e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News అవినీతి అంతం.. కావాలి పంతం

అవినీతి అంతం.. కావాలి పంతం

  • పెరుగుతున్న అవినీతి కేసులు
  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 5 కేసులు
  • నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం

ఆలేరు టౌన్‌, డిసెంబర్‌ 8 : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను పెంచుతున్నది. కొందరి నెలవారీ జీతం చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఉన్నత ఉద్యోగం.. సమాజంలో గౌరవం 30 రోజులు గడిస్తే జీతం అందుతున్నా .. అది సరిపోదన్నట్లు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు అలవాటు పడి వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు పట్టుబడ్డారు. యాదాద్రి జిల్లాలో 1, నల్లగొండ జిల్లాలో 2, సూర్యాపేట జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాల నిర్మూలనకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు డబ్బు ఇవ్వాలన్న భావన ఏండ్ల నుంచి నాటుకుపోయింది. రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్‌, రవాణా శాఖల్లో ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిశాఖల్లో లంచాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కొందరు అధికారులు అక్రమార్జనకు పాటుపడుతున్నారు. విధుల్లో అంకితభావం, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పాన్ని మరిచి లంచాల కోసం తెగబడుతున్నారు. లంచం తీసుకుంటూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్నారు. ప్రజల సహకారం ఉండడంతో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను పట్టుకుంటున్నారు. పోలీసు శాఖలో కొందరు అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు సాహసించడం లేదు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే కేసులు పెడతారేమోనని భయపడుతున్నారు. కొన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. అవినీతికి పాల్పడినా ఉద్యోగం ఉంటుందనే ధీమాతో వీరి వైఖరి మారడం లేదు. పట్టుబడినా కొన్ని కేసులు పలు కారణాలతో వీగిపోతుంటాయి. దీంతో అవినీతిపరుల్లో ధీమా పెరిగిపోతున్నది. అవినీతి రుజువైతే మాత్రం ఉద్యోగం వదులుకోవడంతోపాటు చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సాధారణంగా అధికారులతో పని చేయించుకోవడం ప్రజలు తమ హక్కుగా భావించాలి. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరుగాలి. త్వరగా పనికావాలన్న ఉద్దేశంతో లంచం ఇవ్వడం సరైన పద్ధతి కాదు. అన్ని సక్రమంగా ఉన్నా కొందరు అధికారుల చేయి తడుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే సామాన్యులు ప్రశ్నించాలి. అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏసీబీకి ఫిర్యాదు చేయాలి.

లంచం అడిగితే ఫిర్యాదు చేయాలి

- Advertisement -

ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఫిర్యాదు చేయాలి. ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ అధికారులకు తెలియజేయాలని సూచించేలా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై అంటిస్తున్నాం. ఫిర్యాదు చేసేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి. లంచం అడిగితే 7382625525 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

  • వెంకట్‌రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌

ఈ ఏడాది నమోదైన కేసులు..

18.2.2021న అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రావు రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సాయినాథ్‌ అనే వ్యక్తి తండ్రి చనిపోతే ఓ స్కీం విషయంలో అతనికి లబ్ధి చేకూర్చేందుకు లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటూ దొరికిపోయాడు.
23 జూలై 2021న నల్లగొండ జిల్లాలో శ్రీనివాస్‌ అనే ఏఓ రూ. 12వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి అనే రైతుకు రైతుబీమా పథకం విషయంలో లంచం డిమాండ్‌ చేసి డబ్బు తీసుకుంటూ పట్టుబడ్డాడు. 29.7.2021న యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసర్‌ దేవానంద్‌, డాక్యుమెంట్‌ రైటర్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సత్యం అనే వ్యక్తిని రూ. 20వేలు డిమాండ్‌ చేశారు. రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్‌ కాపీలను ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్‌ చేశారు. 10.8.2021న నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మూడావత్‌ రెడ్యా అనే వ్యక్తి వద్ద రూ. 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ప్లాటు విషయంలో ఆర్‌ఐ లంచాన్ని డిమాండ్‌ చేశాడు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement