పాడి సంపద వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే వివిధ కారణాలతో చనిపోయిన సబ్సిడీ పాడి పశువుల స్థానంలో కొత్తవి అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. వికారాబాద్ జిల్లాలో మొత్తం 202 పాడి పశువులు మృతిచెందాయి. ఇందులో 22 మంది లబ్ధిదారుల దరఖాస్తులను బీమా సంస్థ వివిధ కారణాలతో తిరస్కరించగా,159 మందికి పాడి పశువుల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. పశువుల కొనుగోలుకు రూ.1.11కోట్లు వెచ్చించనున్నారు.
పరిగి, డిసెంబర్ 6 : సబ్సిడీపై పంపిణీ చేసిన పాడి పశువుల్లో వివిధ కారణాలతో మృతిచెందిన వాటి స్థానంలో మళ్లీ పాడి పశువుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 202 పాడి పశువులు మృతిచెందగా.. వాటి స్థానంలో 159 పాడి పశువులను ఇప్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 22 దరఖాస్తులను బీమా సంస్థ వారు తిరస్కరించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 2018లో 1847 పాడి పశువులను ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందజేసింది. ఒక్కో యూనిట్ ధర రూ.80వేలు ఉండగా, రవాణా, దాణా, ఇతర ఖర్చులు పోను, ఒక్కో పాడి పశువును రూ.70వేలకు కొన్నారు. బీసీ, ఒసీలు రూ.40వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.20వేలు చెల్లించగా.. సబ్సిడీపై పాడి పశువులను ప్రభుత్వం అందజేసింది. కొనుగోలు చేసే రోజు నుంచే వర్తించేలా బీమా చేయించింది. వివిధ కారణాలతో చనిపోయే పాడి పశువులకు ఈ బీమా వర్తిస్తుంది.
159 పశువులకు బీమా వర్తింపు
2018లో సబ్సిడీపై విజయ డెయిరీ, నార్మాక్స్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన 1847 పాడి పశువుల్లో ఇప్పటివరకు 202 పాడి పశువులు వివిధ కారణాలతో మృతిచెందాయి. ప్రధానంగా విద్యుత్ షాక్, అకస్మాత్తుగా, విషపూరిత గ్రాసం తినడం వంటి పలు కారణాలతో పాడి పశువులు మృతిచెందితే బీమా కింద ఒక్కో పాడి పశువుకు రూ.70వేలు అందిస్తారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 159 పాడి పశువులకు బీమా డబ్బులు రూ.1,11,30,000లను కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. 22 దరఖాస్తులను బీమా సంస్థ వారు తిరస్కరించారు. బీమా డబ్బులు మంజూరైన లబ్ధిదారులకు మళ్లీ పాడి పశువులు ఇప్పించేందుకు ఈ నిధుల విడుదలకు కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. జిల్లాలోని పరిగి మండలంలో అత్యధికంగా 80, బషీరాబాద్‌లో ఒకటి, ధారూరులో 3, దోమలో 31, కులకచర్లలో 28, పూడూరులో ఒకటి, తాండూరులో 3, వికారాబాద్‌లో 6, యాలాల మండలంలో 6 పశువులకు బీమా డబ్బులు విడుదలయ్యాయి. బీమా డబ్బులు మంజూరైన లబ్ధిదారులకు త్వరలో పాడి పశువులు ఇప్పించేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
మూడు చోట్ల నుంచి పాడి పశువుల కొనుగోలు
మృతిచెందిన వాటి స్థానంలో రైతులకు పాడి పశువులు ఇప్పించేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు మూడు చోట్లను ఎంపిక చేశారు. ఆవులు, గేదెలను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు, చిత్తూరు జిల్లా పుంగనూరు, మహారాష్ట్రలోని ఉద్గిర్ నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మృతిచెందిన పశువుల స్థానంలో మళ్లీ లబ్ధిదారులకు పాడి పశువులు ఇప్పించే కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా నాలుగో స్థానంలో ఉండగా మూడు జిల్లాలకు సంబంధించిన పాడి పశువుల పంపిణీ పూర్తయిన వెంటనే వికారాబాద్ జిల్లా రైతాంగానికి పాడి పశువులు అందిస్తారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, అధికారులు, లబ్ధిదారులు కలిసి వెళ్లి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పాడి పశువులను కొనుగోలు చేస్తారు. ఒక్కో పాడి పశువుకు రూ.70వేలు వెచ్చిస్తారు. పాడి పశువుల కొనుగోలుకు కలెక్టర్ ఆమోద ముద్ర వేయడంతో పశు సంవర్ధక శాఖ అధికారులు తమ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. వచ్చే వారం రోజుల్లో వికారాబాద్ జిల్లాకు సంబంధించి 159 పాడి పశువుల కొనుగోలుకు ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎలా తీసుకురావాలి తదితర మిగతా ఏర్పాట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చేపట్టారు. ఒకేసారి కాకుండా నాలుగు పర్యాయాలు ఆ ప్రాంతాలకు వెళ్లి విడుతల వారీగా మేలైన పాడి పశువులను ఎంపిక చేసి కొనుగోలు చేయనున్నారు.
159 పాడి పశువులకు బీమా వర్తింపు : డాక్టర్ అనిల్, వికారాబాద్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి
వికారాబాద్ జిల్లా పరిధిలో 202 పాడి పశువులు మృతిచెందగా.. 159 పాడి పశువులకు బీమా వర్తించి, డబ్బులు వచ్చాయి. లబ్ధిదారులకు కొత్తగా పాడి పశువుల కొనుగోలుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఆవులు, గేదెల కొనుగోలుకు మూడు చోట్లు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా పాడి పశువుల కొనుగోలు చేపడుతారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే వెంటనే పాడి పశువుల కొనుగోలుకు ఎంపిక చేసిన చోట్లకు అధికారులు, లబ్ధిదారుల బృందాలను పంపిస్తాం.