నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 18 : దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం(ఐఏఎంసీ) ప్రారంభమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఫోనిక్స్ వీకే టవర్‌లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఐఏఎంసీని శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ కలిసి ప్రారంభించారు. అంతర్జాతీయ, జాతీయ వాణిజ్య, వ్యాపారాల్లో తలెత్తిన, తలెత్తబోనున్నవని అనుకున్న వివాదాలను పరిష్కరించడానికి హైదరాబాద్ ఒక వేదిక కాబోతున్న చారిత్రాత్మక సందర్భంగా మధ్యవర్తిత్వ కేంద్రంపై ప్రత్యేక కథనం.
మధ్యవర్తిత్వం అనగా..
నిష్పక్షపాత, తటస్థ మధ్యవర్తి ద్వారా తగాదాపడే వ్యక్తులు పరస్పరం సహకరించుకొని న్యాయ వివాదాలను పరిష్కరించుకునే పద్ధతి. మధ్యవర్తి తన నిర్ణయాన్ని కక్షిదారులపై పడకుండా, వారే ఒక నిర్ణయానికి వచ్చేలా వారి మధ్య మంచి వాతావరణం సృష్టిస్తాడు.
మధ్యవర్తిత్వానికి కేసులు ఎలా నివేదించబడతాయి..?
సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 89 ప్రకారం సివిల్ దావాల్లో పరిష్కార అంశముంటే సంబంధిత కోర్టు న్యాయమూర్తి ఆ విషయాన్ని ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి నివేదించవచ్చు. కక్షిదారులు, వారి న్యాయవాదులు మధ్యవర్తిత్వం కోరవచ్చు. వీరి దావాలను మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపిస్తారు.
మధ్యవర్తిత్వ ప్రయోజనాలు..
సామరస్యపూర్వక పరిష్కారం
కక్షిదారులే నియంత్రణకర్తలు
కక్షిదారులు కోర్టులో చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వడం జరుగుతుంది.
పైకోర్టుల్లో అప్పీలుకు, సమీక్షకు ఆస్కారం లేదు.
చట్టం..
మధ్యవర్తిత్వం, సర్దుబాటు చట్టాన్ని 1996లో రూపొందించారు. 2015, 2018లో పలు సవరణలు చేశారు. కక్షిదారుల హితం కోసం మధ్యవర్తిత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి సవరణలు ఉపయోగపడ్డాయి. కక్షిదారుల అభిమతం, రాజీ మేరకు న్యాయస్థానాలు ఆ తీర్పులను వెలువరిస్తాయి.
ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక..
న్యాయ వివాదాలు ధీర్ఘకాలం కొనసాగరాదని, వివాదాలను సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలనే దృఢమైన ‘ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని నెలకొల్పారు. 12 మంది సీనియర్ న్యాయవాదులకు ఈ విషయంలో న్యాయ సేవాసంస్థ పలుమార్లు శిక్షణనిప్పించింది. సివిల్ దావాలే కాకుండా గృహ హింస కేసులు, వివాహితపై భర్త, అత్తింటి వేధింపులు, మనోవర్తి కేసులను కూడా మధ్యవర్తిత్వ కేంద్రంలో రాజీపడి పరిష్కరించుకునే అవకాశం ఉన్నది.
మన జిల్లాలోనూ ఓ మధ్యవర్తిత్వ కేంద్రం..
నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఓ మధ్యవర్తిత్వ కేంద్రం ఉన్నది. జిల్లాలోని న్యాయస్థానాల్లో నమోదైన సివిల్ దావాలు, కుటుంబ వివాదా లు, దాంపత్య జీవనంలో నెలకొన్న న్యాయ వివాదాలను కక్షిదారులు పరిష్కరించుకునేందుకు జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యాలయంలోని న్యాయ సేవాసదన్‌లో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జి.చంద్రయ్య ప్రారంభించారు. న్యాయసేవా సంస్థ ప్యానల్ న్యాయవాది సమక్షంలో కక్షిదారులే తమ న్యాయ సంబంధిత దావాలను దాదాపు 111వరకు పరిష్కరించుకున్నారు.
క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి..
వివాదాలను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరింపజేయడంలో మధ్యవర్తిత్వ కేంద్రాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. న్యాయస్థానాల్లో నమోదైనవి, నమోదు చేయదలచుకున్న వారు నేరుగా న్యాయసేవా అధికార సంస్థను సంప్రదించాలి.
అత్యుత్తమ పరిష్కార వేదిక..
కక్షిదారులు తమ వివాదాలను పరిష్కరించుకోవడంలో మధ్యవర్తి వారికి సహాయకారిగా ఉంటారు. వారు పరిష్కరించుకున్నా, పరిష్కరించుకోలేకున్నా సంబంధిత కోర్టుకు ఒక మెమోరాండం సమర్పిస్తారు. మధ్యవర్తిత్వ కేంద్రం ప్రత్యామ్నాయ అత్యుత్తమ పరిష్కార వేదిక.