
సమైక్య రాష్ట్రంలో సాగు నీటి కోసం నల్లగొండ జిల్లా రైతాంగం చెయ్యని పోరాటం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడి రైతుల తలరాత మాత్రం మారలేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు సైతం ఎన్నడూ సరిగ్గా నీళ్లందింది లేదు. నాన్ ఆయకట్టులో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఉద్యమ నేతగా నాడు సాగు నీటి కష్టాలపై గొంతెత్తిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక ఆ అన్యాయలను సరిచేస్తూ వచ్చారు. సాగర్ ఆయకట్టు చివరి ఎకరా వరకూ నీళ్లిస్తున్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను పరవళ్లు తొక్కిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా మూసీ కింద రైతులు రెండు పంటలు వేస్తున్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రుణమాఫీ, నాణ్యమైన విత్తనాలతో వ్యవసాయం మంచి ఊపు మీదున్నది. ముఖ్యంగా వరి సాగు 4 లక్షల నుంచి 12 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో దిగుబడి వస్తుంది.
ఉమ్మడి జిల్లా పసిడి మాగాణమైన తరుణంలో అన్నదాతకు అండగా ఉండి బాధ్యతగా పంటను కొనాల్సిన కేంద్రం కాడెత్తేస్తున్నది. తెలంగాణ రైతాంగంపై కత్తిగట్టిన మోడీ సర్కారు కపట నాటకాలతో కుట్రలు చేస్తున్నది. మొదట మీ దగ్గర ఇంత పంట ఎక్కడిదని అవమానించింది. వాస్తవాలు తేలడంతో ఇప్పుడు ధాన్యం కొనలేమంటూ ఎవుసాన్ని ఆంక్షల చట్రంలోకి నెడుతున్నది. ఓ పక్క పంజాబ్ ధాన్యాన్ని కొంటూనే మనపై మాత్రం కక్ష సాధిస్తుండడం రైతాంగం జీర్ణించుకోలేకపోతున్నది. సీఎంఆర్‌పై తప్పుడు లెక్కలు చెప్తూ, రాష్ట్ర రైతాంగం తరఫున వెళ్లిన మంత్రుల బృందాన్ని పలుచని చేసి నోరు పారేసుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై నిప్పులు చెరుగుతున్నది. మోదీ సర్కారు కపట నీతిపై మండిపడుతున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను చులకన చేసి మాట్లాడుతుండడం సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్23(నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ.. స్వరాష్ట్రంలో గాడిన పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రతి బంధకాలుగా మారాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు పునరుద్ధరణతో సాగునీటి వసతి మెరుగుపడి పంటల సాగు గణనీయంగా పెరిగింది. గతంలో ఎన్నడూ నాలుగు లక్షల ఎకరాలకు మించని వరి సాగు ఉమ్మడి జిల్లాలో నేడు 11.90లక్షల ఎకరాలకు పెరిగింది ఈ వానకాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోనే 27లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా. ఇదిలా ఉంటే ఇన్నాళ్లూ ధాన్యాన్ని సేకరించిన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఇప్పుడు తెలంగాణలోని వడ్లను కొనలేమంటూ, కొనుగోళ్లపై తీవ్ర ఆంక్షలతో రైతాంగాన్ని గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నది. ఓ వైపు పంజాబ్ రాష్ట్రంలోని వడ్లను కేంద్రమే కొనుగోలు చేస్తూ రాష్ర్టానికి చెందిన ధాన్యాన్ని మాత్రం కొనబోమంటూ చులకభావం ప్రదర్శిస్తుండడాన్ని రైతాంగం తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇన్నాళ్లూ సాగు నీరు లేక కరువుకాటకాలతో ఇబ్బందులు పడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం.. నేడు నిండా నీళ్లున్నా వరి వేసుకోలేని దుస్థితిలోకి కేంద్రం నెట్టేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం తరఫున సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రులతో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. అయితే, ‘రాష్ట్రంలో పని లేదా..’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దాంతో పాటు వడ్ల లెక్కలు, సీఎంఆర్ సేకరణపై కేంద్ర మంత్రి వాస్తవాలను విస్మరించి మాట్లాడడాన్ని కూడా రైతులు తప్పుపడుతున్నారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర బీజేపీ నేతల మాటలని గమనిస్తే రైతులను చులకన చేస్తున్నట్లుగానే స్పష్టం అవుతుంది.
రైతు పథకాలతో ప్రోత్సాహం…
వ్యవసాయాన్ని పండుగలా మార్చుతూ సీఎం కేసీఆర్ అనేక పథకాలను తీసుకువచ్చారు. కీలకమైన రైతుబంధు ద్వారా ఉమ్మడి జిల్లాలోని 22.58 లక్షల ఎకరాల భూమికి ఏటా సగటున రూ.1,100 నుంచి 1,150 కోట్లు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు సీజన్లలో సుమారు రూ.8వేల కోట్లను తొమ్మిది లక్షల మంది రైతులకు అందించి అండగా నిలిచింది. దాంతో పడావు భూములన్నీ సాగులోకి వచ్చి సాగు పెరిగేందుకు దోహదపడింది. మరోవైపు రైతుల పండించిన ధాన్యం, పత్తి పంటలను కొనుగోలు చేస్తూ మరింత వెన్నుతట్టింది. కందులు, వేరు శనగ, పెసర ఉత్పత్తులను సైతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి. ఇక సీజన్‌కు ముందే విత్తనాలను సమకూరుస్తున్న సర్కారు.. ఎరువుల కొరత కూడా లేకుండా చూడడంతో రైతులు వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. రైతుబీమా, రుణమాఫీ పథకాలు అదనంగా తోడయ్యాయి.
కేంద్రం తీరుపై మండిపాటు..
సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను సరిచేస్తూ స్వరాష్ట్రంలో రైతు సగర్వంగా నిలబడే ప్రయత్నాలు జరుగుతుండగా.. కేంద్ర ప్రభుత్వ విధానాలు చులకన భావానికి గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై మొండికేస్తుండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్రంగా మండిపడుతున్నది. ఇప్పటికే ఓ మారు నల్లగొండ రైతాంగం తన ప్రతాపాన్ని బీజేపీ నేతలకు చూపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులు తిరుగబడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల మాట తీరు చూస్తుంటే రాష్ట్ర రైతులను చులకన చేస్తున్నట్లుగాస్పష్టం అవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.. తెలంగాణ రైతులంటే ఎందుకింత చులకన అని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.
వాస్తవాలు ఇలా ఉంటే…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఏడేండ్లలో 8.50 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. రాష్ట్రం రాకముందు 2014 సంవత్సరంలో మొత్తం 13.16లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 4.50లక్షల ఎకరాల్లో వరి, మిగతా 8.61లక్షల ఎకరాల్లో పత్తి, కంది, పెసర, ఇతర పంటలు సాగయ్యేవి. అప్పటి నుంచి ఏటా లక్ష చొప్పున నేటికి 21.58 లక్షల ఎకరాలకు సాగు విస్తరించింది. అందులో ఈ వానకాలంలో పరిశీలిస్తే కేవలం వరి సాగే 11.90 లక్షల ఎకరాలకు పెరుగడం గమనార్హం. మిగతా పంటలన్నీ కలిపి 10 లక్షల లోపే సాగైనట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి కేటాయింపులు నిక్కచ్చిగా వాడుకోవడం వల్లనే ఏటా లక్ష ఎకరాలకు పైగా బీడు భూములు సాగులోకి వచ్చాయి. రెండు పంటలకు సమృద్ధిగా నీరందుతున్నది. సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో ప్రతి ఎకరమూ సాగులోకి వచ్చింది. వీటికి తోడు రూ.722 కోట్లతో ఉమ్మడి జిల్లాలో 4,160 చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించడంతో 1.18లక్షల ఎకరాలకు అదనంగా నీటి వసతి తోడైంది. ఏటా కురుస్తున్న వర్షాలతో పాటు ఆయా ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీరు చెరువుల్లోకి చేరడం వల్ల సాగు నీరు పుష్కలంగా అందుతున్నది. దాంతో రైతులంతా వరిసాగుకు మొగ్గు చూపడంతో సుమారు మూడు రెట్లు పెరిగింది.
రైతుల ఉసురు తగులుతుంది..
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నది. రైతులు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కరంటు, నీళ్లు అందుబాటులో తెచ్చి రైతు బంధు సాయం చేస్తుంటే మోదీ ప్రభుత్వం గోస పెడుతున్నది. మా దగ్గర పండిన పంటనే పనికిరాకుండా పోతుందా..? ఆరుగాలం కష్టపడే రైతుకు సాయం చేసేందుకు ఏదో దారి చూడాలి. అంతేగాని పంటలకు వంకలు పెట్టుడేంది.. తెలంగాణ రైతు బాగు పడుతుండనే అక్కసు సెంట్రల్ గవర్నమెంటోళ్ల దగ్గర కనిపిస్తున్నది.
ముఖ్యమంత్రిని బద్నాం చేసేందుకు కుట్ర
రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. రైతు లేనిదే రాజ్యం లేదనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. ప్రాజెక్టులు నిర్మించి, పంట పెట్టుబడికి రైతు బంధు సాయం, 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నది. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలువడాన్ని ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నది. బీజేపీ పప్పులు తెలంగాణలో ఉడకవు, యాసంగి ధాన్యం కొనుగోలు చేసేదాకా పోరాటం కొనసాగుతుంది.
వడ్లు కొనకపోతే బతికేదెట్లా..?
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనకపోతే రైతులు బతికేదెట్లా.. మా భూముల్లో వడ్లు మాత్రమే పండుతయి. వేరే పంటలకు అనుకూలంగా ఉండవు. అట్లాంటప్పుడు ఇతర పంటలు ఎట్లా సాగు చేస్తాం. బీజేపీ ప్రభుత్వం రైతులను కష్ట పెట్టడం సరికాదు. తెలంగాణ రాష్ట్ర రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష వీడాలి. ముఖ్యమంతి కేసీఆర్ రైతుల కోసం కొట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటామని ప్రకటించాలి.
కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతులంటే చులకనగా ఉంది. వరి ధాన్యాన్ని కొనకపోతే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. మాది కాల్వ కింద భూమి. మా భూములు వరి సాగుకే అనుకూలం. వరి తప్ప వేరే పంటలు వేయడం సాధ్యం కాదు.. అయినా, ఇన్నేండ్లు వడ్లు కొన్ని ఇప్పుడు కొనమంటే ఎట్లా.? దొడ్డు వడ్లు పెట్టొద్దు అని చెప్తుంటే మా భూములు పడావు బెట్టాలా..? కేంద్రం రైతులను మోసం చేస్తున్నది. వడ్లు కొనకపోతే తగిన బుద్ది చెప్తాం.
తెలంగాణ రైతులపై ఇంత వివక్ష ఎందుకు..?
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపడం తగదు. పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం కొని ఇక్కడ మాత్రం కొర్రీలు పెట్టడం ఎందుకు..? ఇలా చేయడం న్యాయం కాదు. మేము ఎప్పుడైనా దొడ్డు బియ్యం ఎక్కువగా పండిస్తాం. రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో కొట్లాడుతున్నా కేంద్రం కనీసం పట్టించుకోక పోవడం తగదు. వడ్లు కొనమని చెప్పడం వ్యవసాయానికి పాతరేయడం తప్ప మరొకటి కాదు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు.
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ..
నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. పంజాబ్ రాష్ట్రంలో పూర్తిగా వరి ధాన్యాన్ని కొంటున్న కేంద్రం తెలంగాణ రైతుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తున్నది. యాసంగి కొనం, వానకాలం చూస్తాం.. అంటూ మెలికలు పెడుతూ రైతును ఇక్కట్ల పాల్జేస్తున్నది. యాసంగిలో పండే ప్రతి గింజనూ కేంద్రం కొని తీరాల్సిందే. తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రానికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.
మోసగిస్తున్న మోదీ సర్కారు..ధాన్యం కొనుగోలు విషయంలో
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం నిలువునా మోసం చేస్తున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులను అవమానించడం దారుణం. కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. తక్షణమే మంత్రులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం రైతుల గోస పట్టించుకోవడం లేదు. ఆరు నూరైనా యాసంగిలో ధాన్యాన్ని కొనాల్సిందే. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తెలంగాణ రైతులకు సాయం చేయాల్సింది పోయి ధాన్యం కొనేది లేదంటే ఊరుకునేది లేదు. కొనేదాకా కొట్లాడుతాం. నీటి వసతి ఉన్నందున వరి పంటనే ఎక్కువగా పండిస్తాం. కానీ, కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే రైతులు ఆగమైతరు. దళారులదే రాజ్యం అయితది.
దోబూచులాడుతున్న మోదీ ప్రభుత్వం
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, యాసంగి విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతున్నది. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అన్న ప్రభుత్వాలను చూసినం కానీ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రైతులను అవమాన పరుస్తున్నది. రైతు ఉద్యమాలను పట్టించుకోదు. రైతుల సూచనలు కూడా స్వీకరించదు. ఇట్లాంటి ప్రభుత్వం దండుగ.
కేంద్ర ప్రభుత్వం రైతుల్ని గోస పెడుతున్నది
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం గోస పెడుతున్నది.రైతులను పలుచన చేసి చూస్తున్నది. కొనుగోళ్ల విషయం తేల్చేందుకు ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులను హేళన చేసి మాట్లాడడం కేంద్ర మంత్రి దురహంకారమే. ఇట్లనే చేసుకుంటపోతే బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది. రైతులతో పెట్టుకున్నోళ్లు ఎవ్వరూ బాగుపడ్డది లేదు. రైతు మంచిగుంటేనే దేశం మంచిగుంటది. పంజాబ్ ధాన్యం కొనేటోళ్లు మేం పండించిన ధాన్యమెందుకు కొనరో చెప్పాలె.