు. మిషన్ భగీరథ నీటిని ఇతర అవసరాలకు వాడకుండా సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో జిల్లా స్థాయిలో మిషన్ భగీరథ నీటిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. నెల రోజుల్లో మండలవ్యాప్తంగా ఇంటిఇంటికీ భగీరథ నీటి సరఫరాను మెరుగు పరచాలని, అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్, మిషన్‌భగీరథ ఎస్ఈ వై కృష్ణయ్య, డీఈ దీన్‌దయాళ్, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, ఎంపీడీవో జలేందర్‌రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, ఏఈ లు ప్రశాంత్‌రెడ్డి, రమేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రామన్నపేట, ఆగస్ట్ 9: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా కలెక్టర్ సోమవారం మండలంలోని జనంపల్లి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేమవరపు మనోహర్పంతులుకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంసాపత్రాన్నిఅందజేశారు. బ్రిటీష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి కలిగించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, డీటీ ఇబ్రహీం, సర్పంచ్ రేఖయాదయ్య, ఎంపీటీసీ వేమవరపు సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.