e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home జిల్లాలు సవాళ్లు అధిగమిస్తూ.. వ్యాపారంలో రాణిస్తూ..

సవాళ్లు అధిగమిస్తూ.. వ్యాపారంలో రాణిస్తూ..

అతివలకు అండగా కోవే సంస్థ
వ్యాపారంలో మెళకువలపై తర్ఫీదు
రుణ సదుపాయం, మార్కెటింగ్‌పై అవగాహన
సంస్థ అండతో రాణిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలు
సొంతంగా వ్యాపారం..వందలాదిమందికి ఉపాధి
ఘనంగా కోవే అవతరణ వేడుకలు

సిటీబ్యూరో, నవంబర్‌ 27 (నమస్తే తెలంగాణ) ;వాళ్లంతా మహిళా వ్యాపారాధిపతులు. అనేక సవాళ్లనుఅధిగమించి బిజినెస్‌లో రాణిస్తున్నారు. సొంతంగా ఎదగాలనే ఆలోచనతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన వాళ్లు నిరంతర శ్రమతో వేలాది మందికి ఉపాధిని కల్పించే అత్యున్నత స్థితికి చేరుకున్నారు. పనిని ప్రేమిస్తే ఫలితం వరిస్తుందనే సూత్రంతో ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ అనేక విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే.. మరోవైపు బిజినెస్‌ సామ్రాజ్యంలో తమ నైపుణ్యాలతో శభాష్‌ అనిపించుకుంటున్నారు. భర్త, అత్తమామల ప్రోత్సాహం తమలో నూతనోత్తేజాన్ని నింపుతుందని చెబుతున్నారు. పిల్లలు తమ అమ్మ బిజినెస్‌ మ్యాన్‌ అని చెప్పుకుంటూ గర్వపడటం తమకు ఎంతో ఆనందనిస్తుందని తెలిపారు. వాళ్లంతా కోవే సభ్యులు. బేగంపేటలో శనివారం జరిగిన కోవే 17వ అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. 40 మంది మహిళా వ్యాపారావేత్తలు పాల్గొని తమ వ్యాపార సవాళ్లను పంచుకున్నారు. నూతనంగా వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకునేవారికి అనేక సూచనలు చేశారు.

కోవేలోచేరాలనుకుంటే..
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా (కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌) కోవే పనిచేస్తుంది. బేగంపేటలోని రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ పక్కన గరడ టవర్స్‌లో కార్యాలయం ఉంది. 17 ఏండ్లుగా మహిళా పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి కృషి చేస్తుంది. ఇందులో సభ్యత్వం పొందాలంటే పారిశ్రామిక వేత్త లేదా ఏదైన చిన్న తరహా వ్యాపారం ప్రారంభించాలనే ఆశ ఉండాలి. లైఫ్‌టైమ్‌ మెంబర్‌షిప్‌, ఆన్వెల్‌ మెంబర్‌షిప్‌ ఉంటుంది. దేశ వ్యాప్తంగా వీరికి శాఖలు ఉన్నాయి. ఎవరు ఏ ప్రొడక్ట్‌ తయారు చేసినా దానిని దేశం మొత్తం అడ్వైర్టెజ్‌ చేస్తుంది. నెట్‌వర్క్‌తో వ్యాపారం విస్తరించుకోవచ్చు. బ్రాండింగ్‌ చేసుకోగలుగుతారు. ఈడీపీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు జరుగుతుంటాయి. ఈ వర్క్‌షాప్‌నకు హాజరై వ్యాపార మెళకువలు నేర్చుకోవచ్చు. వ్యాపారానికి కావాల్సిన రుణాలు ఎలా సమకూర్చుకోవాలి? ఏ బ్యాంకులు లోన్‌ ఇస్తాయి? స్టార్టప్‌లు ప్రారంభించాలంటే ఏం చేయాలి? మార్కెటింగ్‌ చేయడంపై కోవే సపోర్ట్‌ చేస్తుంది. నేషనల్‌ గ్రూపులు ఉంటాయి. తెలంగాణ చాప్టర్‌లో 150 మంది సభ్యులు ఉన్నారు. కోవేలో ఒక విభాగం నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వారి కోసం శిక్షణ ఇచ్చి వ్యాపారాలు ప్రారంభించేలా చేస్తుంది.

- Advertisement -

కస్టమర్‌ సంతృప్తి కీలకం
మొదటగా బిజినెస్‌ ఆలోచన చేయాలంటే కొంత భయం ఉండేది. పెట్టుబడి అవసరం. నష్టాలు వస్తే ఎలా? అని ఆలోచించేదాన్ని. కానీ నాపై నాకున్న నమ్మకం ఆ భయాన్ని తొలిగించింది. నన్ను నేను నమ్ముకున్నా. అనేక అంతరాయాలు ఎదుర్కొని నిలబడ్డాం. వ్యాపారం ప్రారంభించగానే ఒకేరోజు గొప్పవాళ్లం అయిపోము. నేను సక్సెస్‌ అవడానికి పదేండ్లు పట్టింది. కోవే సంస్థ మహిళలను ఐక్యం చేసి వ్యాపారంలో రాణించడంపై దన్నుగా నిలుస్తుంది.

