జూబ్లీహిల్స్: ఓటరు జాబితాలో సవరణలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు న్నారు. నూతన సంవత్సరంలో కొత్త ఓటరు జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు తప్పుల సవరణలతో పాటు నూతన ఓటర్ల నమోదు పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
2021 జనవరి నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంతో పాటు నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు యూసుఫ్‌గూడ సర్కిల్లో 329 పోలింగ్ కేంద్రాల పరిధిలో 130 ఓటరు నమోదు, సవరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నవంబర్ నెలాఖరు వరకు చేపట్టనున్న ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో నాలుగు రోజులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం యూసుఫ్‌గూడ సర్కిల్లో ఓటరు నమోదు, సవరణ కేంద్రాలను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేష్ ప్రారంభించారు.
కొత్త ఓటర్ల నమోదుతో పాటు చిరునామాల మార్పు, తప్పుల సవరణ చేపట్టేందుకు జీహెచ్ఎంసీ 19 వ సర్కిల్లో ఆదివారం ఈ ప్రత్యేక కేంద్రాలు సేవలందించనున్నాయి. దీనితో పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నవంబర్ 27,28 తేదీలలో కూడా ఈ ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేయనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : ఎ.రమేష్, డీఎంసీ, 19 వ సర్కిల్, యూసుఫ్‌గూడ
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాము. ఈ కేంద్రాలలో 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. సర్కిల్ పరిధిలో అడ్రస్‌లు మారిన వారు ఆయా కేంద్రాలలో తమ చిరునామాలు మార్పు చేసుకోవాలి.
ఓటరు నమోదు ప్రత్యేక కేంద్రాలు ఆదివారం అన్ని పోలింగ్ బూత్‌లలో అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల సరవణలతో పాటు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.