పరిగి, డిసెంబర్ 26: పరిసరాల్లో మొక్కలుంటే ప్రశాంతతతోపాటు అనారోగ్య సమస్యలు ధరి చేరవన్నదే తెలంగాణ సర్కారు ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే హరితహారం కార్యక్రమం కింద విరివిగా మొక్కలను నాటడంతో పాటు పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు, మండలానికో బృహత్ ప్రకృతి వనాలనూ నిర్మించింది. పట్టణ ప్రజల కోసం మున్సిపాలిటీల పరిధిలో అర్బన్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి మున్సిపాలిటీల పరిధిలో అర్బన్ పార్క్‌ల నిర్మాణానికి సుమారు రూ.2 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. మూడు పార్కుల్లో కలిపి లక్షన్నర మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలో కలెక్టర్ అధ్యక్షతన అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఉపాధి హామీ కింద గుంతలు తీయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లు, బ్యాక్ రెస్ట్ బెంచీల నిర్మాణంతో పాటు చిన్నారుల కోసం ఆట వస్తువులనూ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అర్బన్ పార్కుల స్థలాల చుట్టూ ఫెన్సింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉదయం, సాయంత్రం పట్టణాల ప్రజలు వాకింగ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్కులకు సంబంధించిన పనులలో ప్రభుత్వం వేగం పెంచింది. వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్, తాండూరు, పరిగి మూడు మున్సిపాలిటీల ప్రజల కోసం మూడు అర్బన్ పార్కుల ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. సుమారు రూ.2 కోట్లు వెచ్చించి అర్బన్‌పార్కుల ఏర్పాటు పనులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు అంచనాలు తయా రు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అర్బన్‌పార్కుల స్థలాల చుట్టూ ఫెన్సింగ్ సైతం చేపడుతున్నారు. మిగతా పనులు మరింత వేగంగా చేపట్టేందుకు ముందుగా పచ్చదనం పెంపుపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఆ తర్వాత మిగతా పనులన్నీ చేపట్టనున్నా రు. జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించి ఏర్పాటుచేస్తున్న మూడు అర్బన్ పార్కుల్లో లక్షన్నర మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. పరిగి మున్సిపాలిటీకి సంబంధించి జాఫర్‌పల్లి సమీపంలో 50 ఎకరాల అటవీ స్థలంలో రూ.55లక్షలు వెచ్చించి అర్బన్‌పార్కు ఏర్పాటుకు నిర్ణయించారు. తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి గొట్లపల్లి అంతారం సమీపంలో సుమారు 350 ఎకరాల అటవీ ప్రాంతంలో రూ. కోటి 5లక్షలతో అర్బన్‌పార్కు ఏర్పాటు చేస్తున్నారు.
వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ధారూర్ మండలం నాగసముందర్ సమీపంలోని 150 ఎకరాల అటవీ ప్రాం తంలో రూ.45లక్షలతో అర్బన్‌పార్కు ఏర్పాటు చేస్తున్నారు.అర్బన్‌పార్కుల కోసం ఎంపిక చేసిన స్థలాల్లో చెట్లు ఉన్నప్పటికీ మరింత పచ్చదనం పెంపు లక్ష్యంగా మొక్కలు పెంపకానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా జాఫర్‌పల్లి సమీపంలోని అర్బన్‌పార్కు స్థలంలో 30వేల మొక్కలు, గొట్లపల్లి అంతారం అర్బన్‌పార్కు స్థలంలో సుమారు 75వేల మొక్క లు, నాగసముందర్ అర్బన్‌పార్కు స్థలంలో సుమారు 50వేల మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఉపాధిహామీ పథకం కింద కూలీలతో గుంతలు తవ్వించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి మొదటి వారం నుంచి ఆయా అర్బన్‌పార్కుల స్థలాల్లో గుంతలు తీసే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను జిల్లా స్థాయిలోను కలెక్టర్ అధ్యక్షతన త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటుచేసి ఉపాధిహామీ, అటవీ శాఖల అధికారులందరూ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అర్బన్‌పార్కు స్థలాల్లో గుంతల తవ్వకానికి సంబంధించి ఉపాధిహామీ సిబ్బందికి పూర్తిస్థాయిలో ఆదేశాలు అందజేయనున్నారు. ముందుగానే గుంతలు తవ్వించి పెట్టడం ద్వారా సకాలంలో మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టనున్నారు. దీంతో అర్బన్ పార్కుల స్థలాల్లో మరింత పచ్చదనం పెరుగుతుంది.
వాకింగ్ ట్రాక్‌లు…పిల్లలకు ఆట వస్తువులు
అర్బన్ పార్కుల ప్రధాన ఉద్దేశం చక్కటి వాతావరణంలో పట్టణ ప్రజలు వాకింగ్ చేయడం. అందుకు అనుగుణంగా మూడు అర్బన్ పార్కులలో వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. చాలా అధిక విస్తీర్ణంలో ఈ పార్కులు ఏర్పాటు చేస్తుండడంతో అలసట వచ్చినపుడు కూర్చొవడానికి బ్యాక్ రెస్ట్ బెంచీలు సైతం ఏర్పాటు చేస్తారు. అలాగే చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేకంగా చిన్న షెడ్డుల నిర్మాణం చేపడతారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఆట వస్తువులు సైతం ఏర్పాటు చేయనున్నారు. భద్రతా పరంగా సైతం చర్యలు చేపట్టి, భద్రతా సిబ్బందికి ప్రత్యేకంగా గది నిర్మాణం చేపడతారు. చక్కటి వాతావరణంలో గంటల తరబడి ఉండడం వల్ల స్వచ్చమైన ఆక్సిజన్ అందనుంది. పట్టణాల ప్రజల కోసమే ప్రత్యేకంగా ఈ అర్బన్‌పార్కుల ఏర్పాటు లక్ష్యం చాలా బాగుందని పలువురు పేర్కొంటున్నారు.
జాఫర్పల్లిలో 30 వేల మొక్కలు
పరిగి పట్టణ సమీపంలోని జాఫర్‌పల్లి అటవీ స్థలం 50 ఎకరాలలో అర్బన్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చా రు. ఈ పార్కులో ప్రస్తుతం ఉన్న మొక్కలతో పాటు అద నంగా పచ్చదనం పెంపు కోసం మరో 30వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కల పెంప కానికి గుంతలు తవ్వించాలని ఉన్నతాధికారులు సూచించారు. జనవరి నెల మొదటి వారం నుంచే అర్బన్‌పార్కులో గుంతల తవ్వకం పనులు ప్రారంభిస్తాం.