  • చేతన జైన్‌, చీఫ్‌ ఆర్కిటెక్ట్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌

మహిళలకు స్వేచ్ఛ ఉంది
అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలి. సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై స్పందించేందుకు ముందుకు రావడం కూడా చాలా ముఖ్యం. కేవలం వ్యాపార లావాదేవీలే కాకుండా సామాజిక బాధ్యతతో కూడా నడుచుకోవాలి. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అందరూ సహకరించాలి. ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో స్వేచ్ఛ ఉంది. ఇంటికే పరిమితం కాకుండా ఆసక్తి ఉన్న వ్యాపారాన్ని ప్రారంభించి సామాజిక చైతన్యంలో భాగం కావాలి. అందుకోసం కోవే కృషి చేస్తుంది.

  • జ్యోత్స్న చెరువు, ప్రెసిడెంట్‌, కోవే

మహిళల్లోని శక్తిని గుర్తించాలి
మొదటగా హోమ్‌ మేడ్‌ చాక్లెట్స్‌ తయారు చేస్తూ చాకిటోస్‌ కంపెనీ ప్రారంభించా. అనంతరం బిజినెస్‌పై అవగాహన వచ్చాక ఏఆర్‌ సిమెంట్‌ కంపెనీ ప్రారంభించాను. సుమారు 60 మందికి ఉపాధి కల్పించాం. మనం చేసే ఏ బిజినెస్‌ అయిన దానిపై ప్యాషన్‌ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్‌ కీలకం. నా భర్త ప్రోత్సాహం మరవలేనిది. పిల్లలు ఎదిగాక నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. మాది ట్రైబల్‌ ఫ్యామిలీ. టైల్స్‌, బ్రిక్స్‌ తదితర అన్నీ నిర్మాణ రంగ పరికరాలను తయారు చేస్తాం. మహిళల్లో ఉన్న శక్తిని గుర్తించాల్సిన బాధ్యత కుటుంబంపైనే ఎక్కువగా ఉంటుంది.

  • వనిత, కో ఫౌండర్‌, ఏఆర్‌ సిమెంట్‌ కంపెనీ

లాభం కాదు నాణ్యత అవసరం
చాలా మంది వ్యాపారం అనగానే లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ వ్యాపారం అంటే కేవలం లాభమేకాదు నాణ్యమైన సేవలు అందించడం కూడా. మన నాణ్యతనే మన వ్యాపారాన్ని నిర్ణయిస్తుంది. కస్టమర్లు సంతృప్తిగా మన ప్రాడక్ట్స్‌తో ఉన్నప్పుడే విజయం పొందుతాం. మా కంపెనీలో సుమారు 20 మంది ఉపాధి పొందుతున్నారు. శ్రీలంక, జైపూర్‌ నుంచి జ్యువెల్లరీ దిగుమతి, ఎగుమతులు జరుగుతాయి. కోవేలో నేను ఈసీ మెంబర్‌గా ఉన్నాను. కోవేలో జాయిన్‌ అయ్యాక నాకు వ్యాపార విస్తరణపై అవగాహన వచ్చింది.
-నిషా అగర్వాల్‌, డైరెక్టర్‌, పల్స్‌ అండ్‌ జువెల్లరీ

సర్వీస్‌లో నాణ్యత ఉండాలి
వ్యాపారం ప్రారంభించాలంటే మొదటగా దానిపై నాలెడ్జ్‌ ఉండాలి. రీసెర్చ్‌ చేయాలి. ఇంతకుముందున్న ఆ వ్యాపార దుకాణాలను సందర్శించి వివరాలు సేకరించాలి. అయితే మనం ఏ వ్యాపారం చేయాలనుకున్నా.. ఇప్పటికే దానికి సంబంధించి చాలా మంది ఆ వ్యాపారాన్ని నడుపుతుంటారు. కానీ ఎవరి కస్టమర్‌ వారికి ఉంటారు. మనం సర్వీస్‌లో నాణ్యత మెయింటైన్‌ చేస్తే కచ్చితంగా కస్టమర్‌ మన వద్దకు వస్తారు.

  • విజయ భారతి, ఫౌండర్‌, పినాకే డిజిటల్‌ సొల్యూషన్స్‌

ధైర్యం చేయండి
ప్రస్తుత పరిస్థితులకు తగ్గ వ్యాపారాలు ప్రారంభిస్తే బాగుంటుంది. మేం మాస్క్‌ల తయారీని పెంచాం. చాలా మందికి ఉపాధినిస్తున్నాం. మహిళలు ధైర్యంగా వ్యాపారాల్లోకి రావాలి. బిజినెస్‌ అనగానే భయపడుతుంటారు. కానీ అది సరైనది కాదు. మహిళలు పని చేసిన వ్యాపారాలే సక్సెస్‌ అవుతున్నాయి. అలాంటప్పుడు మహిళలు ఓనర్లుగా ఎందుకు ఉండకూడదు? కోవేతో మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతున్నాం.
-రమాదేవి, ఫౌండర్‌, టీఆర్‌జీ ఎంట్రపెన్యూర్‌.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement