ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. దీనికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా ఆర్టీసీ ఆస్పత్రిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో నూతనంగా రూపొందించిన ఐసీయూ, మూడు ఎమర్జెన్సీ గదులను సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఆర్టీసీకి చెడురోజులు పోయి, మంచికాలం వచ్చిందన్నారు. తన సొంత బావ ఆర్టీసీ డ్రైవరేనని, కార్మికుల సమస్యలన్నీ తనకు తెలుసని అన్నారు. ఈ సమస్యలపై గతంలో రోజూ చర్చించుకునేవారమని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆర్టీసీ ఆస్పత్రి నుంచి వేరే కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫరల్‌కు పంపిస్తున్నామని, దీని కోసం ఏటా రూ.40 కోట్లు వివిధ ఆస్పత్రులకు చెల్లిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆస్పత్రిలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఆ సొమ్ము సంస్థకే మిగులుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. త్వరలోనే ఆధునిక వైద్య సదుపాయాలుతో ఆస్పత్రిని ఆధునికంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ వచ్చే మార్చి నెల నాటికి తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపొందిస్తా మన్నారు. ఇందుకోసం దాతల సహకారం సైతం తీసుకుంటున్నామని చెప్పారు. ఆస్పత్రిలో అవసరమైన క్యాథ్‌ల్యాబ్‌ను సైతం త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.ఆస్పత్రిలో 24*7 ఫార్మసీని గతంలోనే ప్రారంభించామని గుర్తు చేశారు.
ఈ ఆస్పత్రికి రోజూ 1200 మంది వస్తుంటారని, చాలామందిని వేరే ఆస్పత్రిలకు రిఫరల్‌కు పంపిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు సంస్థకు అధికంగా ఖర్చు అవుతోందని చెప్పారు. ఆస్పత్రిలోనే ఆ సౌకర్యాలన్నీ కల్పిస్తే ఖర్చును తగ్గించవచ్చన్నారు. ఆ దిశగానే వివిధ మార్గాల ద్వారా రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
తమకు సహకరించేందుకు నలుగురు దాతలు ముందుకువచ్చారని, వారి సహకారంతోనే ఆస్పత్రిలో ప్రస్తుతం ప్రారంభించిన సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని పిలుపునిచ్చారు.
ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే దేశం కరోనా నుంచి బయటపడిందన్నారు. వేరే దేశాలలో మూడో దశ కరోనా ప్రారంభమైందన్నారు. కానీ, మన దేశంలో మాత్రం అదుపులో ఉందని చెప్పారు. కరోనా దెబ్బకు చాలా మంది ఆర్టీసీకి దూరమయ్యారని, సొంత వాహనాలలో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారని వివరించారు.
దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, ఖర్చు సైతం పెరిగిపోయిందన్నారు. ప్రజలంతా ఆర్టీసీలో ప్రయాణించి, ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని సూచించారు. ఆర్టీసీ ఆస్పత్రిలో ఇప్పటికే కొవిడ్ పరీక్షా కేంద్రంతో పాటు వ్యాక్సినేషన్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సౌకర్యాలను ఆర్టీసీ కార్మికులు ఉపయోగించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.